- అపరభగీరథుడు చంద్రబాబు బృహత్తర ప్రణాళిక
- సాకారమైతే రాష్ట్రం సస్యశ్యామలమే!
మన వ్యవసాయిక దేశం దశాబ్దాలుగా కలలు కంటున్న నదుల అనుసంధానం కలను నిజం చేసిన అపర భగీరథుడు చంద్రబాబు. కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం, పట్టిసీమతో మొదలైన ఆ పయనం ఇప్పుడు గోదావరి-పెన్నా మహా సంగమ సంకల్పమై మరో మలుపు తిరుగుతున్నది. పట్టిసీమ ఎత్తి పోతల ద్వారా నదుల అనుసంధానానికి నాంది పలికిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రకెక్కింది. కరువు రక్కసి నుండి రైతులను కాపాడే రక్షణ కవచం నదుల అనుసంధానం. విలువైన గోదావరి నదీ జలాలు సముద్రం పాలవుతున్న పరిస్థితుల్లో నదుల అనుసంధానం ద్వారా కృష్ణాకు గోదావరి జలాలు మళ్లించి వృథా జలాలను సద్వినియోగం చేసేందుకు మరోసారి సీఎం చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. వర్షాధారంపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్న రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయానికి ఎంతో స్వాంతన ప్రసాదించగల నిర్ణాయక చొరవ ఇది. ఏటా వ్యవసాయ రంగాన్ని, అన్నదాతలను అనావృష్టి అతలాకుతలం చేస్తున్న దురవస్థ నుండి దూరం చేయాలంటే, ఆంధ్రప్రదేశ్‌ను అభ్యుదయ పథంలో నడిపించాలి అంటే నదుల అనుసంధానం తప్ప మరో మార్గం లేదని గుర్తించిన చంద్రబాబు అందుకు అనుగుణంగా బృహత్తర ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిదశలో గోదావరి-కృష్ణానదుల అనుసంధానం విజయవంతం చేసి చూపించి ఇప్పుడు రెండో దశలో గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేసి మరో అద్భుతం సృష్టించబోతున్నారు.
గోదావరి-పెన్నా అనుసందానం ద్వారా రాష్ట్ర రైతాంగం భవిత, ఆర్ధిక రంగం పచ్చ తోరణమై విలసిల్లనున్నది. వానలు గతి తప్పుతున్నాయి. సాగునీటి అవసరాలు నానాటికి పెరుగుతున్నాయి. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా కృష్ణా నది దిగువకు నికరజల ధారలు తగ్గిపోతున్నాయి. మరోవైపు గోదావరి నదిలో యేటా వేల టిఎంసీలు నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు గోదావరి-పెన్నా అనుసంధానం ద్వారా నవ్యాంధ్రకు జలహారం అలంకరించాలని కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. గోదావరి వరదల సమయంలో వచ్చే నీటిని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనకచర్లకు తరలించి, అటు పోలవరం, ఇటు కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించి రాష్ట్రాన్ని కరువు రక్కసి నుండి కాపాడాలని నిర్ణయించారు. గోదావరి వరదల సమయంలో ఏటా సగటున 2 నుంచి 3 వేల టీిఎంసీిల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోన్న పరిస్థితుల్లో 280 టీఎంసీలను తరలించడం ద్వారా కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కొత్త ప్రాజెక్టుకు రూప కల్పన చేశారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలు, పరిశ్రమలకు మేలు జరగనుంది.ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత ఆయకట్టుకు ్తసాగునీరు అందుతుందని, 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునని, పరిశ్రమలకు దాదాపు 20టీఎంసీల నీటిని వినియోగించవచ్చని అంచనా. రూ.80,112 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును మూడు దశల్లో చేపట్టనున్నారు.
మొదటి దశలో రూ.13,511 కోట్లతో 187 కిలోమీటర్ల మేర పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోస్తారు. దీని కోసం కుడికాలువను 38,000 క్యూసెక్కుల స్థాయికి విస్తరించాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో ఒక లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి పది సొరంగాల ద్వారా రెండో దశలో రూ.28,560 కోట్ల అంచనా వ్యయంతో బొల్లాపల్లి రిజర్వాయరులోకి 150 టీఎంసీలు ఎత్తిపోస్తారు. ఇందుకోసం కాలువను 24 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరించి ఆరు లిఫ్టుల ద్వారా 84 కిలోమీటర్ల మేర జలాలు తరలిస్తారు. మూడో దశలో రూ.38,014 కోట్లతో బొల్లాపల్లి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 300 టీఎంసీలు ఎత్తిపోసి మూడు లిఫ్టులతో 108.4 కిలోమీటర్లు మేర నీటిని తరలిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ కింద సాగయ్యే పంటలకు కూడా సమృద్ధిగా నీటిని అందజేయవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నీటి అవసరాలను కూడా ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. గోదావరి వరద సమయంలో 280 టీఎంసీల నీటిని రాయల సీమకు తరలించవచ్చు. పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించి, ఇందులో ఒక టీఎంసీ కృష్ణా డెల్టాకు ఇవ్వాలని ప్రణాళిక. ఈ నీటిని తరలించడం కోసం పోలవరం కుడి కాలువ 17 వేల క్యూసెక్కుల సామర్ధ్యం నుంచి 28-30 వేల క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని మాత్రమే తీసుకోవడం ద్వారా గోదావరి డెల్టాకు ఈ కొత్త ప్రాజెక్టు వల్ల నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
గోదావరి-పెన్నా అనుసంధాన ప్రక్రియను చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి ఆర్ధిక సాయం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.70 నుంచి రూ.80 వేల కోట్లు ఖర్చు ప్రాజెక్టుకు అవుతుంది. 54 వేల ఎకరాల భూసేకరణ చేయాలి. 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. పెద్ద మొత్తంలో అటవీ భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే భారీ వ్యయమవుతుందని కేంద్రానికి తెలిపినట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు పొంది టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి మూడేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చెయ్యాలని జలవనరులశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు వేగంగా జరగాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయమే జీవనాధారంగా 60 శాతం పైగా ఉన్న గ్రామీణుల ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచే బృహత్తర లక్ష్యంతో అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రతి ఎకరానికి నీటి భరోసా, రైతుకు ఆర్ధిక భద్రత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్య సాధన కోసం సంక్లిష్టమైన ఆర్ధిక ఇబ్బందుల్లోనూ ఈ ప్రాజెక్టును చేపట్టారు.
నీరుకొండ ప్రసాద్