- ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం చట్టవ్యతిరేకం
- జగన్ చూపించిన తప్పుడు దారిలోనే ఉద్యోగులు కూడా..
- అప్పుడే ప్రలోభాలు, తాయిలాల ఎర వేస్తున్న వైసీపీ నాయకులు
- మతం పేరుతో ఓట్లడుగుతున్న జగన్ మేనత్త
- జగన్ జమానాలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం
అమరావతి (చైతన్యరథం): యథారాజా తథాప్రజా అన్నట్లు అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్‌రెడ్డి చూపించిన తప్పుడుదారిలోనే కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యడు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార వైసీపీ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి జగన్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పార్టీ కోసం ప్రచారం చేయడంలో వెంకట్రామిరెడ్డి బరితెగించి మరీ తిరుగుతున్నాడు. ఒక ప్రభుత్వ అధికారి పార్టీల తరఫున ప్రచారం చేయడానికి వీలు లేదు. జగన్ రెడ్డి మరలా అధికారంలోకి రాకపోతే ఉద్యోగులకు చాలా ఇబ్బందులు ఉంటాయి, రావాల్సిన రాయితీలు రావని సచివాలయ ఉద్యోగులను వెంకట్రామిరెడ్డి భయపెడుతున్నాడు. ఇతను అధ్యకుడు అయినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేసిందేమీ లేదు. జీతాలు సక్రమంగా రాకపోయినా ఏ రోజు కూడా ఉద్యోగుల కోసం వెంకట్రామిరెడ్డి నోరెత్తలేదని వర్ల విమర్శించారు.
సివిల్ కాండక్ట్ రూల్స్‌కు వ్యతిరేకంగా..
ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటూ బహిరంగంగా వైకాపా తరపున ఎన్నికల ప్రచారం చేయడం సివిల్ కాండక్ట్ రూల్స్‌కు వ్యతిరేకం. కేవలం సచివాలయంలోనే కాకుండా ఊరూరా తిరుగుతూ గ్రామ సచివాలయాలు సందర్శించి జగన తరపున వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. గ్రామ, వార్డు కార్యదర్శులు జగన్ రెడ్డి కోసం ఎన్ని ఓట్లు రెడీ చేశారో ఏ రోజుకారోజు తనకు వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నాడు.
జగన్‌కు మద్దతిచ్చి మరలా ముఖ్యమంత్రిని చేయాలని ఒక ప్రభుత్వ ఉద్యోగి కోరటం చట్ట వ్యతిరేకం. ప్రభుత్వ ఉద్యోగిగా పనికి రాని వ్యక్తి వెంకట్రామిరెడ్డి. ఇటువంటి చట్ట వ్యతిరేక పనుల చేస్తున్న అతడిని తక్షణమే సస్పెండ్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాసినా చర్యలు తాసుకోలేదు. అందుకే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మీనాను కలిసి వెంకట్రామిరెడ్డి మాట్లాడిన వీడియోతో సహా ఫిర్యాదు చేశాం. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం. ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ని వెంటనే సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించాలని చీఫ్ సెక్రటరీని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
మత వైషమ్యాలను రెచ్చగొడుతున్న జగన్ మేనత్త…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనత్త విమలా రెడ్డి అనే క్రైస్తవ మత బోధకురాలు ఊరూరా తిరిగి పాస్టర్లతో సమావేశమవుతోంది. పాస్టర్లకు బహుమతులు, డబ్బులు ఎర చూపి జగన్ రెడ్డికి ఓటు వేయాలని కోరుతోంది. విమలారెడ్డి అల్లూరు జిల్లా పాడేరులో సేవకుల సదస్సు పేరుతో పాస్టర్లతో సమావేశం నిర్వహించారు. జాన్ బెస్లీ, జాన్ సన్ లాంటి క్రిస్టియన్ పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడారు. సమావేశం తర్వాత ట్రాన్స్‌పోర్టు ఛార్జీల పేరుతో పాస్టర్లకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు, వారితో వచ్చిన సహాయకులకు రూ.500 లు నగదు పంచారు. రాజకీయాల కోసం మతాన్ని వాడటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇతర మతాల నుంచి క్రైస్తవ మతాన్ని కాపాడుకోవాలంటే జగన్ రెడ్డికి మాత్రమే ఓటు వేయాలని ఆమె ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. మతాల మధ్య విద్వేషాలు లేని మన రాష్ట్రంలో ఆమె పాస్టర్లతో మాట్లాడే మాటలు రెండు మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే రీతిలో ఉన్నాయి. మతాలను ఉపయోగించుకొని ఎన్నికల ప్రచారం చేయడం నేరం. పేపర్ క్లిప్పింగ్‌లు, రుజువులతో సహా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఆమెపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరామని వర్ల తెలియజేశారు.
ఎన్నికలకు నెల ముందే ఓటర్లకు ఎర…
ఎన్నికల సమయంలో కొంతమంది ఓటర్లకు బహుమతులు, డబ్బులు ఎర వేయడం చూసాం గానీ, జగన్ పార్టీ ఎన్నికలకు ముందే బాహాటంగా బహు మతులు,డబ్బు, ఓటర్లకిచ్చి ఎన్నికల ప్రచారం చేసుకుం టున్నారు. వాలంటీర్లకు, అధికారులకు, సెక్రటేరియట్ ఉద్యోగులకు, ఓటర్లకు బహిరంగంగా బహుమతులు ఇస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత, మంత్రులు రోజా, జోగి రమేష్, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, తిరపతి రావు, భాస్కర్‌రెడ్డి, వైఎస్ విమలారెడ్డి, తదితరులు ఎక్కడెక్కడ బహిరంగంగా బహు మతులు, డబ్బులు పంచారో, వాటి వివరాలతో సహా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని వర్ల తెలిపారు.
అవకాశం ఉంటే డీజీపీ కూడా..
ఎన్నికల్లో ఎలాగైనా, ఎన్ని అక్రమాలు చేసైనా గెలవా లని వాలంటీర్లకు, అధికారులకు, ఓటర్లకు డబ్బులు, బహుమతులు బహిరంగంగా పంపిణీచేస్తున్నారు. కుక్క ర్లు, మిక్సీలు, తదితర విలువైన వస్తువులు కుప్పలు కుప్పలుగా తెచ్చి పంపిణీ చేస్తుంటే పోలీసులు వాటిని అరికట్టాల్సింది పోయి కొన్నిచోట్ల పోలీసులే స్వయంగా పంపిణీ చేస్తున్నారు. అవకాశం లేదు కానీ, డీజీపీ కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసేవాడు. ఇలా పంపిణీ చేయడం తప్పని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్లు వర్ల రామయ్య తెలియజేశారు.