అమరావతి: ఏపీలో చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నుకోనున్నారు. ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా… కూటమి ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా 164 స్థానాల్లో జయభేరి మోగించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలిచాయి. ఈ నేపథ్యంలో మంగళవారం (11వ తేదీ) కూటమి తరఫున గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూటమి శాసనసభా పక్షనేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు. అనంతరం… ఎమ్మెల్యేలు ఆ మేరకు గవర్నర్‌ను కలిసి లేఖ అందజేయనున్నారు. ఈ లాంఛనం ముగిసిన అనంతరం, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబును గవర్నర్ ఆహ్వానిస్తారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో చంద్రబాబు ఈనెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మంత్రివర్గ కూర్పుపై కసరత్తు
మరోవైపు ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రివర్లం ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఢల్లీి వెళ్లిన ఆయన… సోమవారం గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. బుధవారం సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేయనున్నారు. జిల్లాల వారీగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనేదానిపై ముఖ్యనేతలతో ఆయన చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి పదవుల ఆశావహులు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలను కూడా దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు… మంత్రివర్గ కూర్పుపై తన నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. అనుభవం, వివిధ సామాజికవర్గాలకు ప్రాధాన్యం తదితర అంశాల ఆధారంగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై చంద్రబాబు ఓ నిర్ణయానికి రానున్నారు. మంగళవారం నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.