- ఐదేళ్లలో జరిగిన నష్టం పరిశీలనకు కమిటీలు
- సామగ్రి దొంగలపై చర్యలు తీసుకుంటాం
- మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అమరావతిలో పర్యటిస్తారని పురపాలకశాఖ, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి పీ నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక వద్ద నుంచి పర్యటన ప్రారంభమవుతుందని చెప్పారు. రాజధానిలో నిలిచిపోయిన పనులను, సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం అక్కడే చంద్రబాబు మీడియాతో మాట్లాడతారని చెప్పారు. ముందుగా కమిటీలు వేసి రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలించి, అంచనా వేస్తామని మంత్రి వివరించారు. టెండర్ల కాలపరిమితి ముగిసినందున కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. దీనికోసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందన్నారు. పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధానిలో సామగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. రాజధానిలో ఇళ్ల స్థలాల అంశం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయసలహా తీసుకుని ముందుకెళ్తామని మంత్రి తెలిపారు.