- శ్రీ సత్యసాయి జిల్లా ఘటనపై డీజీపీతో సమీక్ష
- దర్యాప్తు తీరు తెన్నులపై ఆరా తీసిన ముఖ్యమంత్రి
- మహిళలపై నేరాలకు కఠిన చర్యలతో చెక్ పెట్టండి
- ప్రభుత్వానికి ప్రజలూ సహకరించాలి: చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): మహిళలపట్ల నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను అత్యంత కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. అలాంటి కేసుల్లో దోషులకు త్వరగా శిక్షలుపడేలా దర్యాప్తు వేగంగా సాగాలన్నారు. తప్పుచేస్తే శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న అత్తాకోడళ్ల సామూహిక అత్యాచార ఘటనపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో చోటుచేసుకున్న ఘోర ఘటనలో విచారణ సాగుతున్న తీరునూ సీఎం సమీక్షించారు. దోషులకు తక్షణం శిక్షపడేలా చర్యలుండాలన్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసు విచారించాలని సూచించారు. హైకోర్టు దృష్టికి కేసును తీసుకెళ్లి.. ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుదామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి, మహిళలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
దీనితోపాటు గతంలో బాపట్ల జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలన్నారు. లైంగిక వేధింపులు, మహిళలపై దాడివంటి అంశాలపై కఠినంగా వ్యవహరించి త్వరగా న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ విధానంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఘటనకు సంబంధించి ఇప్పటికే పలు కీలక అంశాలను దర్యాప్తు బృందం రాబట్టిందన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులు దొంగతనాలు, అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిందన్నారు. నేరగాళ్లను గుర్తించడానికి, కట్టడి చేయడానికి, కఠినంగా శిక్షలు వేయడానికి టెక్నాలజీ ద్వారా సాక్ష్యాలను సేకరించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. నేరస్తులను పట్టుకోవడంలో సిసి కెమేరాలు సహా అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక అంశాలను వాడుకోవాలన్నారు.
నేరస్తులను వెంటనే గుర్తించే వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీసీ టీవీ కెమెరాల సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని సీఎం వివరించారు. ఇప్పటికే ఉన్న సీసీ టీవీ కెమెరాలను పూర్తిగా అందుబాటులోకి తేవడంతోపాటు కొత్తవాటిని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా నేరాలను అరికట్టేందుకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని.. ఎక్కడైనా లైంగిక వేధింపులు, ఘర్షణలు, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఆ సమాచారాన్ని, వాటికి తగ్గ ఆధారాలును పోలీసులతో పంచుకోవాలని సీఎం కోరారు. ప్రజల సహకారంతో నేరాలకు అడ్డుకట్ట మరింత సమర్థవంతంగా చేయవచ్చన్నారు. పోలీసులకు సమాచారం పంపిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామనే నమ్మకాన్ని పోలీసు శాఖ కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో అపోహలు తొలగించి ప్రజల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రజల ప్రాణాలకు, మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ స్వేచ్ఛగా తిరిగేలా రాష్ట్రంలో శాంతి భద్రతలు కల్పించేందుకు అవసరమైన ప్రతి చర్యా తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.