- నూతన పర్యాటక పాలసీ, పీపీపీ విధానంపై చర్చిస్తాం
- పెట్టుబడిదారుల ఆసక్తులకు అనుగుణంగా ముందుకు
- సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా కలెక్టర్లు
- పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
- కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
అమరావతి (చైతన్యరథం): శాసనసభ్యులు, పెట్టుబడిదారుల కోరిక మేరకు ఈ నెల 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిరచారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సు రెండోరోజు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం విజయవాడలోని హోటల్ వివంతలో ఈ నెల 17న పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానంలో ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలను ఈ సదస్సులో కూలంకషంగా చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారుల ఆసక్తులను తెలుసుకుని భవిష్యత్లో ఆ దిశగా ముందుకు వెళతామని మంత్రి తెలిపారు.
అడిగిన వెంటనే పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢల్లీి పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి సాస్కి స్కీమ్ ద్వారా అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారి కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి కోసం పలువురు ఎమ్మెల్యేలు పలు ప్రతిపాదనలు తీసుకొచ్చారని వివరించారు. ఆయా ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అంశాలను ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు.
పెట్టుబడిదారులు ఏ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారో తెలుసుకునేందుకు విజయవాడలో నిర్వహించే సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నామని మంత్రి అన్నారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లను ప్రత్యేకంగా ఆహ్వానిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ల సలహాలు, సూచనలు పర్యాటకాభివృద్దికి ఉపయోగపడతాయని తాము భావిస్తున్నామన్నారు. సదస్సులో కేంద్ర ప్రభుత్వ సహకారం, పీపీపీ విధానం, అవసరమైతే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్ షిప్ (పీ4 విధానం), తదితర అంశాలను క్రోడీకరించి రూట్ మ్యాప్, సమగ్ర నివేదిక తయారు చేసుకొని భవిష్యత్లో ఆ దిశగా ముందుకు వెళతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.