.త్వరలో డిల్లీ పెద్దల దృష్టికి మాధవ్ గలీజు వ్యవహారం
.సలహాదారు సజ్జల దిగజారుడు వ్యాఖ్యలు
.వైసిపి అనుబంధ విభాగంలా మహిళా కమిషన్
.మహిళలకు భరోసా ఇవ్వని జగన్ సిఎం పదవికి అనర్హుడు
.జగన్ సర్కారుపై మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం
విజయవాడ: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండతోనే గోరంట్ల మాధవ్ లాంటి మానవ మృగాలు అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా హక్కుల పరిరక్షణ సమితి తీవ్రస్థాయిలో విరుచుకుపడిరది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ బూతు వీడియో బాగోతంపై చర్యలు తీసుకోకపోవడం సహా మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలు, లైంగిదాడుల ఘటనలను నిరసిస్తూ ఏపీ మహిళా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని స్వర్ణప్యాలెస్ లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అధ్యక్షత వహించగా, టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ, లోక్ సత్తాతోపాటు పలు మహిళాసంఘాల నుంచి నేతలు హాజరయ్యారు. గోరంట్ల మాధవ్ వంటి వారిపై చర్యలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి నేరస్థులకు అండగా నిలిచిన వ్యవహారాన్ని ఢల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం, మహిళా ఎంపీలు, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని అఖిలపక్షం నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దాడులను సమావేశం తీవ్రంగా ఖండిరచింది.
ఫోరెన్సిక్ పేరుతో జగన్ రెడ్డి నాటకాలు: వంగలపూడి అనిత
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో బాగోతం బయటపడి వారంరోజులు గడుస్తున్నా నేటికీ చర్యలు తీసుకోకుండా జగన్ రెడ్డి చోద్యం చూస్తున్నాడని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ఫోరెన్సిక్ నివేదిక పేరుతో వైసీపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందన్నారు. స్వతహాగా నేరస్థుడైన జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో నేరస్థులకు, రేపిస్టులకు రాజకీయ పునరావాసం కల్పిస్తున్నారని, జగన్ చేతకానితనాన్ని అలుసుగా తీసుకుంటున్న వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలను చెరపడుతూ అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సజ్జల వ్యాఖ్యలు సిగ్గుచేటు: సుంకర పద్మశ్రీ
ప్రజా ప్రతినిధిననే విషయం మరిచి అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించిన గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోకపోగా ఆ వీడియో బాగోతం మాధవ్ ప్రైవేటు వ్యవహారమని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మహిళా కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కేవీపీ రామచంద్రారావు ప్రభుత్వ సలహాదారుడిగా ఎంతో హుందాగా ఉండేవారన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను మాత్రమే మాట్లాడేవారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి జుగుప్సాకరమైన అంశం అంటూనే.. నిజమైతే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇప్పటి వరకు ఎవరిపై ఏం చర్యలు తీసుకున్నారు? అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ల పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రతిపక్షాలు, గళం విప్పుతున్న మా వంటివారిని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఒక గదిలో రహస్యంగా జరిగిన అంశాన్ని వేలెత్తి చూపాల్సిన అవసరమేముంది? ఏం కొంపలు మునిగాయని సజ్జల పేర్కొనడం సిగ్గుచేటు. గోరంట్ల మాధవ్ ముఖం చూడటానికే అసహ్యమేస్తోంది. ఇంకా చాలా వీడియోలు బయటికి వస్తున్నాయి. మహిళలకు ఇటువంటి వీడియోలు చూపడానికా అధికారం ఇచ్చిందని పద్మశ్రీ నిలదీశారు.
గన్ను కంటే ముందొస్తానన్న జగన్ ఎక్కడ?:
సిపిఐ నాయకురాలు దుర్గాభవానీ
ప్రజలకు కష్టమొస్తే గన్ను కంటే ముందు వస్తాడన్న జగన్ ఎక్కడని సిపిఐ రాష్ట్ర నాయకురాలు దుర్గాభవాని ప్రశ్నించారు. మూడేళ్లుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న విపక్షాలపై ముందూ, వెనుకా చూడకుండా అకారణంగా కేసులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం..సొంత పార్టీ ఎంపీ నికృష్టమైన వ్యవహారంలో అతడ్ని రక్షించడం దుర్మార్గపు చర్య కాదా అని ప్రశ్నించారు.
జగన్ ఉదాశీన వైఖరే నేరస్థులకు అస్త్రం:
వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి
జగన్మోహన్ రెడ్డి ఉదాసీన వైఖరి నేరస్తులకు అస్త్రంగా మారిందని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బొల్లినేని కీర్తి పేర్కొన్నారు. ప్రతి దశలోనూ స్త్రీలు నాయకులుగా ఎదగాలని తాము కోరుకుంటున్నామని, దురదృష్టవశాత్తు రాష్ట్రంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. గోరంట్ల మాధవ్ నీతిమాలిన చర్యపై చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడమంటే అతని చర్యలను ముఖ్యమంత్రి సమర్ధించినట్టేనన్నారు.
వైసిపి అనుబంధ విభాగంలా మహిళా కమిషన్: రావి సౌజన్య
మూడేళ్ల వైసీపీ పాలనలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలమయ్యామని, మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఏపీ మహిళా కమిషన్ వైసీపీ అనుబంధ విభాగంలా పనిచేస్తోందని జనసేన నేత రావి సౌజన్య దుయ్యబట్టారు. దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు ప్రచారానికే పరిమితమయ్యాయని సౌజన్య విమర్శించారు.
జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు: మాలతి
మహిళలకు రక్షణ కల్పించలేని, శాంతిభద్రతలను పర్యవేక్షించలేని జగన్మోహన్ రెడ్డి తన చేతకానితన్ని ఒప్పుకుని ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని లోక్ సత్తా నాయకురాలు మాలతి పేర్కొన్నారు. మూడేళ్లుగా మృగాళ్లు పేట్రేగిపోతున్న విధానం, వారిని శిక్షించడం పట్ల జగన్ అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు.
అఖిలపక్షం సమావేశం తీర్మానాలు:
1. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించాలి.
2. ప్రజా ప్రతినిధులు మహిళలను గౌరవించేలా పలు కార్యక్రమాల నిర్వహణ.
3. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి.
4. మాధవ్ వీడియాకాల్ ఘటనసహా మూడేళ్లుగా రాష్ట్రం లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైం గిక దాడులపై జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ.
5. మహిళలపై అకృత్యాలు నిత్యకృత్యమైనా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మహిళా మంత్రులు, మహిళా ఎంపీలను కలిసి వివరించడం.
6. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కిరాతకులకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలని కేంద్రాన్ని కోరడం.
7. మహిళలపై వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పార్టీలకు అతీతంగా పోరాటం.
8. ట్విట్టర్ వేదికగా సిగ్నేచర్ క్యాంప్ నిర్వహణ.
9. అఖిలపక్ష సమావేశానికి వచ్చిన వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి బాధిత మహిళలకు అండగా నిలబడేందుకు పలు చర్యలకు శ్రీకారం చుట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
కార్యాచరణలో భాగంగా త్వరలో ఆంధ్రప్రదేశ్ మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డిల్లీ వెళ్లి మాధవ్ వ్యవహారంతో సహా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలను కేంద్ర పెద్దలు, జాతీయ మహిళా కమిషన్ కు విన్నవించనున్నట్లు మహిళా హక్కుల పరిరక్షణ సమితికి నేతృత్వం వహిస్తున్న వంగలపూడి అనిత పేర్కొన్నారు.