- జీవనాడిపై జగన్ బ్యాచ్ దుష్ప్రచారం
- అవినీతి పత్రిక సాక్షి, వైసీపీపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల
- మండలిలో అంకెలు, ఆధారాలు, జీవోల ప్రదర్శన
- ఎత్తు తగ్గింపు ప్రతిపాదన పాపం జగన్‌దేనని నిరూపణ
- వైసీపీ అబద్ధాలకు, ఆరోపణలకు ఒక్క ఆధారమైనా చూపించాలని సవాల్
అమరావతి (చైతన్యరథం): పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ఏపీ జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించినట్లే ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించాలనే ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలోనే తెరమీదకు వచ్చిందన్నారు. శాసన మండలిలో శుక్రవారం సభ్యుల ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానమిచ్చారు. తగ్గించిన ఎత్తు ప్రకారం అవసరమైన నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అప్పటి సీఎం జగన్ లేఖలు రాశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సభలో చూపించారు. 2020 వరకు ఫేజ్ 1, 2 అనేది లేదని, ఆ తర్వాతే రెండు ఫేజ్‌లుగా మార్చారని విమర్శించారు. చేసిందంతా చేసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారంటూ వైసీపీ సభ్యులు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షిలో రాసిన తప్పుడు వార్తలను వైసీపీ సభ్యులు సభలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలాగా తాము మోసం, దగా చేయబోమని, పూర్తి స్థాయి ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలోనే ఎత్తు తగ్గింపు ప్రతిపాదన
2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులను ఆధారాలతో సహా మంత్రి వివరించారు. తరువాత వచ్చిన (2019-24) వైసీపీ ప్రభుత్వం పోలవరానికి ఎలా ఉరివేసింది, ఏ రకంగా అన్యాయం చేసిందీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వం జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలను తేదీలతో సహా చదివి వినిపించి వైసీపీ దుష్ప్రచారాన్ని, చెబుతున్న అబద్ధాలను బట్టబయలు చేశారు. వైసీపీ సభ్యులకు దమ్ముంటే పోలవరం ఎత్తు తగ్గింపు అనే పచ్చి అబద్ధాన్ని నిరూపించే ఒక్క ఆధారాన్నయినా చూపించాలని సవాలు విసిరారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది జగన్ ప్రభుత్వమే అని, ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించారని, ప్రాజెక్టును బ్యారేజ్‌గా మార్చేశారని పదే పదే వైసీపీ వాళ్ళ విష పత్రిక సాక్షి ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో 2019 ఎన్నికల ముందు వరకు 41.15 మీటర్లకు ఎత్తు తగ్గింపు, ఫేజ్-1, ఫేజ్-2 అనే ప్రతిపాదనలే లేవన్నారు. ఈ అంశాలు ఎక్కడైనా రికార్డుల్లో ఉంటే చూపించాలన్నారు. తానేమీ అబద్ధాలు చెప్పడం లేదని, రికార్డుల్లో నమోదైన అధికారిక సమాచారం ప్రకారమే చెబుతున్నానని మంత్రి నిమ్మల ఉద్ఘాటించారు.
ప్రజలకు వాస్తవాలు తెలియాలనే..
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019, ఫిబ్రవరి 18న మొత్తం ప్రాజెక్టు వ్యయానికి రూ.55,548 కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపినట్లు స్పష్టంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో జరిగిన రివైజ్డ్ కాస్ట్ కమిటీ సమావేశంలో వ్యయం అంచనాలను రూ.47 వేల కోట్లకు తగ్గించారు. కుడి కాలువ నీటి సామర్థ్యం 17,500 క్యూసెక్కుల నుండి 11,650 క్యూసెక్కులకు తగ్గించారు. ఎడమ కాలువ సామర్థ్యం 17500 క్యూసెక్కులు ఉంటే దాన్ని, 8,122 క్యూసెక్కులకు తగ్గించి ప్రతిపాదనలు పంపారని మంత్రి విమర్శించారు. మండలిలోని వైసీపీ సభ్యులకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలనే ఈ విషయాలు చెబుతున్నానన్నారు. తాను వైసీపీ నాయకుల మాదిరి ఎమైనా పొరపాటు మాట్లాడినా, తాను చూపించేవి ఫేక్ డాక్యుమెంట్లు అని తేలినా, తనపై ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చని మంత్రి నిమ్మల సవాల్ చేశారు.
జగన్ పాలనలోనే ఎత్తు తగ్గింపు ప్రతిపాదనలు
ఒరిజనల్ డీపీఆర్‌లో లేకపోయినప్పటికీ 41.15 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలంటూ నాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌్ 2022, జనవరి 10వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీిఏ) సీఈవోకు లేఖ రాశారు. అదే విధంగా 2023, మే 23వ తేదీన నాటి పోలవరం ప్రాజెక్టు సీిఈ సుధాకర్ బాబు.. ఫే˜జ్-1 కు సంబంధించి 41.15 మీటర్ల ఎత్తుకే రూ.16,870 కోట్లు ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. అదే ఏడాది జూన్ 5వ తేదీన నాటి పీపీఏ సీఈవోకు పిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ మరో లేఖ రాస్తూ 41.15 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి సవరించిన అంచనాల మేరకు రూ.17,144 కోట్లు ఇవ్వాలని కోరారు. ఆ ఏడాదిలోనే జూలై 6న పీపీఏ మెంబర్ సెక్రటరీకి రాసిన లేఖలో 41.15 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.23 వేల కోట్లు ఇవ్వాలని సీిఈ సుధాకర్ బాబు కోరారు. అదే సుధాకర్ బాబు తిరిగి ఆగస్ట్ 2వ తేదీన సీడబ్ల్యూసీ ఛీప్ ఇంజనీర్‌కు రాసిన లేఖలో 41.15 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి రూ.37,059 కోట్లు ఇవ్వాలని కోరారు. ఆ విధంగా ఫేజ్-1,ఫేజ్-2 అని, 41.15 మీటర్ల ఎత్తు అనే దిక్కుమాలిన ప్రతిపాదన గత వైసీపీ ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరకు జగన్‌మోహన్ రెడ్డి తీసుకెళ్ళాడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రుల మాదిరి తాను పర్సంటా, అర పర్సంటా, బుల్లెట్ దిగిందా అంటూ పిచ్చి మాటలు చెప్పటం లేదని, వాస్తవాలు చెబుతున్నానని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలోనే నిర్ణయం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 41.15 మీటర్ల ఎత్తుకే పోలవరం నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందంటూ అవినీతి సాక్షి పత్రిక, వైసీపీ సభ్యులు అవాస్తవాలు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన జరిగిన పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డ్ సమావేశంలో 41.15 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.12,157 కోట్లు విడుదల చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశం మినిట్స్ ప్రతులను మంత్రి నిమ్మల సభలో చూపించారు. ఈ మినిట్స్ ఆధారంగానే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వివరించారు. ఈ దుర్మార్గాలన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు. 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల ఉద్ఘాటించారు. పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానించి గోదావరి జలాలను రాయలసీమకు, ఉత్తరాంధ్రకు తరలించటం ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని స్పష్టం చేశారు.