- ధర్మారెడ్డి, కరణాకర్‌రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు
- పనులు కట్టబెట్టి దాదాపు రూ. 100 కోట్లకు పైగా కమీషన్లు కొట్టేశారు
- శ్రీవాణి ట్రస్ట్, సమరత సేవా ట్రస్ట్‌కు నిధుల పేరుతో దోపిడీ
- తిరుమల నుండి రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైంది
అమరావతి(చైతన్యరథం): టీడీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసినా, ఈఓ ధర్మారెడ్డి రిటైరయినా చేసిన తప్పుల నుండి తప్పించుకోలేరని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్న నిర్మాణాలు కూల్చి కమీషన్‌లు దండుకోవడానికి కొత్త నిర్మాణాల పేరుతో కుయుక్తులు పన్ని వందలకోట్ల రూపాయలు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. 2023-24 లో టీటీడీ ఇంజనీరింగ్ బడ్జెట్ రూ.300 కోట్లు మాత్రమే ఉండగా సెప్టెంబర్ లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి మూడు నెలల్లోనే రూ. 1,233 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేసి భారీ అక్రమాలకు తెరతీశారు.
ధర్మారెడ్డి ఈవోగా ఉండి కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా ఉండి సంవత్సరం మధ్యలో ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా ఏ ఒప్పందం ప్రకారం దాదాపు రూ.1,233 కోట్లను మూడు నెలల్లో మంజూరు చేశారు? అందులో ఎంత తిన్నారు? ఉన్న సత్రాలను నేలమట్టం చేయాల్సిన అవసరం ఏముంది? స్విమ్స్ లో అడిషనల్ బ్లాక్‌లు, సత్రాల పేరుతో.. ఇలా ఏడెనిమిది వర్క్ లు కట్టబెట్టి అడ్వాన్స్ లు ఇచ్చాక వాళ్ల దగ్గర నుండి కరుణాకర్ రెడ్డి 18 శాతం చొప్పున రూ.100 కోట్లకు పైగా కమీషన్‌లు దండుకున్నారు. ఈవో ధర్మారెడ్డికి తెలిసే కరుణాకర్ రెడ్డి కుమారుడికోసం ఇదంతా చేశారని విజయ్‌కుమార్ దుయ్యబట్టారు.
వెబ్‌సైట్‌లో కనిపించని పనుల వివరాలు
జగన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి లు దుర్మార్గపు ఆలోచనలతో కాంట్రాక్టులు కట్టబెట్టి కమీషన్‌లు దండుకున్నారు. ఓడిపోతామనే తెలిసే బడ్జెట్‌ను రూ.1,772 కోట్లకు పెంచి దోచుకున్నారు. ధర్మారెడ్డి ఛార్జ్ తీసుకున్నాక 2021 -22 నుండి ఇంజనీరింగ్ పనుల వివరాలను దేవస్థానం వెబ్ సైట్ లో పెట్టలేదంటే ఏమనుకోవాలి. కట్టబెట్టిన వర్క్‌లను బోర్డు అమోదించిందో.. లేదో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలకు మాత్రమే తెలుసు. చేసిందందా చేసి దోచుకోవాల్సింది దోచుకుని రాజీనామా చేస్తే సరిపోతుందా? ప్రధాని కార్యాలయం కూడా సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి వస్తుంది. అయితే ధర్మారెడ్డి మాత్రం దేవస్థానం ఆర్టీఐ కిందకు రాదని చెబుతాడు. అందుకే ఏ సమాచారం ఇవ్వనంటున్నాడు. కరుణాకర్ రెడ్డి వచ్చాక బోర్డు తీర్మానాలు వెబ్‌సైట్‌లో పెట్టడం మానేశారు. ఇంజనీరింగ్ వర్క్ లకు సంబంధించి 2021 -22 వివరాలు మాత్రమే ఉన్నాయి. 2022 -23, 2023 -24 వివరాలు లేవు. దొంగ ఇంట్లోకి వచ్చేప్పుడు సీసీ కెమెరాలు ఆపి వచ్చినట్లు .. వర్క్ వివరాలు బహిరంగం చేస్తే తమ గుట్టు బయట పడుతుందనే దుర్బుద్ధితో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు బోర్డు తీర్మానాలు వెబ్ సైట్ లో లేకుండా చేశారు.
రూ. 100 కోట్లకు పైగా కమీషన్ల రూపంలో కొట్టేశారు. వీటిని సమీక్షించాల్సిన ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాలవలవన్, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్లప్పగించి చూస్తూ సహకరించారు. వీళ్లతో పాటు, తప్పులకు సహకరించిన ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ ఎక్కడికి పారిపోయినా తప్పించుకోలేరని విజయ్‌కుమార్ స్పష్టం చేశారు.
