- భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు
- టెక్నాలజీ కాంపిటెన్సీ వచ్చేలా విద్యార్ధులకు శిక్షణ
- రాష్ట్ర యువతకు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ నైపుణ్యాలు
- ఉద్యోగాల కల్పనపై సమీకృత పోర్టల్ ద్వారా సమాచారం
- పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష
- ప్రపంచస్థాయి ప్రమాణాలతో పాఠ్యాంశాలు తెస్తున్నామన్న మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చేలా వివిధ కోర్సులు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని సీఎం సూచించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అందిస్తోన్న కోర్సులను రీస్ట్రక్చరింగ్ చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థ మార్పులను అందిపుచ్చుకోవాలని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలని పేర్కొన్నారు. గేమ్ చేంజర్‌లుగా మారనున్న లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ లాంటి రంగాల్లోనూ కొత్త కోర్సులు రావాలని సూచించారు. డిమాండ్‌కు అనుగుణంగా ఈ కోర్సులు రావాల్సిన అవసరముందన్నారు. క్వాంటం టెక్నాలజీపై రాష్ట్రంలో మొట్ట మొదటగా కోర్సును ప్రారంభించటంపై ఆంధ్రా యూనివర్సిటీని సీఎం అభినందించారు. ఏపీలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా పోటీ పడాలని దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 200 యూనివర్సిటీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ యూనివర్సిటీకి ఏదో ఒక పారిశ్రామిక సంస్థ అనుసంధానమై ఉండేలా చూడాలని సూచనలు చేశారు. యూనివర్సిటీల్లో జర్మన్ సహా వివిధ విదేశీ భాషల్లో శిక్షణ కోసం ఓ విభాగం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను అందిపుచ్చుకునేలా ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకూ వివిధ పాఠ్యాంశాలను మార్పు చేయటంతో పాటు కెరీర్ బిల్డింగ్, కేరక్టర్ బిల్డింగ్ జరిగేలా ఉండాలన్నారు. ఆరోగ్యం, టెక్నాలజీతో పాటు బెస్ట్ ప్రాక్టీసెస్‌ను నేర్పించేలా ఈ పాఠ్యాంశాలు ఉండాలని సూచించారు. దీని కోసం ఐఐటీ చెన్నై సహా వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సిఫార్సులు తీసుకుని విద్యాశాఖలో అమలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యూనివర్సిటీ రికార్డులను కూడా ఆన్‌లైన్ చేయాలని సూచించారు. త్వరలో రాష్ట్రంలో వివిధ ప్రతిష్టాత్మక సంస్థలు లాజిస్టిక్స్, ఏవియేషన్, హార్టికల్చర్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయని సీఎం తెలిపారు.
త్వరలో స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్
విద్యార్ధులకు అన్ని పోషకాలూ అందేలా మధ్యాహ్న భోజన మెనూను రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్ధుల మానసిక, భౌతిక ఎదుగుదలకు అనుగుణంగా ఆహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. లీప్ యాప్ ద్వారా తల్లితండ్రులు కూడా విద్యార్ధుల హాజరు, వారి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా అత్యుత్తమ టీచర్లతో వీడియో మాధ్యమంలో పాఠాలు చెప్పిస్తే బోధనలో నాణ్యత పెరుగుతుందని సూచనలు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ సాంకేతికతతో కూడిన ఉత్తమ విద్యను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పీ4 లాంటి కార్యక్రమాలను అనుసంధానం చేసుకుని మౌలిక సదుపాయలను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
విద్యార్ధులకు కొత్త ఆలోచనలు వచ్చేలా విద్యార్ధులతో ఓ ఏఐ కాన్ఫరెన్సు నిర్వహించాలని స్పష్టం చేశారు. దానికి స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌గా పేరు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఆటిజం సహా దివ్యాంగ విద్యార్ధులకు విద్యాబోధనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా శ్రద్ధ తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్రీడలతోపాటు మానసికోల్లాసానికి కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌ను పెంచాలన్నారు. ఇంటర్‌లో విద్యార్ధులకు వివిధ కాంబినేషన్లలో కోర్సులు అందుబాటులో ఉండేలా చూడాలని దీనిపై అధ్యాపకులకు కూడా రీఓరియంటేషన్ నిర్వహించాలని సూచించారు. విద్యార్ధుల్లో టెక్నాలజీ కాంపీటెన్సీ పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమం ద్వారా పరిశుభ్రతా అంశాలపై విద్యార్ధుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది అధ్యయనం చేయాలన్నారు. పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో విద్యార్ధులు మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
నైపుణ్యాలపై ర్యాండమ్ స్కిల్ ఆడిట్
రాష్ట్రంలోని యువత ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఏమేరకు నైపుణ్యాలు కలిగి ఉన్నారో ర్యాండమ్ స్కిల్ ఆడిట్ నిర్వహించాలని సీఎం సూచనలు చేశారు. ఈ విషయంలో ప్రపంచస్థాయి అత్యుత్తమ నైపుణ్యాలు మన యువతకు అందేలా చేయాలని.. దీని కోసం ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలతో అనుసంధానం చేసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు స్కిల్ గ్యాప్ అడ్వైజర్లను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పూర్తి నైపుణ్యంతో ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. తద్వారా మరింత మందికి ఉపాధి అవకాశాలు మెరుగవటంతోపాటు ఆర్ధిక లావాదేవీలు పెద్దఎత్తున జరుగుతాయన్నారు.
