- పారిశ్రామిక పునరుజ్జీవన చర్యలతో సత్ఫలితాలు
- రూ.7లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రఖ్యాత సంస్థలు
- మా లక్ష్యసాధనకు అశోక్ లేలాండ్‌వంటివి పెద్ద దన్ను
- ఎస్క్రో ఖాతా ద్వారా సంస్థలకు నేరుగా ప్రోత్సాహకాలు
- విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ
అమరావతి (చైతన్య రథం): బ్రాండ్ ‘‘బాబు’’ తిరిగొచ్చారు. బ్రాండ్ ఏపీ తిరిగొచ్చింది. ఇటీవల నేను ఢల్లీిలో ఒక ప్రముఖ ఛానల్ ఫైర్‌సైడ్ చాట్‌కు వెళ్ళాను. అక్కడ సీనియర్ జర్నలిస్ట్ నన్ను తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి, మరికి ఏపీకి ఏంఉందని అడిగారు. ఏపీలో సీబీఎన్ ఉన్నారని గర్వంగా చెప్పాను. ఈరోజు మేం చంద్రబాబునాయుడుపై అదే నమ్మకంతో ముందుకు సాగుతున్నాం’ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంటును మంత్రి లోకేష్ ప్రారంభించారు. తొలుత అశోక్ లేలాండ్ తయారు చేసిన డబుల్ డెక్కర్ బస్సులో ప్లాంటుకు వచ్చారు. ప్లాంటు ఆవరణలో మొక్కనాటిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్లాంటును ప్రారంభించారు. తర్వాత అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసిన ఎంఎస్ ఆర్టీసి బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… మల్లవల్లిలో అశోక్ లేలాండ్ అత్యాధునిక బస్సు తయారీ కర్మాగారం ప్రారంభోత్సవానికి ఈరోజు ఇక్కడ ఉండటం ఒక గౌరవం గా భావిస్తున్నాను. 2023 ఆగస్టు 24న నా పాదయాత్ర సందర్భంగా నేను మల్లవల్లికి వచ్చినపుడు అశోక్ లేలాండ్‌ను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చాను. అది నేడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. అశోక్ లేలాండ్, హిందూజా గ్రూపునకు చెందిన పెద్దలు, పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులకు నా అభినందనలు. దేశచరిత్రలో మరే ఇతర రాజకీయ పార్టీ ప్రకటించని విధంగా అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చాం. మీరు సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి మరో 4 పరోక్ష ఉద్యోగాలు తోడై రాష్ట్రాభివృద్ధికి ఊతమిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక పునరుజ్జీవనానికి చిహ్నంగా మార్చేందుకు మీవంటి వారి భాగస్వామ్యం మాకు శక్తినిస్తుంది. స్థిరమైన అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. ప్రకాశవంతమైన, పచ్చని, స్థిరమైన రేపటి భవితవైపు ముందుకు సాగుదాం. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందుతున్న పెట్టుబడులకు గమ్యస్థానంగా, తయారీరంగంలో అగ్రగామిగా నిలుపుదాం.
గత ప్రభుత్వ చర్యలకు పారిపోయిన పరిశ్రమలు
2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది, దీనివల్ల వ్యాపారాలు సజావుగా నడవడమే కష్టమైంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (%ూూA%) రద్దు వంటి తిరోగమన విధానాలు రాష్ట్రంలో అనిశ్చితిని సృష్టించాయి, అనేక కంపెనీలను వేధించడంతో వారు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. ఎపిలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల్లో ఒకరైన అమర రాజా వంటి ప్రఖ్యాత పెట్టుబడిదారులు, లులు వంటి పెద్ద సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయి. జాకీ వంటి కంపెనీలు కూడా రాష్ట్రం నుండి పొరుగురాష్ట్రాలకు తరలివెళ్లాయి. దురదృష్టవశాత్తు గతపాలనలో నష్టపోయిన పారిశ్రామిక సంస్థల్లో అశోక్ లేలాండ్ కూడా ఒకటి. 1360 ఎకరాల్లో 2014-19 నడుమ టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన మల్లవల్లి పారిశ్రామిక పార్కును వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసింది. మేము ఒప్పందాలు చేసుకున్న 450 కంపెనీల్లో చాలావరకు గత వైసీపీ పాలకుల వేధింపుల కారణంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదు.
పరిశ్రమదారుల్లో విశ్వాసానికి చర్యలు
రాష్ట్రానికి కొత్త పెట్టుబడుదారులను ఆహ్వానించే ముందు మేము వారిలో విశ్వాసాన్ని కలిగించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఈ ప్లాంట్ అశోక్ లేలాండ్‌కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అశోక్ లేలాండ్ కు కేటాయించిన 75 ఎకరాల్లో 40 ఎకరాల్లో ప్లాంటును అభివృద్ధి చేశారు. ఈ ప్లాంట్ ఏటా 4,800 బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది అశోక్ లేలాండ్ నిబద్ధతను సూచిస్తుంది.
