వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. దీంతో వివేకా హత్య క్లైమాక్స్ కు చేరుకుంటున్నది. ఈ కేసుకు సంబంధించి కీలకంగా భావిస్తున్న వారిని సీబీఐ అరెస్ట్ చేస్తుండటం అధికార పార్టీలో కలకలం రేకెత్తిస్తోంది. రేపో మాపో మరికొన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం వుందని ప్రచారం జరుగుతుండటంతో పరువు నిలుపుకునేందుకు అధికార పార్టీ నానా తంటాలు పడుతున్న సూచనలు కానవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత, కీలక నేతలతో సోమవారం సమావేశం అయి తదుపరి చర్యలపై చర్చించారు.
వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకోవడం, ఆ కేసులో డిఫాల్ట్ బెయిల్ పొందిన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై న్యాయస్థానం నిర్ణయం వెలువరించే అవకాశం వుండటం, కోడికత్తి కేసు లో ఎన్ ఐ ఎ కోర్టు తుది ఉత్తర్వులు వెలువడనుండటం, కడప ఎంపి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలవటం, తదితర పరిణామాలతో సోమవారం అంతా ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకున్నది. అయితే ఎన్ ఐ ఎ కోర్టు కేసు విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అవినాష్ రెడ్డిని మంగళవారం ఉదయం హాజరు కావాల్సిందిగా సీబీఐ కోరింది. అయితే అవినాష్ రెడ్డి అరెస్ట్ పై సందేహాలు ఇంకా సమసిపోలేదు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఒక విషయం స్పష్టం అయింది. వివేకా హత్య, కోడికత్తి కేసు లు రెండింటి లోనూ వైసీపీ నేతలు అరోపించినట్టుగా టిడిపికి ఏవిధమైన సంబంధం లేదని రుజువయింది. ఆ రెండు సంఘటనలలో నూ వైసీపీ నాయకులు టిడిపి, దాని అధినేత చంద్రబాబు పై చేసిన ప్రచారాలు, ఆరోపణలు అన్నీ ‘ ఫేక్’ అని స్పష్టం అయింది. 2019 ఎన్నికలలో రాజకీయ లబ్దికోసమే ఆ సంఘటనలను టిడిపికి అంటగట్టి గోబెల్స్ ప్రచారం చేసిన వైనం బహిర్గతం అయింది. వివేకా హత్య కేసులో గుండెపోటు, అక్రమ లావాదేవీలు, ఆస్తి వివాదాలు, నిందితుని కుటుంబ సభ్యుల లైంగిక వేదింపులు తదితర కారణాలు వున్నాయని, ప్రస్తుతం నిందితులుగా వున్నవారే పలు రకాల ప్రచారం చేశారు. అయితే వారిలో ఏ ఒక్కరూ ఎన్నికల ముందు ప్రచారం చేసిన విధంగా టిడిపి పైన ఆరోపణలు చేయకపోవటం గమనార్హం.
టిడిపి పై ఉద్దేశపూర్వకంగా కట్టుకథలు అల్లి ఎన్నికలలో సానుభూతి ఓట్లు పొందిన వైసీపీ నాయకులు దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరమంది. ఒక కన్ను ఇంకొక కన్నును పొడిచిందా? లేక ఒక చేయి ఇంకొక చేతిని నరికిందా? అన్న విషయం పై మరి కొద్దిరోజుల్లోనే న్యాయదేవత సాక్షిగా స్పష్టత రానున్నది. అధికార పార్టీ నిజస్వరూపం బయట పడటంతో ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్టున్నారు. ఈ నేపథ్యంలోనే టిడిపి ప్రతిష్ట మరింతగా పెరుగుతున్నది అనటంలో సందేహం లేదు.