మహానాడుకు పోటెత్తిన జనసందోహం
అంచనాలకు మించి వేలాదిగా ప్రతినిధులు హాజరు
క్రమశిక్షణకు ప్రతీకగా మహానాడు కార్యక్రమం
చెమటోడ్చి పనిచేసిన తెలుగు తమ్ముళ్లు
గోదావరి వంటకాల రుచులతో అందరికీ ఆత్మీయ ఆతిథ్యం
తెలుగుదేశం పార్టీ మహానాడు శనివారం రాజమహేంద్రవరం లో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల ఆనందోత్సాహాలతో మహానాడు బ్రహ్మోత్సవాన్ని తలపించింది. రాజమహేంద్రవరం మహానాడు తెలుగుజాతి గర్వపడేలా చరిత్రలో నిలిచిపోనున్నది. దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీలలో కానరాని క్రమశిక్షణ, నిబద్ధత ఈ మహానాడులో కానవచ్చింది. మహానాడు లో తొలిరోజు ప్రతినిధుల సభకు 15 వేలమంది రాగలరని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా అంతకు మూడు, నాలుగు రెట్లు అధికంగా ప్రతినిధులు హాజరు కావటంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. వేలాదిమంది హాజరైనా క్రమశిక్షణతో సభ జరిగింది.
తొలిరోజు పార్టీ ప్రవేశ పెట్టిన పలు తీర్మానాలపై నాయకులు చర్చించి, తర్వాత ఆమోదించారు. మహానాడు తీర్మానాలపై చర్చించేందుకు అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన నాయకులకు అవకాశం కల్పించారు. సభావేదిక సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచింది. తొలుత పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు వేదిక అంతా కలియ దిరిగి నాయకులు అందరినీ పేరుపేరునా పలకరించారు. ప్రతినిధుల సభకు హాజరైన వేలాదిమంది కార్యకర్తలకు అభివాదం చేశారు.
ఎండవేడిమి తీవ్రంగా వున్నప్పటికీ సభాప్రాంగణం లోపల వున్న వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు. పార్టీ కార్యకర్తలు, వాలంటీర్ లు నిరంతరం, త్రాగునీరు, మజ్జిగ అందజేశారు. ఘుమఘుమ లాడే గోదావరి వంటకాల రుచులు అందరినీ అలరించాయి. మహానాడు సభా ప్రాంగణంలో దాదాపు 50 వేలమందికి పైగా భోజనాలు సిద్ధం చేశారు. వేలాదిమంది కార్యకర్తలకు టిడిపి ఇచ్చిన ఆతిథ్యం మహానాడుకు మరింత వన్నె తెచ్చింది. మహానాడు ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అందర్నీ ఆకట్టుకున్నది.
తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్కడి రిజిష్టర్ లో సంతకం చేయటంతో ప్రతినిధుల నమోదు కార్యక్రమం ప్రారంభం అయింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు పార్లమెంటరీ కమిటీ కౌంటర్ లో ప్రతినిధిగా నమోదు చేసుకున్నారు. అనంతరం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రతినిధుల నమోదు కార్యక్రమం పూర్తయింది.
ప్రతినిధుల సభలో తొలుత మా తెలుగుతల్లి కి మల్లెపూదండ గీతాలాపన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ అధినేత చంద్రబాబు తొలుత తన ప్రసంగంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖల పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్ లు ప్రసంగించారు. ముందుగా అజెండా లో పొందుపరచిన విధంగా పలువురు నాయకులు వివిధ అంశాలపై ప్రసంగాలు చేశారు.