- తీర సంపద అందిపుచ్చుకునేలా కార్యాచరణ
- కోతకు గురి కాకుండా రక్షణ చర్యలు
- నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో సముద్ర తీరం అభివృద్ధికి సమగ్ర విజన్ ప్లాన్ తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సముద్ర తీర అభివృద్ధికి సంబంధించి నిపుణులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలపై పూర్తి స్థాయి అధ్యయనం నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బ్లూ ఎకానమీలో భాగంగా సము ద్ర ఆర్థిక వ్యవస్థ గురించే చర్చ జరుగుతోందని.. అపారమైన వనరులను వెలికి తీస్తే విస్తృత ప్రయోజనాలు దక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏపీలో ఆక్వా కల్చర్ అభివృద్ధి చేశామని.. రొయ్యలు, చేపల సాగు, ఎగుమతుల్లో ఏపీ నెంబర్‌వన్ స్థానం లో ఉందన్నారు. ఆక్వా కల్చర్‌లో వాల్యూ అడిషన్ జరగాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీంతో పాటు ఆక్వా వ్యర్ధాలు కాలు ష్య కారకంగా మారి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ సవాళ్లను పరిష్కరించేలా పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
అలాగే మెరైన్ బయో డైవర్సిటీని కాపాడేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సముద్రాలతో పాటు తీరప్రాంతాల్లో దొరికే రేర్ ఎర్త్ మినరల్స్ పై కూడా ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టామని.. ఆ వనరులను అందిపుచ్చుకోవాలన్నారు. తీరప్రాంత రక్షణ పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. తుపాన్ల లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా సముద్ర తీరాల్లో మడ అడవులు, తాటి చెట్లు లాంటి మూడంచెల సహజ రక్షణ కవచం ఏర్పాటు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. పర్యావరణ అనుకూల విధానాలతో పాటు పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా సముద్ర తీరప్రాంతాలు తయారు కావాలని దిశానిర్దేశం చేశారు. అలాగే సీ వీడ్ అభివృద్ధి, మార్కెటింగ్ లాంటి అంశాలపై కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ నాయక్, రైతు సాధికార సంస్థ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, మెరైన్ డైవర్సిటీ సంస్థ వోయసీ సంస్థ ప్రతినిధి ఫిలిప్ తదితరులు హాజరయ్యారు.
















