అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు ఎడాపెడా హామీలిచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వాటిని పూర్తిగా విస్మరించారన్నారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి లోకేష్ ఒక లేఖ రాశారు. జగన్ గారు.. మీరు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు, అగ్రిగోల్డ్ విషయంలో మా టీడీపీ ప్రభుత్వంపైనా, నా పైనా చేసిన ఆరోపణలు, చిమ్మిన విషం మీరు మరిచిపోయుంటారు. కానీ మేము మరిచిపోలేదు. నాటి సీఎం వైఎస్ పాలనలో పుట్టిన అగ్రిగోల్డ్, ఆయన హయాంలోనే కుంభకోణానికి పాల్పడిరది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులు 21 వేల ఎకరాలు అటాచ్ చేసి, యాజమాన్యాన్ని అరెస్టు చేయించి, బాధితులకు న్యాయం చేసింది. అయినా మాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రతిపక్షనేతగా హామీలిచ్చి, గద్దెనెక్కాక మీరు చేసిన మోసంతో రోడ్డున పడిన అగ్రిగోల్డ్ బాధితులు ఇటీవలి యువగళం పాదయాత్రలో నన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న సొమ్ములేవీ? మా టీడీపీ ప్రభుత్వం డిపాజిటర్లకి ఇవ్వడానికి సిద్ధం చేసిన రూ.250 కోట్లు పంపిణీ చేయకుండా అడ్డుకుని, తీరా అదే సొమ్ములో 14 కోట్లు తగ్గించి, 22 వారాల తరువాత 236 కోట్లే పంపిణీ చేసి చేతులు దులుపుకున్న మీ తీరుతో బాధితులు మరింత వేదనకు గురయ్యారు. మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్న మీ పాలనలో.. చనిపోయిన 600 మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్కరి కుటుంబానికైనా ఇస్తామన్న రూ.10 లక్షల పరిహారం ఇచ్చారా? కనీసం పరామర్శ చేశారా? ఇదేనా మీ మానవత్వం? 2014-19 మధ్యలో బలవన్మరణాలకు పాల్పడిన 142 మంది అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు 5 లక్షల వరకూ ఎక్స్ గ్రేషియా నాటి మా టీడీపీ ప్రభుత్వం అందించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసిన టీడీపీి ప్రభుత్వంపై మీరు చేయని ఆరోపణ లేదు. నేను అగ్రిగోల్డ్ భూములు కొట్టేశానని బరితెగించి రాయించారు. మీరు సీఎం అయి ఐదేళ్లయినా అగ్రిగోల్డ్ కి చెందిన ఒక్క సెంటు ఆస్తి అయినా అటాచ్ చేయలేదు ఎందుకు? అగ్రిగోల్డ్ ఆస్తులపై మీరు, మీ అనుచర గణం కన్నేసి దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికీ ఇంకా మిగిలిన 10 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లకి మీరు దిగేలోగానైనా వారికి రావాల్సిన రూ.3080 కోట్లను చెల్లించి న్యాయం చేయాలని లోకేష్ కోరారు.