- ప్రధాని మోదీ పర్యటనకు సర్వ సన్నద్ధం
- లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం
- విశాఖలో అమల్లోకి భద్రతా ఆంక్షలు..
- ఎస్పీజీ ఆధీనంలో సభా ప్రాంగణం
- సమీప స్థానికులకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి
- కొత్త వ్యక్తులపై పోలీసుల డేగ కన్ను
- సభా ప్రాంగణంలో ఐదువేలమంది పోలీస్ బందోబస్తు
- ‘నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై’గా సభా ప్రాంగణ ప్రాంతం
- మోదీ సహా చంద్రబాబు, పవన్‌ల రోడ్ షో
- ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్‌లో భారీ బహిరంగ సభ
- 3 లక్షలమంది జనం హాజరవుతారని అంచనా
- భారీగా ఆహార పొట్లాలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు
విశాఖపట్నం (చైతన్య రథం): విశ్వజీత్‌గా గౌరవ మన్ననలు అందుకుంటోన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విశాఖ పట్నం సన్నద్ధమైంది. సభా ప్రాంగంగం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ పర్యటనకు పెద్దఎత్తున ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రధాని పర్యటన విజయవంతం చేయడానికి సకల ఏర్పాట్లూ చేసింది. ఐటీ మంత్రి లోకేష్ సారథ్యంలో రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగం.. ప్రధాని పర్యటన దిగ్విజయం చేయడానికి గత మూడు రోజులుగా శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఇదిలావుంటే, బుధవారం ప్రధాని పర్యటన నేపధ్యంలో మంగళవారం సాయంత్రం నుంచే బహిరంగ సభా ప్రాంగణాన్ని ప్రధాని భద్రతా వ్యవస్థ ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది.. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. బయటినుంచి వచ్చే వ్యక్తులపై పెద్దఎత్తున పోలీస్ నిఘా నడుస్తోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకూ సభా పరిసర ప్రాంతాల్లో ‘నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై’ విధించారు.
సభా ప్రాంగణాన్ని ఐదువేలమంది పోలీసు బలగాలు గస్తీ కాస్తున్నాయి. 35మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుంటే, గత రెండు రోజులుగా సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో బిజీగావున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధాని మోదీకంటే ముందుగానే విశాఖ చేరుకోనున్నారు. చంద్రబాబు సహా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. అక్కడినుంచి రోడ్ షో ఆరంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం ఏయూ ఎకనామిక్స్ విభాగం నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వరకూ (సభా ప్రాంగణం) సుమారు 1.5 కిలోమీటర్ల మేర.. 30 నిముషాలపాటు పెద్దఎత్తున రోడ్ షో సాగనుంది. సభా ప్రాంగణం దగ్గరే కావడంతో.. ప్రధాని నరేంద్రమోదీ ప్రజలను నేరుగా కలుసుకుంటూ రోడ్ షో నెమ్మదిగా సాగేలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5.30కు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.
ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ తొలి సభ కావడంతో.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఐదు లక్షల మందిని సమీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి ప్రాంతాల నుంచే కనీసం మూడు లక్షల మంది జనం ప్రధాని సభకు హాజరుకావొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఏడువేల వాహనాలు సైతం ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా భారీగా ఆహార పోట్లాలు, మంచినీళ్ల సౌకర్యం కల్పించారు. ప్రధాని టూర్ దృష్ట్యా బుధవారం ఉమ్మడి విశాఖలో పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రూట్, రోప్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, డామినేషన్ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాట్లు ట్రైల్ రన్స్ పూర్తి చేశాయి. ప్రధాని అధికారిక సభ కావడంతో `కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం మంగళవారం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైతే, మరోవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సైతం ఏర్పాట్లపై వరుస సమీక్షలతో బిజీబిజీగా కనిపించారు. ఇక, ఏయూ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర మంత్రులు, పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించారు. పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.
రెండు లక్షల కోట్ల అభివృద్ధికి శ్రీకారం
పన్డీయే ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతూ శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ కేంద్రంగా రూ.149 కోట్ల రూపాయలతో నిర్మంచనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే పూడిమడక వద్ద రూ.70వేల కోట్లతో నెలకొల్పనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.10.5వేల కోట్లతో నిర్మించనున్న కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్, రూ.4,917 కోట్లతో పది ప్రాజెక్టులు (రోడ్ల నిర్మాణం `విస్తరణ) పనులకు శంకుస్థాపన చేస్తారు. నక్కపల్లి దగ్గర రూ.1,438 కోట్లతో నిర్మించనున్న బల్క్ డ్రగ్ పార్క్, రూ.6028 కోట్లతో నిర్మించనున్న ఆరు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రూ.3,098 కోట్లతో ఏడు ప్రాజెక్టులుగా నిర్మించిన 234.28 కిలోమీటర్ల రోడ్లు, రూ.5718 కోట్లతో 323 కిలోమీటర్లమేర వేసిన మూడు రైల్వే లైన్లను ప్రారంభించి జాతికి అంకితమిస్తారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపన చేస్తుండటం పట్ల హోంమంత్రి వంగలపూడి అనిత ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాలు తెలిపారు. ప్రజలు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. 2019 నుండి 2024 వరకు పాయకరావుపేటలో ఒక్క కంపెనీ కూడా రాలేదని, ఇప్పుడు బల్స్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ రానుండటం నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా అభివర్ణించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు రానున్నాయని, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి అనిత వివరించారు.