- వైసీపీ చర్యలతో విద్యుత్ శాఖకు రూ.1.29 లక్షల కోట్ల నష్టం
- వస్త్ర పరిశ్రమలకు రాయితీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం
- కొవ్వాడ అణు విద్యత్కేంద్రం పనులు వేగవంతం
- ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు, కొనుగోలుదారుల నుంచే రికవరీకి చర్యలు
- ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టీకరణ
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించి శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో మాట్లాడుతూ… 2019లో ఆంధ్రప్రదేశ్‌ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా వైసీపీ ప్రభుత్వానికి అప్పగించామని గుర్తు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలుపెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో విద్యుత్ శాఖకు మొత్తంగా రూ.1.29 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. పీపీఏలను రద్దు చేయడంతోపాటు వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ల విస్తరణను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10,000 కోట్లతో ఇష్టానుసారం విద్యుత్ కొనుగోళ్లు చేశారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యుత్ వ్యవస్థను మరలా గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని 60 శాతం విద్యుత్ కొనుగోళ్లను తగ్గించామని మంత్రి గొట్టిపాటి ప్రకటించారు. జెన్కోనుంచి రికార్డుస్థాయి విద్యుదుత్పత్తిని చేశామని చెప్పారు. విద్యుత్ శాఖకు పూర్వ వైభవం సాధించే దిశగా ముందుకెళ్తున్నామని తెలిపిన మంత్రి గొట్టిపాటి… రాబోయే రోజుల్లోనూ ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచకూడదని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కరెంట్ కోతలను తగ్గించి… రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. 200 యూనిట్లలోపు వాడే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కూడా ఉచిత విద్యుత్ పథకంతో ఎటువంటి బిల్లులు ఉండవని వెల్లడిరచారు.
లైన్ మెన్ల కొరతను అధిగమిస్తాం
శాసనసభలో గౌరవ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లైన్‌మెన్ల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఆధార్ కార్డ్ ఆధారిత విద్యుత్ కనెక్షన్ల విషయంలో వస్తున్న సమస్యలనూ పరిష్కరించి సరైన ఆధార్ కార్డు ఉన్న వారికి కనెక్షన్లను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. విద్యుదాఘాత ప్రమాదాల వలన నష్ట పోయిన వారికి అండగా ఉండటంతో పాటు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. లక్షలాది మంది ఆధారపడ్డ వస్త్ర పరిశ్రమకు విద్యుత్ రాయితీలను ఇచ్చే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పునరుత్పాదక విద్యుత్ సంస్థలకు బ్యాంక్ రుణాల సౌకర్యంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి భూకేటాయింపులు పూర్తయ్యాయని.. నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని వెల్లడిరచారు. అదేవిధంగా ఆర్డీఎస్‌ఎస్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయడంతోపాటు అధిక లోడ్, లోఓల్టేజ్ సమస్యలను పరిష్కరించడానికి సబ్‌స్టేషన్ల నిర్మాణం కూడా చేపడుతున్నామని మంత్రి వివరించారు.
గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులు…
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ -2024లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి చేసేలా ప్లాంట్లను నెలకొల్పుతామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టిందని వివరించారు. అదే విధంగా ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాల నివారణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. రైతులనుంచి దొంగిలించిన ట్రాన్స్‌ఫార్మర్లు సాధ్యమైనంత త్వరగా వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దొంగలు, వాటిని కొన్న వ్యాపారులనుంచే ట్రాన్స్‌ఫార్మర్లను రికవరీ చేస్తామని మంత్రి గొట్టిపాటి ప్రకటించారు.