ఈ ప్లాంట్ ద్వారా లభించే ఉపాధి అవకాశాలపై నేను ఆనందిస్తున్నాను. మొదటిదశలో 600 ఉద్యోగాలు, రెండో దశలో 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇది పరిసర ప్రాంతాలను శక్తివంతం చేయడమేగాక సామాజిక-ఆర్థిక వృద్ధి పెంపుదలకు దోహదపడుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారుచేయడం అనేది మా ప్రభుత్వ ముఖ్య లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ లభించే ఉద్యోగాలు కేవలం సంఖ్య కాదు, అవి జీవనోపాధిని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చి బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలుస్తాయి. అశోక్ లేలాండ్ బీఎస్6 బస్ మోడళ్ల ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వెహికల్ బాడీ బిల్డింగ్ సామర్థ్యం స్థిరమైన అభివృద్ధి, నిబద్ధతకు నిదర్శనం. ఇది ప్రధాని మోదీ సంకల్పమైన ‘ఆత్మ నిర్భర్ భారత్’ లక్ష్యాలను చేరుకునేందుకు సహయపడుతుంది. దార్శనికత, అధునాతన పర్యావరణ వ్యవస్థ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఉపకరిస్తుంది.
సామాజిక బాధ్యతలోనూ అశోక్ లేలాండ్ మేటి!
క్లీనర్ టెక్నాలజీలు, స్థిరమైన పద్ధతులను స్వీకరించడం ద్వారా అశోక్ లేలాండ్ ఒక బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తోంది. ఆర్థిక వృద్ధి, పర్యావరణ బాధ్యత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనడాన్ని ఇది సూచిస్తుంది. 50కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వాహన పరిశ్రమలకు అశోక్ లేలాండ్ మార్గదర్శకంగా నిలుస్తోంది. విద్యుత్ నుండి సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్-శక్తితో నడిచే వాహనాల వరకు ప్రత్యామ్నాయ ఇంధనాల్లో వారి ఆవిష్కరణలు పరిశ్రమకు బెంచ్‌మార్క్‌ను నిర్దేశించాయి. పరిశుభ్రత, పచ్చదనాన్ని కాపాడటంలో వారి నిబద్ధత ప్రశంసనీయం. అభివృద్ధి చెందుతున్న వాహన డిమాండ్లను ఈ ప్లాంట్ తీర్చగలదనే నమ్ముతున్నాను. అశోక్ లేలాండ్ బృందం దూరదృష్టి, ఆవిష్కరణలకు ఈ ప్లాంటు నిదర్శనం. అశోక్ లేలాండ్ వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు ప్రశంసనీయం. ‘రోడ్ టు స్కూల్,’ ‘రోడ్ టు లైవ్‌లిహుడ్,’ ‘జల్ జీవన్’ వంటి కార్యక్రమాలు సామాజికాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించాయి. యువతకు సాధికారత కల్పించడమేగాక ఎంతోమంది జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఈ చొరవ సమాజం పట్ల వారికి గల చిత్తశుద్ధి, బాధ్యతను ప్రతిబింబిస్తుంది. వ్యాపారంతోపాటు సమాజాభివృద్ధి కార్యక్రమాలను ఎలా ముందుకు నడిపించవచ్చో అశోక్ లేలాండ్ ఉదాహరణగా నిలుస్తుంది.
ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు
ప్రభుత్వపరంగా వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్థిరమైన విధానాలతో మేం ముందుకు సాగుతున్నాం. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించాం. ఫలితంగా ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఎల్జీ, టాటా పవర్ వంటి ప్రధాన సంస్థలు గత తొమ్మిది నెలల్లో రూ.7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వచ్చాయి. వీటిద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ పెట్టుబడులు కేవలం పారిశ్రామిక వృద్ధి, వ్యాపార వేగాన్ని సూచించడమేగాక ఆంధ్రప్రదేశ్‌లో నవశకం ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పైన మా నాయకత్వంపైన నమ్మకం ఉంచినందుకు అశోక్ లేలాండ్, హిందూజా గ్రూప్ అధినేతలు అశోక్ హిందూజా, ధీరజ్ హిందూజా, షోమ్ హిందూజా, షేను అగర్వాల్, గణేష్ మణి, స్విచ్ మొబిలిటీకి చెందిన మహేష్ బాబులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఎస్క్రో ఎకౌంట్ ద్వారా నేరుగా జమ చేస్తాం. ఏపీలో యువ ఐఏఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వారు మీకు పూర్తి సహకారం అందిస్తారు. మా దార్శనికతపై అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ప్రాజెక్టును… కేవలం తొమ్మిది నెలల్లోనే అశోక్ లేలాండ్ నిజం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా, ఇతర ప్రపంచస్థాయి సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, కలెక్టర్ డికె బాలాజీ, ఏపీఐఐసి చైర్మన్ రామరాజు, ఎండి అభిషిక్త్, ఆర్ టిసి ఎండి ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, హిందూజా అధినేత అశోక్ హిందూజా, అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందూజా, ఎండి షేనూ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.