- 5కోట్ల ఆంధ్రులు గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మిస్తాం
- కుటుంబసభ్యులే నమ్మని జగన్‌ను ప్రజలెలా నమ్మాలి?
- కూల్చడం మా బ్లడ్ లో లేదు, రుషికొండ ప్యాలెస్‌ను ప్రజావసరాలకే వినియోగిస్తాం
- ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ సొమ్మంతా ఏ పందికొక్కులు తిన్నాయో చెప్పాలి
- విజయనగరం యువగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
విజయనగరం: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని ఐటీి రాజధానిగా తీర్చిదిద్దుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయనగరం ఎంఆర్ స్టేడియం గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన యువగళం సభలో యువనేత పాల్గొన్నారు. కార్యక్రమానికి జర్నలిస్టు గోపి యాంకర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…. అధికారంలోకి వచ్చాక మూడునెలలకే జగన్ మూడు ముక్కలాట మొదలెట్టారన్నారు. కర్నూలు న్యాయరాజధాని, విశాఖ పరిపాలనా రాజధాని, శాసన రాజధానిగా అమరావతి అన్నారు. కర్నూలులో ఒక్క ఇటుక పెట్టలేదు, అమరావతిని సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో ఒక్క భవనమైనా కట్టారా? రుషికొండకు మాత్రం గుండుకొట్టి ఒక్క వ్యక్తి బతకడానికి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ డబ్బుతో విజయనగరం జిల్లాలో పేదలందరికీ ఇళ్లు నిర్మించే అవకాశం ఉండేది. నిబంధనలు ఉల్లంఘించి రుషికొండలో కట్టిన ప్యాలెస్‌కు కేంద్రం రూ.200 కోట్ల పెనాల్టీ కూడా విధించింది. మొత్తం రూ.700 కోట్లు దుర్వినియోగం చేశారు. రాష్టపతి భవనానికి కూడా అంత ఖర్చుపెట్టలేదు. కూల్చడం టీడీపీ బ్లడ్ లో లేదు. చంద్రబాబుకు కట్టడమే తెలుసు, కూల్చడం తెలియదు, ఎప్పుడూ నిర్మాణాలు చేయాలి, పిల్లల భవిష్యత్ మార్చాలని ఆలోచిస్తారు, బిడ్డల జీవితాలు మార్చాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక ముందు రుషికొండ ప్యాలెస్‌లో ఏం ఉందో పరిశీలించి, దేనికి ఉపయోగించాలో నిర్ణయిస్తామని లోకేష్ చెప్పారు.
ఆగిపోయిన పనులన్నీ ప్రారంభిస్తాం…
చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో అమరావతి రాజధాని చట్టం తెచ్చారు. అదే సభలో జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి సిద్ధంగా లేను, అమరావతికి మద్దతు తెలుపుతున్నానని చెప్పి, 30వేల ఎకరాల్లో రాజధాని కట్టాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు ల్యాండ్‌పూలింగ్ ద్వారా భూములు ఇచ్చారు. సచివాలయం, అసెంబ్లీ, రోడ్ల నిర్మాణం చేపట్టాం. 2019లో రాష్ట్రప్రజలు ఒక్క అవకాశం మాయలో పడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ గానీ, ఒక్కరికి ఉద్యోగం గానీ వచ్చిందా? ఎక్కడ చూసినా భూకబ్జాలు, దోపిడీలు, ఇసుక, గంజాయి, డ్రగ్స్ మాఫియాలు, హత్యలు, అత్యాచారాలే. పక్క రాష్ట్రాల పత్రికల్లో ప్రతిరోజూ పెట్టుబడుల వార్తలు వస్తున్నాయి. పాలనా సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది మా విధానం. అందులో భాగంగానే అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ.. చిత్తూరులో ఎలక్ట్రానిక్స్.. కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, సిమెంట్ పరిశ్రమలు.. ఉత్తరాంద్రను ఐటి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అడుగులు వేశాం. భోగాపురం విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావించి భూసేకరణ కూడా పూర్తిచేశాం. మరో నెలలో మన ప్రభుత్వం వస్తుంది, ఆగిపోయిన పనులన్నీ ప్రారంభిస్తాం. అయిదుకోట్ల ఆంధ్రులు గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం, పక్క దేశాల్లో కూడా చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేపడతాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తాం. అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు అంటే బ్రాండ్, జగన్ అంటే జైలు, పెట్టుబడిదారులు చాలామంది వెయిటింగ్‌లో ఉన్నారు. మేం వచ్చాక మొదటివందరోజుల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఐటి మంత్రిగా ఉన్నపుడు విశాఖకు పరిశ్రమలు తెచ్చాను. ఈసారి ఎక్కువ ఉద్యోగాలు కల్పించేవారికి ప్రోత్సాహకాలు ఇస్తాం. స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని లోకేష్ చెప్పారు.
