- ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఫిర్యాదులపై మంత్రులతో చర్చ
అమరావతి (చైతన్య రథం): ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు తేల్చి చెప్పారు. కేబినెట్ సమావేశం అనంతరం ఉచిత ఇసుక విధానంపై మంత్రులతో ఆయన చర్చించారు. ఉచిత ఇసుక విధానం ఫిర్యాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. 10 రోజుల్లో మార్పు రాకుంటే ఉపేక్షించనని ఖరాఖండిగా చెప్పారు. ఏ స్థాయిలో తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక విరివిగా దొరకాలన్నారు. అన్ని బంధనాలు తొలగించి, రవాణా, తవ్వకం ఛార్జీలు కూడా వీలైనంత తక్కువ ధర ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉచిత ఇసుక అందించి తీరాలని తేల్చి చెప్పారు. ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయవద్దని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఇసుక అక్రమాలు జరగకుండా ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఆంక్షల పేరిట అధికారులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కొందరు మంత్రులు సీఎం దృష్టికి తెచ్చారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని.. ఇకపై అలా ఉండకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.