- మౌలిక సదుపాయాల కల్పనతో పూర్వవైభవం
- అందుబాటులోకి స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలు
- ప్రజలను క్రీడలు, వ్యాయామంవైపు మళ్లించాలి
- గ్రామీణ క్రీడలకు అందుబాటులోకి ఆటస్థలాలు
- 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు
- అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తగిన ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో క్రీడారంగానికి ప్రోత్సాహం ఇచ్చామని… నాడు పలు స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపడితే…. గత వైసీపీ ప్రభుత్వం అన్ని పనులు నిలిపివేసిదని చంద్రబాబు అన్నారు. నాడు ప్రారంభమై కొంతమేర పూర్తైన స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తిచేసి అందుబాటులోకి తేవాన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్నివర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని…. క్రీడలంటే కేవలం పోటీల్లో పాల్గొనే వాళ్లకు సంబంధించిన విషయంగానే చూడవద్దన్నారు.
అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వాళ్లూ క్రీడల్లో భాగస్వాములయ్యేలా చేయాలన్నారు. గతంలో గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్వంటి ఆటలు ఆడేవారని… ఇప్పుడు టీవీలు, ఇతర మాధ్యమాల కారణంగా ఆ సంస్కృతి పోయిందని సీఎం ప్రస్తావించారు. మళ్లీ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తే…. ప్రజలు ఆటలవైపు మొగ్గుచూపుతారని సీఎం స్పష్టం చేశారు. కబడ్డీవంటి ఆటలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ పనులు చేయవచ్చని తెలిపారు. ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ముందుకొస్తే… వారి పేర్లు పెట్టుకునే అవకాశం కల్పించాలని సూచించారు. తద్వారా ఆయా గ్రామాల్లో క్రీడా వసతులు ఏర్పాటవుతాయని సీఎం అన్నారు. ఆటలద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుందని…. ఐక్యత పెరుగుతుందని.. ఇదొక మంచి సంస్కృతిగా నిలుస్తుందని సీఎం సూచించారు.
2027లో వచ్చే జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో నిర్వహించాలనేది లక్ష్యంగా పెట్టుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలన్నారు. 2017లో రూపొందించిన క్రీడా పాలసీ 2022లో ముగిసినా.. వైసీపీ ప్రభుత్వం కొత్త పాలసీ రూపకల్పనపై చొరవ చూపలేదని, నూతన క్రీడా పాలసీని రూపొందించాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాల నిర్మాణంతోపాటు గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన వాటిని మళ్లీ నిర్వహణలోకి తీసుకురావాలని ఆదేశించారు. మెడల్స్ సాధనలో రాష్ట్రం వెనుకబడి ఉందని… ఈవిషయంలో ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. తిరుపతి, అమరావతి, వైజాగ్‌ను క్రీడా హబ్‌గా మార్చాల్సిన అవసరముందని అంటూ, ఈ మూడు ప్రాంతాల్లో అన్ని క్రీడల నిర్వహణకు సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. గత ప్రభుత్వం నిలిపేసిన ప్రాజెక్ట్ గాండీవ, ప్రాజెక్ట్ పాంచజన్య, ప్రాజెక్ట్ విజయ, డే బోర్డర్స్, స్పోర్ట్స్ నర్సరీస్ కార్యక్రమాలను తిరిగి పునరుద్ధరించాలని ఆదేశించారు.
అన్ని స్టేడియాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేసి విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలన్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో క్రీడా అకాడమీల ఏర్పాటుకు స్థలాలు పొందిన వారితో సంప్రదిపుంలు జరిపి, వెంటనే వాటి ఏర్పాటు పూర్తయ్యేలా చూడాలన్నారు. వారు ఆసక్తి చూపకపోతే కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలన్నారు. క్రీడా నగరంగా అమరావతిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానిలో అతిపెద్ద స్టేడియం నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్ర సచివాలయంతో పాటు…. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ చిన్నపాటి స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయంలో విధుల అనంతరం అధికారులు, ఉద్యోగులు కొద్దిసేపు ఆటలు ఆడుకునే అవకాశం కల్పించాలన్నారు.
రాష్ట్రంలో సాధ్యమైనంతమేర కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ గ్రౌడ్స్, యూనివర్సటీ గ్రౌండ్స్, ప్రైవేట్ విద్యాసంస్ధల గ్రౌండ్స్‌ను సామాన్య ప్రజలకు నిర్థేశిత సమయం వరకు అందుబాటులోకి తేవాలన్నారు. తద్వారా ఆయా ప్రాంతాల ప్రజలు వ్యాయామం, ఆటలు ఆడుకునేందుకు అవకాశం కలుగుతుందని సీఎం సూచించారు. సమీక్షలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.