కుటుంబసభ్యులే నమ్మడం లేదు….
జగన్ ఒక బిల్డప్ బాబాయి. వెయ్యికోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి నువ్వే మా నమ్మకం అని బోర్డులు పెట్టారు. కుటుంబసభ్యులే ఆయనను నమ్మడం లేదు. హత్యారాజకీయాలు చేసిన అన్నను నమ్మవద్దని చెల్లి సునీత చెప్పింది. జగన్ కు ఓటువేస్తే మా కుటుంబానికి పట్టిన గతే రాష్ట్రానికి అని చిన్నమ్మ సౌభాగ్యమ్మ చెప్పింది, జగనన్న ఊసరవెల్లి అని చెల్లెమ్మ షర్మిల చెప్పింది, వైఎస్ విజయలక్ష్మి కూడా భయపడి అమెరికా వెళ్లిపోయింది. కుటుంబసభ్యులే నమ్మని జగన్‌ను ప్రజలు ఎలా నమ్మాలి? వైసీపీ నాయకులను వారి కుటుంబసభ్యులు నమ్మడం లేదు. అంబటి రాంబాబు నీచుడు, దుర్మార్గుడు అని ఆయన అల్లుడు చెప్పారు, సొంత కొడుకుకే న్యాయం చేయలేదని ముత్యాలనాయుడు కుమారుడు చెప్పాడు. ముద్రగడ కూతురు మీడియా ముందు వైఎస్ జగన్ మా తండ్రిని ట్రాప్ లో పడేశారని, వాడుకుని వదిలేస్తాడని చెప్పింది. దువ్వాడ శ్రీను భార్య తన భర్తకు ఓటువేయద్దని చెప్పింది. జగన్, వైసీపీ నాయకులను వారి కుటుంబసభ్యులు నమ్మడం లేదు. 5కోట్ల మంది ప్రజలు ఎలానమ్మాలని లోకేష్ ప్రశ్నించారు.
తొలిబాధితులు యువతే….
జగన్‌కు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే తెలియదు. ఆయన సిఎం కావడంవల్లే యువత ఉద్యోగాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. 2014లో ఎపి విభజన జరిగింది. రాజధాని లేని రాష్ట్రంగా ప్రయాణం ప్రారంభించి, అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ నిర్మించాం. రాష్ట్రానికి రూ.15లక్షల కోట్లు పెట్టుబడులు, 35లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు కుదుర్చుకుని, 6లక్షల ఉద్యోగాలిచ్చాం. 2019లో ఒక్క అవకాశం మాయమాటలు నమ్మి మోసపోయాం. జగన్ పాలనలో యువతీ, యువకులే మొదటి బాధితులు, అధికారంలోకి వచ్చాక 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నాడు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పిల్లలు కాలేజిల నుంచి బయటకువచ్చే సమయానికి ఉద్యోగాల్లేవు. ప్రతిఏటా కానిస్టేబుల్ పోస్టులు అన్నాడు, ఒక్క పోస్టు లేదు. స్టడీసర్కిళ్లు రద్దు చేశాడు. ఫీ రీయింబర్స్‌మెంట్ లేదు. నిరుపేద విద్యార్థులకు విదేశీవిద్య కూడా రద్దు చేశాడు. జగన్ సిఎం అయ్యాక గతంలో చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అమర్‌రాజా, లులూ, హెచ్‌ఎస్‌బీసి హైదరాబాద్ వెళ్లిపోయాయి. ఉత్తరాంధ్రకు కోడిగుడ్డు తెచ్చాడు జగన్. ఐటి మంత్రిని కంపెనీలు అడిగితే కోడిగుడ్డు కథలు చెబుతారు, అలాంటి వారు మనకు అవసరమా? నిరుద్యోగ యువతకు హామీ ఇస్తున్నా, తొలిసంతకం మెగా డిఎస్సీపైనే, సింగిల్ జాబ్ క్యాలెండర్‌తో ప్రతిఏటా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తాం, అయిదేళ్లలో పెండిరగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం, ప్రైవేటురంగంలో పెట్టుబడులు, పరిశ్రమలు రప్పించి 20లక్షల ఉద్యోగాలు తెస్తాం, ఉద్యోగం వచ్చేవరకు యువతకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని లోకేష్ తెలిపారు.
31మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారు?
జగన్ ఊరూరా తిరిగి 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢల్లీి మెడలు వంచుతానన్నాడు. 31మందిని గెలిపిస్తే ఏనాడైనా మన గురించి పోరాడారా? ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు. బాబాయి హత్యకేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసేందుకు వస్తే ఒక ఎంపి దొంగచాటుగా హాస్పటల్‌లో దాక్కున్నాడు. మరో ఎంపి రీల్స్ వీడియోలు చేస్తాడు. విశాఖ ఎంపి కుటుంబసభ్యులు కిడ్నాప్‌కు గురైతే హైదరాబాద్ పారిపోయాడు. వీరందరికంటే ఘనుడు విజయసాయి అనే మరో దొంగ విశాఖను దోచేసి తాడేపల్లి ప్యాలెస్‌కు డబ్బులెక్కలు చెప్పే పనిలో బిజీగా ఉన్నాడు. 31మంది ఎంపిలు చేతిలో ఉంటే ఢల్లీిని వణికించాలి. అయతే జగన్ స్వప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఏనాడు రాష్ట్రం కోసం పోరాడలేదు. టీడీపీకి పార్లమెంటులో పులుల్లాంటి ఎంపిలు ఉన్నారు. రాష్ట్ర సమస్యలపై రామ్మోహన్‌నాయుడు ఉత్తరాంధ్ర గళాన్ని పార్లమెంటులో విన్పించారు. గుంటూరు ఎంపీ జయదేవ్ పరిశ్రమలు, పెట్టుబడుల కోసం పార్లమెంటు సాక్షిగా పోరాడారు.
ఆ సొమ్మంతా ఏ పంది కొక్కులు తింటున్నాయో చెప్పండి….
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్‌మీట్ చూశాక వారిలో వణుకు అర్థమైంది. ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ మాఫియాలని ప్రధాని చెబితే అవన్నీ పాతవే అంటున్నాడు. టిడిపి అధికారంలో ఉన్నపుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఉన్న ఇసుక ఇప్పుడు రూ.7వేలకు అమ్ముతున్నారు. ఏ పందికొక్కులు ఆ డబ్బు తింటున్నాయి. గతంలో రూ.80 ఉన్న మద్యం క్వార్టర్ ధర రూ.180 అయింది… ఏ పందికొక్కు ప్రజల రక్తాన్ని తాగుతున్నారో చెప్పాలి. ఇప్పుడు ప్రజల భూములకు కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. మనం కష్టపడి భూములు కొనుక్కున్నాం. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోలు ఎందుకు, ఆయనేమైనా కొనిచ్చాడా? మన భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆయన దగ్గర పెట్టుకుని జిరాక్స్ పత్రాలు మనకు ఇస్తాడంట. భూతగాదా ఉంటే అధికారులే తేలుస్తారట. ఏమరపాటుగా ఉంటే మీ బిడ్డను అంటున్న జగన్ మీ భూములు కొట్టేస్తాడని లోకేష్ హెచ్చరించారు.
ఆంధ్రులారా మేలుకోండి… ఎన్నాళ్లీ వలసబతకులు?
మేలుకోండి ఆంధ్రులారా, ఎన్నాళ్లు ఉద్యోగాలు, ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తాం. మనకు పౌరుషం, ఆత్మగౌరవం లేదా? మన ఓటుపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది. అయిదేళ్లలో చాలా నష్టపోయాం. మళ్లీ రాష్ట్రాన్ని జాబ్ క్యాపిటల్ గా మార్చాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం అశోక్ గజపతిరాజుని ఎంత ఇబ్బంది పెట్టిందో చూశాం. కేంద్ర, రాష్ట్ర మంత్రిగా ఆయన పనిచేశారు. ఇవ్వడమే తప్ప చేయిచాచి తీసుకునే గుణం ఆయనకు లేదు. అలాంటి కుటుంబంపై జగన్ దాడి చేశారు. ఆయనను సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు నుంచి గెంటేశారు. సింహాచలం భూములు కొట్టేయడానికి విజయసాయి, బొత్స ప్రయత్నించారు. రాష్ట్రం మళ్లీ మరోసారి నష్టపోకూడదు. ఇప్పటికే 30ఏళ్లు వెనక్కి పోయింది. విజయనగరం గడ్డపై పసుపుజెండా ఎగురవేయాలి. గతంలో మాదిరి ప్రత్యేక శ్రద్ధ వహించి, విజయనగరం జిల్లాకు పరిశ్రమలు తెస్తాం, యువతకు ఉపాధి కల్పించి వలసలను నివారిస్తాం. జగన్‌లా నేను పరదాలు కట్టుకుని తిరగను. జగన్‌లా చెట్లు కొట్టించను. నేను ఏనాడు తప్పుచేయలేదు. ధైర్యంగా ప్రజలముందు నిలబడ్డా. మీతరపున పోరాడుతున్నందుకు రెండురోజుల కిందట కూడా నాపై, చంద్రబాబుపై కేసులు పెట్టారు. బాంబులకే భయపడని కుటుంబం మాది, జగన్ చిల్లరకేసులకు భయపడతామా? జగన్ నీ టైమ్ అయిపోయింది, ఎపి ప్రజలు నిన్ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పవనన్న మంచి స్లోగన్ ఇచ్చారు, హలో ఎపి, బైబై వైసిపి అని… అదే నినాదంతో ఈనెల 13న వైసిపికి బైబై చెప్పాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
ఉత్తరాంధ్రకు పట్టిన క్యాన్సర్ గడ్డ బొత్స కుటుంబం….