సమరత సేవ ట్రస్ట్‌కు ఇచ్చిన రూ. 32 కోట్ల మతలబేమిటి?
శ్రీ వాణి ట్రస్ట్ గురించి గత సంవత్సరం జూన్‌లో టీటీడీ ఒక శ్వేత పత్రం విడుదల చేసింది. ఆ పత్రం ప్రకారం..శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చిన నిధుల ద్వారా మొత్తం 2,273 దేవాలయాలను కడతామని.. అందులో 1,953 దేవాలయాలు దేవాదాయ శాఖ ద్వారా, 320 గుడులు సమరత సేవ ట్రస్ట్ ద్వారా నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రతి గుడికి రూ. 10 లక్షల వంతున కేటాయించినట్లు శ్వేతపత్రంలో తెలియజేశారు. అంటే దాదాపు 32 కోట్లు సమరత సేవా ట్రస్ట్ కు ఇచ్చారు. కానీ ఆ సమరత సేవా ట్రస్ట్ వెబ్ సైట్ కు వెళ్లి చూస్తే.. ప్రతి గుడికి 5 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు, అది కూడా 2015-18 మధ్యలో టీటీడీ ఇచ్చిన రూ.25 కోట్ల గ్రాంటు కింద అని ఉంది. వాళ్ల వెబ్‌సైట్ ప్రకారం 2015- 18 మధ్యలో టీటీడీ 502 దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని.. 502 గుళ్లను 13 జిల్లాల పరిధిలో 278 మండలాల పరిధిలో కట్టామని చెప్పారు. సమరసత సేవ ట్రస్ట్ వివరాలు కేవలం 2020 దాకా మాత్రమే ఉన్నాయి.
2019-20 సంవత్సరంలో టీటీడీ నుంచి 320 గుళ్ల కోసం గుడికి 10 లక్షల చొప్పున తీసుకున్నట్లు వెబ్‌సైట్‌లో ఎక్కడా చెప్పలేదు. 2020 తర్వాత ఏ రకమైన అకౌంట్లు, ఆడిట్ రిపోట్లు, వార్షిక నివేదికలు సమరత సేవా ట్రస్ట్ వెబ్‌సైట్‌లో కనిపించలేదు. 2020 సంవత్సరం తర్వాత వెబ్ సైట్ పని చేస్తున్నట్లే కనపడలేదు. కనీసం టీటీడీ ఇచ్చిన శ్వేతపత్రం లో కూడా సమరత సేవా ట్రస్ట్ ఎన్ని జిల్లాల్లో ఎన్ని మండలాల్లో, ఎక్కడెక్కడ గుళ్లను కట్టించిందీ చెప్పలేదు. 2018 దాకా ఒక గుడి కట్టడానికి, పునరుద్ధరణకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చినప్పుడు.. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.10 లక్షలు ఎందుకిచ్చారు ? ఒకేసారి రెండిరతలు చేయడానికి కారణం ఏమిటి? 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జనరల్ అకౌంట్ నుంచి ఇచ్చినప్పుడు.. వైకాపా ప్రభుత్వంలో కొత్తగా శ్రీవాణి ట్రస్ట్ అంటూ ఏర్పరచి దానిలో నుంచి నిధులు ఇవ్వాల్సిన అవసరమేముంది? మొదట పీవీఆర్కే ప్రసాద్ ద్వారా ప్రారంభమై.. ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు ఎమ్జీకే మూర్తి, దాసరి శ్రీనివాసులు ద్వారా నడిచిన ఈ ట్రస్ట్‌లో ఆ తరువాత ఐఏఎస్‌లు పోయి మామూలు వ్యక్తులు వచ్చి చేరారు. ఇక దేవాదాయ శాఖ ద్వారా ఏమి చేస్తున్నారో, కొత్తగా వచ్చిన ఈఓ నే చూసుకోవాలని విజయ్‌కుమార్ అన్నారు.
మడ అడవుల్లో శ్రీవారి ఆలయ నిర్మాణమా?
కాస్టింగ్ యార్డ్ నిర్మాణానికి నవీ ముంబై తీర ప్రాతంలోని మడ అడవుల్లో 16 ఎకరాలను మహారాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ కి కేటాయిస్తే దాంట్లోని 10 ఎకరాలను ఇప్పుడు శ్రీవారి గుడికి కేటాయించింది. మడ అడవుల్లో సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధం. అక్కడ పర్యావరణ నిషేధాలు ఉన్నాయని టీటీడీకి రెండేళ్ల క్రితమే తెలుసు. మహారాష్ట్ర ప్రజలు రెండేళ్ల క్రిందటే ఉద్యమాలు చేసి మడ అడవుల్లో శ్రీవారి ఆలయం కట్టకుడదని అభ్యంతరం చెప్పారు. కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదుల ఫలితంగా 40 వేల చదరపు అడుగుల్లో ఆలయ నిర్మాణం చేపట్టాలని టీటీడీ భావిస్తే, కేంద్రం కేవలం 11 వేల చదరపు అడుగులకే అనుమతి ఇచ్చింది. ఆపై పర్యావరణ వాదులు ఈ మడ అడవుల్లో శ్రీరావారి ఆలయం గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మూడు రోజుల క్రితం మహారాష్ట్రలోని పర్యావరణ వాదులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సైతం ఫిర్యాదు చేశారు.
