- 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన
- మెటా, అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు
- రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ల ప్రారంభం
- 45 క్లస్టర్ల అభివృద్ధికి రూ.200 కోట్ల విడుదల
- ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి సోపానం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తర హా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేస్తోంది. విజయవాడలో సోమవారం ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సుకు హాజరై రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంఎస్ఎంఈల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్ర మల శాఖ మంత్రి టి.జి.భరత్ సహా పలువురు మంత్రులు, పారి శ్రామిక వేత్తలు సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్దిదారులు, విధాన కర్తలు, ఆర్థిక సంస్థలు సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక మౌలికవసతులను కల్పించే లక్ష్యంతో ఈ సదస్సు వేదికగా ముఖ్యమంత్రి పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసే లక్ష్యంలో భాగంగా మూడో విడతలో ఈ 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే మొదటి రెండు దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపనతో పాటు కొన్ని ప్రారంభమయ్యాయి.
ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళ గిరి, పిఠాపురంలో గ్రామీణ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా రూట్యాగ్ – స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్టెన్షన్ కేంద్రాలను సీఎం ప్రారంభించనున్నారు. రూ.200 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటుకు నిధులను కూడా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఈ సమ్మి ట్లో యువతకు, మహిళలకు అవగాహన కల్పించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేలా అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ప్రణాళిక చేసిన ఈ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.