ఉత్తరాంధ్ర దద్దరిల్లింది…. యువగళం యువగర్జనగా మారింది. ఈ సభ చూశాక తాడేపల్లి కొంపలో టివిలు పగడలడం ఖాయం. విజయనగరం రాజులు ఏలిన నేల ఇది, శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం కొలువైన నేల విజయనగరం. బొత్స కుటుంబం ఉత్తరాంద్రకు క్యాన్సర్ గడ్డలా పట్టారు. 2019లో బొత్స కుటుంబాన్ని గెలిపించారు, ఆ కుటుంబం జిల్లాను కేకు ముక్కలా కోసుకుని తింటున్నారు. బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, చిన్నశ్రీను, బెల్లాన చంద్రశేఖర్ ఏరియాలవారీగా పంచుకున్నారు. ఉత్తరాంధ్రలో వైసిపి వచ్చాక ఒక్క ఉద్యోగం వచ్చిందా, ఒక్క పరిశ్రమ వచ్చిందా, వైసిపి వారు మాత్రం బాగుపడ్డారు, వారి కంపెనీలకు ఆదాయం పెరిగింది, వారికి అధికారమిస్తే అధికారులను అడ్డుపెట్టి భూములు కాజేస్తారు. గత టిడిపి హయాంలో విజయనగరం జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. తోటపల్లి ప్రాజెక్టుకు రూ.774 కోట్లు వెచ్చించాం. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి పనులు ప్రారంభిస్తే జగన్ వచ్చాక రద్దుచేశారు. సెంచురియన్ యూనివర్సిటీ, భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ చేసి పనులు ప్రారంభించింది చంద్రబాబు. గోస్తనీ, చంపావతి నదినుంచి విజయనగరానికి తాగునీరు తెచ్చాం, ఫ్లైఓవర్లు, బైపాస్ రోడ్లు నిర్మించాం, మహారాజా ఆసుపత్రిని 300 పడకలకు విస్తరించాం, పేదలకు పెద్దఎత్తున టిడ్కో ఇళ్లు కట్టించాం. గతంలో మాదిరే ఉత్తరాంధ్రపై ప్రత్యేక శ్రద్దపెట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లోకేష్ చెప్పారు.
అదితి, అప్పలనాయుడులను గెలిపించండి…
అశోక్ గజపతి రాజు గురించి చెప్పాలంటే రోజంతా చెప్పాల్సి ఉంటుంది. నన్ను చిన్నపుడు ఎత్తుకున్నారు, ఆయనను చూస్తూ పెరిగాను. ఆయనకున్న ప్రజాదరణ చూశాను. మాజీ కేంద్ర, రాష్ట్రమంత్రిగా గాక సామాన్యుడిలా ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ప్రయత్నించారు. అశోక్ గజపతి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అదితి వచ్చారు. బొత్స కుటుంబం ఎంత అవినీతి చేశారో చూశాం, విజయనగరం ఎంత వెనుకబడిరదో చూశాం, అదితిని గెలిపించి శాసనసభకు పంపండి. కేంద్రంలో మన తరపున ప్రశ్నించే స్వరం విన్పించే ఎంపి కావాలి. కూటమి బలపర్చిన కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించండి. చాలామంది మొదటిసారి ఓటువేయబోతున్నారు. ఓర్పు, సహనంతో సైకిల్ కు ఓటువేసి గెలిపించండి. గుర్తుతో అయోమయాన్ని సృష్టిస్తారు. అప్రమత్తంగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువనేత లోకేష్ పిలుపు ఇచ్చారు.