- కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటన
- ‘మేడే’ సందర్భంగా కార్మికులతో ముఖాముఖి
- గుడ్లవల్లేరులో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభించనున్న చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు. జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలకు వెళ్లనున్నారు. ఎన్టీఆర్ భరోసా లబ్దిదారులతో మాట్లాడనున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు రూ.63,158 కోట్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో పేదలకు అందించింది. ప్రతీ నెల కృష్ణాజిల్లాలో 2.34 లక్షల మందికి రూ.102 కోట్లను ప్రభుత్వం పింఛను రూపంలో ఇస్తోంది. పింఛన్ల పంపిణీ అనంతరం ‘మేడే’ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులతో సమావేశమవుతారు. గుడ్లవల్లేరులో నిర్మించిన ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
కృష్ణా జిల్లాలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంనుంచి బయలుదేరి పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామానికి ఉదయం 10.15 గంటలకు చేరుకుంటారు. అక్కడినుంచి పమిడిముక్కలకు 10.25 గంటలకు చేరుకుని ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఎన్టీఆర్ కాలనీలోని ఎన్టీఆర్ భరోసా లబ్దిదారుల ఇళ్లకు వెళ్తారు. వారికి పింఛను అందించి వారితో కాసేపు మాట్లాడతారు. ఎన్టీఆర్ కాలనీ నుంచి వీరంకిలాకు గ్రామానికి చేరుకుంటారు. మేడే సందర్భంగా మధ్యాహ్నం 12.45 గంటలకు భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.55కు పామర్రు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కార్యక్రమం ముగించుకుని 3.40 గంటలకు గుడ్లవల్లేరు చేరుకుంటారు. 3.50 గంటలకు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.














