- సత్వరం ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
- కేంద్రానికి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి
అమరావతి(చైతన్యరథం): శతాబ్దాలుగా చేనేత రంగానికి, ముఖ్యంగా పట్టు చీరల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన శ్రీసత్యసాయి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ధర్మవరంలో ‘హ్యాండ్లూమ్ క్లస్టర్’ ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర జౌళి, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను జతచేస్తూ కేంద్ర మంత్రికి సత్యకుమార్ లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. అత్యుత్తమ నాణ్యతతో కూడిన చేనేత, పట్టు చీరల తయారీ నిపుణులకు ధర్మవరం పుట్టినిల్లని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ధర్మవరం నియోజకవర్గానికి తాను శాసనసభ్యునిగా ప్రాతినిథ్యం వహించటం యాదృచ్ఛికమని ఆయన తెలిపారు. ఆధునిక యాంత్రిక యుగంలో పవర్‌లూమ్స్ విపరీతంగా పెరిగిపోతుండటంతో ధర్మవరం సంప్రదాయ పట్టు చీరల తయారీ రంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోందని, దీంతో ఈ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం గణనీయంగా తగ్గి వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సవాళ్ళ ఊబిలో చిక్కుకున్న ధర్మవరం చేనేత, పట్టు చీరల ఉత్పత్తి రంగాన్ని గాడిలో పెట్టేందుకు తాను పంపుతున్న డీపీఆర్‌లో పలు ప్రతిపాదనలు చేసినట్లు మంత్రి సత్యకుమార్ పేతర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా వ్యాప్తంగా దాదాపు 28,500 కుటుంబాలు, ప్రత్యేకంగా ధర్మవరం ప్రాంతంలో 12,800 కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని, చేనేత కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని వారి జీవితాలను చక్కదిద్దేందుకు, ఈ రంగంలో తగిన పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకు తాను ప్రతిపాదించిన చర్యలు ఉపయోగపడతాయని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. దాదాపు రు.30 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిస్తున్న ధర్మవరం హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటులో 80 శాతం మేర నిధులు (సుమారు రు.24 కోట్లు) కేంద్రం భరిస్తే, మిగిలిన 20 శాతం నిధులు (రు.6 కోట్ల)ను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని లేఖలో వివరించారు.