పీఎం సేతు ప్రాజెక్టు ద్వారా ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో అభివృద్ధి చేయాలని సూచించారు. పాలిటెక్నిక్ లు ఇంజనీరింగ్ కళాశాలల ద్వారా ఎనర్జీ, లాజిస్టిక్స్, క్వాంటం, ఏఐలాంటి రంగాల్లో నైపుణ్యాలు పెరగాలని స్పష్టం చేశారు. దీంతో పాటు జిల్లాల వారీగా స్కిల్ మ్యాప్ తయారు చేయటం ద్వారా ఏ ప్రాంతంలో ఎంతమంది నిపుణుల లభ్యత ఉందనేది తెలియచేసే అవకాశముందన్నారు. గడచిన 22 నెలల్లో ఇప్పటి వరకూ 7 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని.. స్వయం ఉపాధితో పాటు ఎంఎసఎంఈల ద్వారా కూడా ఉపాధి వచ్చిందన్నారు. వివిధ శాఖల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చిన వివరాలను ఓ సమీకృత పోర్టల్ ద్వారా సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. త్వరలోనే నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ వివరాలను వెల్లడించాలని సూచించారు.
అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్
రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో రీస్ట్రక్చర్ చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సమీక్షలో భాగంగా విద్యాశాఖలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలను ముఖ్యమంత్రికి వివరించారు. వన్ క్లాస్ వన్ టీచర్ పాఠశాలలను పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఎన్ రోల్ మెంట్ ను కూడా పెంచుతున్నామని వివరించారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ పాఠ్యాంశాలను మార్పు చేయటంతో పాటు బ్రిడ్జి కోర్సులు కూడా విద్యార్ధులకు అందిస్తున్నామని తెలియచేశారు. కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ ఎన్సీఆర్టీ సహకారంతో పాఠ్యాంశాలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తున్నట్టు తెలిపారు. బోధనా మాధ్యమాలను అధ్యయనం చేసేందుకు అత్యుత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఫిన్ ల్యాండ్ లాంటి దేశాలకు పంపుతున్నట్టు సీఎంకు తెలియచేశారు.
ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరరీలో ఏపీని అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. టీచర్ – స్టూడెంట్- అవుట్ కమ్ అనే విధానంలో విద్య శాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు. బడికోసం పేరిట మౌలిక సదుపాయాలను కల్పించటంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ముఖ్యమంత్రికి తెలియచేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాలేజీ అవర్స్ ను పెంచి విద్యార్ధులు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేలా శిక్షణ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఫలితాలు మెరుగయ్యేలా ఇంటర్ సప్లిమెంటరీ రాసుకునేందుకు విద్యార్ధులకు వెసులుబాటు కల్పించామని తెలియచేశారు. నైపుణ్యాభివృద్ధి కల్పనలో భాగంగా అందరికీ స్కిల్ అసెస్మెంట్ చేస్తున్నామన్నారు. ఈ సమీక్షకు పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.














