రాజమహేంద్రవరం లో నేడు, రేపు టిడిపి మహానాడు
శకపురుషుని శతజయంతి వేడుకల ముగింపు ఉత్సవం
చంద్రబాబు, లోకేష్ లు 3 రోజులపాటు రాజమహేంద్రవరంలోనే మకాం
గత కొద్దిరోజులుగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అచ్చెన్నాయుడు, పార్టీ నాయకులు
పసుపుమయం అయిన రాజమహేంద్రవరం
మహానాడు తీర్మానాలపై పొలిట్ బ్యూరోలో చర్చ
మహానాడు అతిధులకు గోదావరి రుచులతో ఆతిధ్యం
ఒకరోజు ముందుగానే జనసంద్రంగా మారిన జాతీయ రహదారి
బస్సులు నిరాకరణతో కార్యకర్తల్లో పెరిగిన కసి, పట్టుదల
గొదావరిలొ పడవల ద్వారా తరలివస్తున్న ప్రజానీకం
…….
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు రంగం సిద్ధమైంది. ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడును పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకోవటం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మహానాడుతో పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతి కలసి రావటంతో అది బ్రహ్మోత్సవంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారంతా ఈ మహానాడును గత కొద్దిరోజులుగా తమ ఇంటిపండుగగా జరుపుకుంటున్నారు. ఆ క్రమంలోనే తుది ఘట్టంగా 27 ,28 తేదీలలో రాజమహేంద్రవరంలో జరిగే మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహానాడు కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు, యావత్ తెలుగుజాతికే పండుగ. శకపురుషుని శతజయంతి వేడుకలసందర్భంగా జరిగే ఈ బ్రహ్మోత్సవానికి రాజమహేంద్రవరంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
రాజమహేంద్రవరం నగరమంతా పసుపు మయం అయింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు ఒక రోజుముందుగానే శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకున్నారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గత కొద్దిరోజులుగా రాజమహేంద్రవరం లోనే మకాం చేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. చెన్నై, కోల్ కత్తా జాతీయ రహదారితో పాటు రాజమహేంద్రవరం కు దారి తీసే రహదారులన్నీ పసుపుమయం అయ్యాయి. ఒకరోజు ముందునుంచే జనప్రవాహం రాజమహేంద్రవరం వైపు పరవళ్ళు తొక్కసాగింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ మహానాడును నిర్వహిస్తున్నారు.
రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వద్ద ఈ మహానాడుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు సైతం మూడు రోజుల పాటు మహానాడు జరిగే సభా ప్రాంగణంలోనే వుండేవిధంగా వసతి ఏర్పాట్లు చేశారు. మహానాడు లో 28 వ తేదీన జరుగనున్న బహిరంగ సభకు దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు ప్రజానీకం హాజరుకాగలరని అంచనా వేస్తున్నారు. తొలిరోజు శనివారం 10 నుంచి 15 వేలమందితో ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. మహానాడుకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకానికి ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా అన్నీ జాగ్రత్తలు పాటిస్తూ సౌకర్యాలు ఏర్పరచారు.
రక్తదానం శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్, ప్రెస్ గ్యాలరీ, భోజనశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి హాజరయ్యే ప్రతినిధులకు గోదావరి రుచులు చూపించేవిధంగా వంటకాలు సిద్ధం చేస్తున్నారు. నెల రోజుల ముందుగానే రాజమహేంద్రవరం లోని హోటళ్లు, కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌస్ లు అన్నింటిని తెలుగుదేశం నాయకులు బుక్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి వాటిల్లో వసతి కల్పిస్తారు. మహానాడు ప్రాంగణంతో పాటు జాతీయ రహదారి వెంబడే ఇరువైపులా భారీ హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు, కటౌట్ లు ఏర్పాటు చేశారు. పార్టీ పథకాలు, తోరణాలతో రాజమహేంద్రవరం నగరమంతా పసుపు కళ సంతరించుకున్నది.
కీలక తీర్మానాలు
మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. రాజమహేంద్రవరం లో శుక్రవారం సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. వాటిని శనివారం జరిగే ప్రతినిధుల సభలో ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో వుంచుకొని పార్టీ అధినేత కొన్ని కీలక ప్రకటనలు చేయగలరని భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దైనందిన జీవనం భారంగా పరిణమించింది. ఉద్యోగ, ఉపాధి రంగాలు కుదేలై భవిష్యత్ అంధకారంగా మారింది.
అంతేగాకుండా రాష్ట్రంలో అభివృద్ధి మృగ్యమై మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. వీటన్నింటికి తోడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ పరిణామాల నేపధ్యంలో నైరాశ్యంలో మగ్గిపోతున్న రాష్ట్ర ప్రజానీకం తెలుగుదేశం పార్టీ పై కొండంత ఆశతో ఎదురుచూస్తోంది. తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు ఈ మహానాడు వేదికగా ఒక భరోసా ఇవ్వనున్నారు. అంతేగాక రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి ప్రణాళిక, వివిధ వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో చేయనున్న తీర్మానాలు, కీలక ప్రకటనలపై దేశవ్యాప్తంగా వున్న అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.
కార్యకర్తల్లో పెరిగిన కసి, పట్టుదల
మహానాడు సభకోసం ఆర్టీసీ బస్సులను కేటాయించాలని టిడిపి నాయకత్వం చేసిన విజ్ఞప్తిని అధికారయంత్రాంగం తోసిపుచ్చింది. అద్దె ప్రాతిపదికపై ఆర్టీసీ బస్సులు కేటాయించకుండా అడ్డుకున్న వైసీపీ నాయకులు చివరకు ప్రయివేటు బస్సులు, స్కూలు బస్సులను సైతం ఇవ్వకుండా వారిని బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేగాకుండా మహానాడు సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లపై వైసీపీ నాయకులు వారి పార్టీకి సంబందించినవి ఏర్పాటు చేయటం వివాదాస్పదం అయింది. వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా టిడిపి శ్రేణులను రెచ్చగొడుతున్న వాతావరణం కనిపిస్తోంది.
గత ఏడాది ఒంగోలులో జరిగిన మహానాడులో సైతం ఇదే విధమైన పరిస్తితి ఏర్పడింది. తాజాగా అవే సంఘటనలు పునరావృతం కావటంతో కార్యకర్తలలో మరింత కసి, పట్టుదల పెరిగింది. రైళ్లు, విమానాలు, సొంత వాహనాలుతో పాటు ద్విచక్ర వాహనాలపైనా రాజమహేంద్రవరం కు తరలి వస్తున్నారు. గోదావరి పరిసర ప్రాంతవాసులు ఎడ్లబండ్ల పైన సైతం 28 వ తేదీన జరుగనున్న సభకు తరలివచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా గోదావరికి ఇరువైపులా వున్న దూర ప్రాంత ప్రజలు పడవలు, లాంచీలపై మహానాడుకు పెద్దఎత్తున తరలిరావటం సామాన్య ప్రజానీకంలో వున్న ఆసక్తికి దర్పణం పడుతుంది.