శ్రీకాకుళం: ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిది దొంగ ప్రేమని, ఇక్కడి ప్రజలను ఉద్ధరించటానికి కాదు… దోచుకోవటానికి వస్తున్నా రని, మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో రౌడీ మాఫియాలను నడుపుతున్నారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పుంగనూరులో నలుగురు వ్యక్తులకు జరిగింది అవమానం కాదని… యావత్ ఉత్తరాంధ్రను అవమానిం చారని, ఇతర జిల్లాలకు వెళ్లాలంటే వీసా, పాస్ పోర్టు తీసుకోవాలా అని ప్రశ్నించారు.తెలుగుదేశం అధినేత చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఒక్క ఆధారం చూపించగలరా? అని నిలదీశారు. జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తామన్నారు. కాలయాపన చేసి చంద్రబాబును జైలులో వీలైనంత ఎక్కువ కాలం నిర్బంధించాలని చూస్తున్నారని, న్యాయం ఒకరోజు ఆలస్యంగా అయినా గెలుస్తుందని ఆయన అన్నారు.
చంద్రబాబు అరెస్టు మా అందరికీ బాధాకరమైన విషయమని, తితిలీ తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో కలిసి బాబు దసరా జరుపుకున్నారని, ప్రజా నాయకుడిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. దేశం మొత్తం బాబు వెంట ఉన్నారని… ఆయనకు సంఫీుభావం తెలుపుతున్నారన్నారు. టీడీపీ శ్రేణులు కేసులకు భయపడకుండా చంద్రబాబు అరెస్టుపై పోరాటం చేస్తున్నారన్నారు.
పుంగనూరులో సిక్కోలు వాసులను అవమానిం చడం దారుణమని, పుంగనూరు భారత దేశంలో లేదా?… సైకిల్ యాత్ర చేస్తున్న కార్యకర్తలను అవ మాణిస్తారా?…అంటూ రామ్మోహన్‌నాయుడు మండి పడ్డారు. మా జిల్లా వాసులను బట్టలు విప్పి పెద్దిరెడ్డి అనుచరులు అవమానించారన్నారు. పెద్దిరెడ్డి రాయల సీమ పరువు తీస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో మిథున్ రెడ్డి తనను అవమానించే ప్రయత్నం చేశారని, ఇప్పు డు శ్రీకాకుళం జిల్లా వాసులను అవమానించారని.. పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని, నిరసన చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, సైకిల్ యాత్ర చేస్తున్న బీసీ వ్యక్తులని నోటికివచ్చినట్టు మాట్లాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్, మంత్రులు ఈ ఘటనపై ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా వ్యక్తులను అవమానిస్తే ఈ ప్రాంత మంత్రులు నోరు మూసుకుంటారా? అని నిలదీశారు. ఉత్తరాంధ్ర రాజధాని పేరిట వస్తున్నది మమ్మల్ని అవమానించటానికా?.. రాజారెడ్డి రాజ్యాంగం వద్దనుకునే విజయలక్ష్మిని వైజాగ్ ప్రజలు ఓడిరచారన్నారు. పెద్దిరెడ్డి అండతో ఆయన అనుచరులు చెలరేగిపోతున్నారని, పోలీసులు ఏం చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.