- ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ
- 18వరకు పొడిగించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి
అమరావతి (చైతన్య రథం): గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి, ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గానికి ఫిబ్రవరి నెలాఖరులోగానీ, మార్చి మొదటి వారంలోగానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఓటు నమోదు కార్యక్రమాన్ని పొడిగించాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఎన్నికల కమిషన్‌ను విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ… సర్వర్లు పనిచేయక పోవడం వల్ల ఓటు నమోదు చరుగ్గా సాగడం లేదంటూ.. దీనికి ఓటర్లు బాధ్యత వహించలేరన్నారు. కంప్యూటర్ ముందు కూర్చొని ఓటు నమోదు చేసుకోవాలనుకున్నా కుదరని పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. ఓటరు నమోదు గడువుతేదీ పెంచాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2 లక్షల 26వేల 144, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షా 44 వేలు ఓట్లే నమోదయ్యాయన్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విస్తృత ప్రజానీకానికి పిలుపునిస్తూ.. గడువు ముగుస్తున్న నేపథ్యంలో పట్టభద్రులంతా బుధవారం సాయంత్రంలోపు ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఒక్కో సెగ్మెంట్‌లో 4 లక్షలు టార్గెట్ రీచ్ కావాలంటూ.. కూటమి నేతలు కసి, పట్టుదలతో నాయకుడి ఆదేశాలను తప్పక పాటించాలని రామకృష్ణ కోరారు. ఇది మంచి ప్రభుత్వం కనుక.. మనం గెలిస్తే నాయకుల్లో, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని, సమస్యలేవైనా ఉంటే నాయకుల దృష్టికి తెస్తే కచ్చితంగా పరిష్కరిస్తారన్నారు. టీడీపీ కూటమి ప్రజల ప్రభుత్వంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కితాబునిచ్చారు.
రెండు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి బలపరచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్‌లు గెలిచి తీరాలని పిలుపునిచ్చారు. గత మార్చిలో జరిగిన మూడుచోట్ల టీడీపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకన్నామని, ఆ గెలుపే 2024 మేలో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయానికి నాంది ప్రస్థావన పలికిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ సమర్థతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి పార్టీల శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
2014-15 మధ్యకాలంలో పదవ పీఆర్సీ ప్రకారం 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం, కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ ఇచ్చాం, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి 48 ఏళ్లలో మొట్టమొదటిసారిగా 1నే జీతాలిచ్చాం, మున్సిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న హైస్కూల్ హెడ్మాస్టర్‌లకు గెజిటెడ్ హోదా కల్పించాం, 506, 507 జీవోల ద్వారా మొదటిసారిగా భార్య, భర్తలను ఒకచోటికి తీసుకురావడానికి జీవోలు తెచ్చాం, సీపీఎస్ ఉద్యోగులకు గ్రాడ్యుటీ అండ్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ ద్వారా చనిపోయిన టీచర్ భార్యగానీ భర్తగానీ ఉంటే వారికి రూ.45 వేల వరకు మెరుగైన పెన్షన్ కల్పించాం.. తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన ఇన్ని విజయాలను ప్రచారం చేయాలని రామకృష్ణ కోరారు. ఉద్యోగస్థులు, టీచర్ల, వివిధవర్గాల ప్రజల అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వం పనిచేసిందని, 2019నుంచి 2024 వరకు వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని రామకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా పని చేస్తోందని, ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి సాధించడం ఖాయమని రామకృష్ణ వ్యాఖ్యానించారు.