అమరావతి(చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, అలాగే ఉండవల్లిలోని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను సీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కేసుల విచారణకు సంబంధించిన పైళ్లను మంగళగిరి డీఎస్పీ.. సీఐడీకి అప్పగించనున్నారు. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. సివిల్ పోలీసుల ద్వారా విచారణ ఆలస్యం అవుతుందనే భావనతో విచారణను వేగవంతం చేసేందుకు సీఐడీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టీడీపీ కేంద్రకార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరికొందరు నేతలను కూడా విచారించనున్నారు. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు విచారణకు పలుమార్లు పిలిచారు. ఆయన సహకరించలేదు. దీంతో ఈ కేసులను సివిల్ పోలీసుల కంటే సీఐడీకి అప్పగిస్తే త్వరగా విచారణ జరుగుతుందని భావించి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగం సురేష్, తలశిల రఘురామ్ సహా మరో పలువురు నిందితులుగా ఉన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని అప్పట్లో వీరంతా ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటమే కాకుండా ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించారు.
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగిరమేశ్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరింది. విచారణకు సహకరించాలని జోగిరమేశ్కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే పాస్‌పోర్టు సరెండర్ చేయాలని, దర్యాప్తునకు సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు సహకరించపోతే రక్షణ ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది.