- వేలమంది టెక్ విద్యార్థులతో సీఎం చారిత్రాత్మక ప్రసంగం
- క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి క్వాంటం ప్రోగ్రామ్ నిర్వహణ
- క్వాంటం నైపుణ్యాలు పెంచటమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం
- భవిష్యత్ అవసరాలుగా తగ్గట్లుగా మానవ వనరుల అభివృద్ధి
- 10 రోజుల్లోనే 50 వేలకు పైగా టెక్ విద్యార్థుల రిజిస్ట్రేషన్
- వీరిలో 51 శాతం మహిళలే
అమరావతి (చైతన్యరథం): అమరావతి నుండి సీఎం చంద్రబాబు నవశకానికి నాంది పలకనున్నారు. అమరావతి క్యాంటం కంప్యూటర్ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ రంగంలో నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. క్వాంటం టాక్ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం టెక్ విద్యార్థులను ఉద్దేశించి చారిత్రాత్మక ప్రసంగం చేయనున్నారు. క్వాంటం ఐటీ కంపెనీలు క్యూబిట్, వైసర్ సంస్థలతో సంయుక్తంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వాంటం ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ క్వాంటం ప్రోగ్రామ్ కోసం 50 వేల మందికి పైగా టెక్ విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా..
దేశంలోనే అతిపెద్ద క్వాంటం విద్యా సదస్సులో డిజిటల్ మాధ్యమం ద్వారా మంగళవారం ఉదయం 9.30 గంటలకు విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్ మ్యాప్‌ను సీఎం వివరించనున్నారు. భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించనున్న లక్ష్యాల గురించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. క్వాంటం ప్రోగ్రామ్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం – క్యూబిట్- వైసర్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి కేవలం 10 రోజుల వ్యవధిలోనే 50 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 51 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దటంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్వాంటం ప్రోగ్రామ్‌ను చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న వారిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 3 వేల మందికి తదుపరి స్థాయి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. అలాగే ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు ఐబీఎం, టీసీఎస్, సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీఎస్‌ఐఆర్, సీడాక్, నేషనల్ క్వాంటం మిషన్‌లలో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కూడా కల్పించనున్నారు. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా వచ్చే మూడేళ్లలో ఏపీ నుంచి లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి అభయ్ కరాండికర్, ఐఐటీ చెన్నై డైరెక్టర్ ప్రోఫెసర్ కామకోటి, వైసా డైరెక్టర్ ప్రాచీ వఖారియా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.















