- అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించండి
- 23వ రోజు మంత్రి లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు విన్నపాల వెల్లువ
- సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ
అమరావతి(చైతన్యరథం): ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’కు విన్నపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఉండవల్లిలోని నివాసంలో 23వ రోజు శుక్రవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి వినతిని స్వీకరించిన మంత్రి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను శాఖలవారీగా విభజించి పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ అండతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సాకే కుల్లాయప్ప మంత్రి నారా లోకేష్ ను కలిశారు. గత వైసీపీ ప్రభుత్వ అండతో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసే ఎమ్‌ఎస్ రమణప్ప తనపై అక్రమ కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. అతడి నుంచి ప్రాణహాని ఉందని, విచారణ చేసి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ లో పనిచేస్తున్న 203 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సిబ్బంది.. మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఏపీ సమగ్ర శిక్ష సొసైటీలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాభివృద్ధి కోసం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 1350 మంది ఐఈఆర్పీలను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఏపీ భవిత స్పెషల్ ఎడ్యుకేటర్ ఫెడరేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
తమ కుమారుడికి కొడగెహళ్లి ఏపీఆర్‌ఎస్ పాఠశాలలో ఐదో తరగతి సీటు కల్పించాలని సత్యసాయి జిల్లా ఉప్పెడిపల్లికి చెందిన బి.వెంకటేష్ కోరారు. పుట్టుకతో దివ్యాంగుడినైన తాను డిగ్రీ వరకు చదివానని, ఉద్యోగం కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా దేచర్లకు చెందిన వెలగాల వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో అంధుడినైన తనకు గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్ తొలగించిందని, తిరిగి పునరుద్ధరించాలని మాచర్లకు చెందిన ఎమ్.కొండలరావు కోరారు. ఆయా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
అప్పు చెల్లించకుండా పోలీసు అధికారి బెదిరిస్తున్నారు
తమ వద్ద 8 ఏళ్ల క్రితం రూ.5 లక్షల అప్పు తీసుకున్న పోలీసు అధికారి తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతలకు చెందిన మిక్కిలి మరియమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేసి, ప్రస్తుతం అనంతపురం ఏఎస్పీగా ఉన్న తియోఫిలాస్‌కు పొలం తాకట్టుపెట్టి అప్పు ఇచ్చాం. ఇంతవరకు చెల్లించలేదు. జగన్ రెడ్డి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. ఈ విషయంపై 2022లో అప్పటి డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. భర్త లేని తనకు పొలమే జీవనాధారం అని, విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యసాయం అందించి ఆదుకోండి
బుర్రకథల ద్వారా ప్రజలను చైతన్యపరచిన తనకు కళాకారుల పెన్షన్ అందించి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం నవులూరుకు చెందిన షేక్ షంషున్నీసా విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు జీవనాధారం లేదని, విజయవాడ రైతు బజార్ లో జీవనోపాధి కల్పించి ఆదుకోవాలని కుంచనపల్లికి చెందిన సాగి చంద్రశేఖర్ రావు కోరారు. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయానని, అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన పి.వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యానికి గురై తమ తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారని, తాము నలుగురం ఆడపిల్లలమని, ఏ ఆధారం లేని తమకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరి 20వ వార్డుకు చెందిన శ్రీదేవి, వెంకటలక్ష్మి, శిరీష, నాగప్రియ కోరారు. బ్లడ్ క్యాన్సర్ తో చికిత్స పొందుతున్న తన 11 ఏళ్ల కుమార్తెకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సాయం అందించాలని ఉండవల్లికి చెందిన మేకల ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.