అమరావతి: వినాయక చవితి వేడుకలపై జగన్‌రెడ్డి ఆంక్షలు విధించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ చలానాలు కట్టాలంటూ పండగని జరుపుకోనివ్వకుండా జగన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పరామర్శలకు, సొంత నియోజక వర్గాలలో సమావేశాలకు టీడీపీ నాయకులు వెళ్తుంటే వైసీపీ అల్లరిమూకలు అడ్డుపడి గొడవలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు చేసే తప్పుడు పనులను కప్పిప్పుచ్చుకొనేందుకు ప్రభుత్వ అధికారులని ఉపయోగించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో వ్యాపారులని ఇబ్బందులు పెడుతున్నారని, మహిళలకు, రైతులకు రక్షణ లేదని, చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, రేషన్ డీలర్ల వరకు రోడ్డుక్కే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలను ఇబ్బంది పెట్టి జగన్ ఏం సాధించారని అడిగారు. గత ఏడాది కరోనా విపత్కర పరిస్థితుల వల్ల వినాయక చవితి జరుపుకోలేక పోయామన్నారు. ఈ సంవత్సరమైనా కలిసికట్టుగా వినాయక చవితి నవరాత్రులు జరుపుకుందామంటే కొత్త కొత్త నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. హిందూ సాంప్రదాయాలను అడ్డుకుంటున్నారని చెప్పారు.
పందిరి అనుమతికి నోటరీ, దేవుడి ప్రతిమ కొలతలు, ప్రతిష్ఠంచే స్థలం వివరాలు, ఎన్ని రోజులు తరువాత నిమజ్జనం చేస్తారు? నిమజ్జన మార్గం, ముందస్తు సమాచారం లేకుండా డీజే సౌండ్ బాక్స్ లు పెట్టరాదని, కమిటీ మెంబర్ల ఆధార్ కార్డ్ వివరాలు, నిమజ్జన వాహాన డ్రైవర్ లైసెన్స్ లు ముందుగా ఇవ్వాలని, ఎన్ని సౌండ్ బాక్సులు పెడితే ఒక్కో దానికి రోజుకి రూ.100లు చలానా కట్టాలని జగన్ రెడ్డి ఆంక్షలు విధించడం అన్యాయమన్నారు. స్పీకర్ లు పెడితే దానికి అద్దె కడతాం, కరెంటు బిల్లు కడతాం జగన్ రెడ్డికి టాక్స్ ఎందుకు కట్టాలని ప్రశ్నించారు.
రంజాన్, క్రిస్టమస్, వినాయక చవితి ఏ పండుగైనా అన్నదమ్ముల్లా కలిసి చేసుకునే వాళ్లం, అలాంటిది జగన్ రెడ్డి ఎన్నడూ లేని ఆంక్షలు పెడుతున్నాడన్నారు. గతంలో విజయవాడలోని వెల్లుల్లిపాయి ప్రాంతంలో చంద్రబాబు రోడ్డు వెడల్పు చేయిస్తే, అందులో దేవాలయాలు పోయాయి అని జగన్ తెగ మాట్లాడాడని, ఆయన సీఎంగా ఉండగా 136 దేవాలయాలపై దాడులు జరిగాయని, దానికి కారణమైన వారిని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేదని చెప్పారు.
వైసీపీ నాయకులు 420 పనులు చేయడానికి ఉన్నారు తప్ప హిందూ సాంప్రదాయ ధర్మాన్ని కాపాడేందుకు లేరని మండిపడ్డారు. దేవాలయాల మీద దాడులు జరిగాయంటే మూగ జీవాల పేర్లు చెబుతారు, ఇదేమైనా గుండెపోటు బాబాయి స్టోరీ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సరైనా సమయంలో జగన్ రెడ్డి బటన్ నొక్కే పద్ధతిలోనే ప్రజలంతా బటన్ నొక్కి బుద్ధి చెబుతారని డూండీ రాకేష్ హెచ్చరించారు.
కుప్పంలో అలజడి సృష్టిస్తున్న వైసీపీ
సుదీర్ఘ కాలంగా ప్రశాంతతకు నిలయంగా ఉన్న కుప్పంలో వైసీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారని డూండీ రాకేష్ ధ్వజమెత్తారు. గతంలో అక్కడ అధికారపక్షం, ప్రతిపక్షంవారు అన్నదమ్ముల్లా కలిసి పనిచేశారన్నారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అడ్డుకుంటారా అని అడిగారు. పేదల కడుపు నింపడానికి సొంత నిధులతో అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ అధికారులు వైసీపీ గూండాల సహాయంతో కూల్చుతారా అని ప్రశ్నించారు. ఇది చాలా దారుణమైన విషయమన్నారు. చంద్రబాబును నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకోవడం అన్యాయంగా పేర్కొన్నారు. చంద్రబాబును అడ్డుకోవడంతో నీ పతనం ప్రారంభమైందని, త్వరలో ప్రభుత్వం మారబోతోందని హెచ్చరించారు. ఎన్నిరోజులు ఆపుతారో చూస్తామని, ప్రతి కార్యకర్త కుప్పంకు తరలి వచ్చి కూల్చిన క్యాంటిన్ ను మళ్లి నిలబెట్టబోతున్నారన్నారు. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు సైకోల్లా తయారయ్యారని డూండీ రాకేష్ మండిపడ్డారు.