అమరావతి (చైతన్య రథం): నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశకు మంచి అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రుల వద్ద స్పష్టం చేశారు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభిప్రాయపడ్డారు. అందుకే దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన అన్ని రాష్ట్రాలకు ప్రయోజనకరమని మంత్రివర్గంలో వివరించారు. దిల్లీ రావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫోన్ చేశారని, పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించారని తెలిపారు. ఈనెల 29 నుంచి తెదేపా, జనసేన, భాజపా ఎంపీలంతా తప్పనిసరిగా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. శనివారం రాజమహేంద్రవరంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కార్యక్రమానికి హాజరవుతానని, వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున విందు ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు మంత్రులకు వివరించారు. ఈ విందుకు పవన్‌ను కూడా ఆహ్వానించినట్టు తెలిపారు.
అమరావతిపై గొడ్డలిపార్టీ విష ప్రచారం
అమరావతిపై గొడ్డలి పార్టీ అదే పనిగా విషప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీకి ఫిర్యాదులు చేస్తూ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు. రైతుల త్యాగాలను కూడా హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కోసం రైతులు చేసిన పోరాటానికి గుర్తుగా స్మారక నిర్మాణం చేపట్టాలని లోకేశ్ సూచించగా.. సీఎం అంగీకరించారు. డిసెంబరు 1న హార్టికల్చర్ హబ్‌ను ప్రారంభించనున్నట్టు మంత్రులకు తెలిపారు. దీని అమలుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి, సీఈవోను నియమిస్తున్నట్టు వెల్లడించారు. విశాఖ రుషికొండ ప్యాలెస్‌ను పర్యాటక రంగానికి వినియోగించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. గత ప్రభుత్వ దుబారా ప్రజలకు తెలియాలంటే ప్యాలెస్‌ను సందర్శనకు అందుబాటులో ఉంచాలని పవన్ కల్యాణ్ సూచించారు. దీనిపై వెంటనే ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పెట్టుబడుల రక్షణ చట్టాన్ని జనవరి నాటికి ఆమోదించి, ఏప్రిల్ 1నుంచి అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల ప్రారంభం, పూర్తికి స్పష్టమైన క్యాలెండర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఒప్పందాలకే పరిమితం కాకుండా పరిశ్రమల నిర్మాణం, ప్రారంభం వరకు నిర్దిష్ట కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు.



