తిరుమలలో ప్లాస్టిక్ వాడరాదని చెప్పే టీటీడీ.. మహారాష్ట్రలో నవీ ముంబైలో శ్రీవారి ఆలయ విషయంలో పర్యావరణ నిబంధనలను ఎందుకు పాటించడం లేదు. కేంద్రంతో మొట్టికాయలు వేయించుకుంటూ టీటీడీ పరువును ధర్మారెడ్డి ఎందుకు బజారున పడేశారు. రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయానికి 150 ఎకరాలు కేటాయిస్తే వైసీపీతో కలిసిపోయిన ధర్మారెడ్డి 30 ఎకరాలు చాలని చిన్న ఆలయాన్ని నిర్మింపచేశారు. మహారాష్ట్రలో మాత్రం సీఆర్జెడ్ నిబంధనలు కాదని మరీ ఆలయ నిర్మాణం చేపడతారా? ఇందులో ఎంత మొత్తం చేతులు మారింది? చివరికి జాతీయ హరిత ట్రిబ్యునల్ మందలించినా, కేసు వేసినా ఎందుకు ముందుకెళ్లారని విజయ్‌కుమార్ ప్రశ్నించారు.
టీటీడీని సలహాదారులతో నింపేశారు
టీడీపీ హయాంలో లేని సలహాదారుల విధానాన్ని టీటీడీలోకి ధర్మారెడ్డి తీసుకొచ్చి తనకిష్టం వచ్చినవాళ్ళని సలహాదారులుగా కీలక విభాగాల్లో నింపేశారు. ధర్మారెడ్డి పెట్టుకున్న సలహాదారుల జాబితా చాంతాడంత ఉంది. అకౌంట్స్ విభాగంలొ నరసింహ మూర్తి, ఇంజనీరింగ్ విభాగంలో కొండల రావు (రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్), రామచంద్ర రెడ్డి, బర్డ్ హాస్పటిల్ విభాగంలో గురవారెడ్డి, విజిలెన్స్ విభాగంలో ప్రభాకర్, ఫైబర్ విభాగంలో సందీప్, ఎస్టేట్ విభాగంలో మల్లికార్జున, ఎస్వీబీసీ విభాగంలో మంగ్లీ, విజయ కుమార్, ప్రజాసంబంధాల విభాగంలో సాక్షి నుండి నాగేష్, విద్యాశాఖ, ధర్మ ప్రచార పరిషత్ విభాగాల్లో అడ్డగోలు నియామకాలు వంటివి విచ్చలవిడిగా చేస్తూ ధర్మారెడ్డి టీటీడీని తన జేబు సంస్థగా మూర్చుకున్నారని విజయ్‌కుమార్ విమర్శించారు.
న్యాయవిచారణకు ఆదేశించాలి
ఇక శానిటేషన్ పేరుతో దోపిడీకి యత్నించటం, అప్పటి మంత్రి రోజాకి ప్రతి వారం 50 నుంచి అరవై దర్శనం లెటర్ల దగ్గర నుంచి, విశాఖ స్వరూపానంద ఆశ్రమానికి నూరు శాతం అతిక్రమణలతో భవన అనుమతులు ఇవ్వటం వరకు వేల కొద్దీ అభియోగాలు ధర్మారెడ్డి మీద ఉన్నాయి. ధర్మారెడ్డి గత ఐదేళ్లలో కచ్చితంగా టీటీడీలో దేవుడికి రెండో స్థానం ఇచ్చి రాజకీయాలకు, అవినీతికి మొదటి స్థానం ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభించింది. అందులో భాగంగానే కొత్త ఈవోగా శ్యామలరావును నియమించింది. ఐదేళ్ల ధర్మారెడ్డి లీలలు మామూలు డిపార్ట్‌మెంటల్ విచారణతో తేలే విషయాలు కావు. ప్రతి అవినీతికి మూలాలు చాలా లోతుల్లో ఉన్నాయి. అందుకని ధర్మారెడ్డిని రిలీవ్ చెయ్యకుండా, ఆయన హయాంలో జరిగిన అన్ని విషయాల మీద న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని విజయ్‌కుమార్ కోరారు.