- అన్ని గ్రామాల్లో 20 వరకు నిర్వహణ
- 30 వేల పనులకి పండుగ వాతావరణంలో శ్రీకారం
- రూ.4,500 కోట్ల నిధులతో ఉపాధి పనులకు గ్రామసభల ఆమోదం
- పనుల్లో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ దిశానిర్దేశం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ‘పల్లె పండుగ ` పంచాయతీ వారోత్సవాలు’ నిర్వహించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గ్రామీణ కుటుంబాలకు నివాసం ఉంటున్న గ్రామాల్లో ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి కల్పించటం, సుస్థిర ఆస్తులు ఏర్పాటు చేసి జీవనోపాధులు మెరుగు పరచటం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ చట్టం ద్వారా ఉపాధి వేతనదారులకు కల్పించిన హక్కులను అమలు చేయాలన్నారు. పని కోరిన 15 రోజులలో పని పొందే హక్కు, లేని పక్షంలో నిరుద్యోగ భృతి, పని ప్రదేశం నివాసానికి 5 కి.మీ.కంటే దూరం ఉంటే రోజూ కూలీకి అదనంగా 10 శాతం వేతనం, పని ప్రదేశాల్లో ప్రథమచికిత్స, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించడం, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతన రేటు రూ.300 ఇవ్వడం, పని ప్రదేశంలో కూలి మరణించినా, పూర్తిగా అంగవైకల్యానికి గురైనా ఆ కుటుంబానికి రూ.50,000 నష్ట పరిహారం వంటి హక్కులను వారికి అందించాలని సూచించారు.
13,326 గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా గ్రామసభలు
ఈ ఏడాది ఆగస్ట్ 23న రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో మునుపెన్నడూ లేని విధంగా అందరి సహకారంతో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించాం. ఇందుకుగాను వరల్డ్ రికార్డ్ అవార్డు అందుకున్నాం. ఈ కార్యక్రమం మీ అందరి సహకారంతో చేయగలిగాం. అందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఉపాధి హామీ పథకంలో మే 20వ తేదీ నుండి పెండిరగ్ ఉన్న కూలీల వేతనాలను రూ. 2081 కోట్లను చెల్లించాం. ఉపాధి హామీ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి సరిపడా రూ.4500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సభల ఆమోదం తీసుకున్నారు. గ్రామసభల తీర్మానాల ఆధారంగా ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు 26,715 పనులకు 2,239 కోట్ల రూపాయలకు జిల్లా కల్లెక్టర్లు పరిపాలనా ఆమోదం ఇచ్చారు. పల్లె పండుగ కార్యక్రమంలో రూ.4,500 కోట్ల నిధులతో 30 వేల పనులకు శ్రీకారం చుడతామని పవన్ అన్నారు.
పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచాలి
గ్రామాల్లో మరింత పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకుగాను మంజురైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజ చేయడానికి సంకల్పించాం. ఈనెల 14 నుండి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ‘‘పల్లెపండగ ` పంచాయతీ వారోత్సవాలు’’ కార్యక్రమంలో ఈ పనులకు పెద్దఎత్తున భూమిపూజ చేయాలి. శాసనసభ్యులకు ఈ కార్యక్రమం గురించి తెలియజేయాలి. శంకుస్థాపన కోసం గ్రామ పంచాయితీలు, ఎమ్మెల్యేల వారీగా రోజువారీ రూట్ మ్యాప్‌లను సిద్ధం చేయాలి. గ్రామ సచివాలయ, ఉపాధి హామీ, లైన్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.
కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యకలాపాలు
ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులపై అవగాహన కల్పించాలి. పని ఉపయోగం, భవిష్యత్తులో వాటి నిర్వహణపై ప్రజల్లో అవగాహన, బాధ్యత పెంచాలి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ఎలా విజయవంతంగా నిర్వహించామో, అలాగే ఈ ‘‘పల్లెపండగ ` పంచాయతీ వారోత్సవాలు’’ నిర్వహించడానికి కృషి చేద్దాం. అలాగే ప్రతి గ్రామ పంచాయితీలో అందరికీ కనిపించేలా 2024-25 సంవత్సరంలో చేపట్టబోయే పనులు, పూర్తి చేసిన పనుల వివరాలు తెలియపరిచే ‘‘సిటిజెన్ నాలెడ్జ్ బోర్డు’’ ఏర్పాటు చేయాలని పవన్ సూచించారు.
ఫార్మ్ పాండ్లు, గోకులాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం
ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల్లో పండ్ల తోటలు, ఫార్మ్ పాండ్లు, గోకులాలు వంటి ఆస్తుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నీటి ఎద్దడి గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించి భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా చేయాలి. అన్ని ప్రభుత్వ సంస్థల భవనాల్లో పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలను నిర్మించాలి. ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో భాగంగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, బీటీ రోడ్లను సంక్రాంతి నాటికి పూర్తి చేసి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో మళ్లీ ఘనంగా పల్లె పండుగ నిర్వహించుకుందామని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనంతరం.. కలెక్టర్లతో మాట్లాడి జిల్లాల్లో పరిస్థితులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక, సిమెంట్, తదితర విషయాల్లో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, డ్వామా పీడీలు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఉపాధి ఏపీవోలు పాల్గొన్నారు.