- రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు
- జీవో నెం. 58 విడుదల
- వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని సీఐఐ సదస్సులో మంత్రి నారా లోకేష్ హామీ
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా వేగం చూపిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాత మాట… ఇప్పటి మాట స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ మరింత చొరవ తీసుకుంటున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)కు హామీ ఇచ్చినట్లుగానే.. పెట్టుబడిదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేశారు. ఫోరం ఏర్పాటుచేస్తూ పరిశ్రమల శాఖ జీవో నెం.58ని విడుదల చేసింది. ఇటీవల విజయవాడలోని తాజ్ వివాంత హోటల్లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా సీఐఐ ప్రతినిధులు కోరారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ వారం రోజుల్లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ మధ్య కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేస్తూ జీవో విడుదల చేసి ఇచ్చిన మాటను మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారు. ప్రాథమికంగా రెండేళ్ల కాలపరిమితితో ఏర్పాటయిన ఈ ఫోరం.. పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య సంధానకర్తగా వ్యవహరించనుంది. ఆర్టీజీఎస్ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ ఫోరం ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఆర్టీజీఎస్ సమన్వయం చేయనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం, పారిశ్రామికవేత్తలకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోసం ఇప్పటికే ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును ప్రభుత్వం పునరుద్ధరించింది. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.