యువగళం పాదయాత్రలో భాగంగా డోన్ నియోజకవర్గం ప్యాపిలి గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. జిల్లాలో ప్యాపిలి పెద్ద మండలం.మండలానికి నాలుగుదిక్కులా చెరువులున్నాయి. కానీ వాటిలో నీరు ఇంకిపోయింది. ఎండాకాలంలో నాలుగు రోజులకోసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయి. కెసి ప్రధాన కాలువలు, తుంగభద్ర, కృష్ణా నదుల నుండి చెరువులకు ఎవరూ నీరు తీసుకురావడం లేదు. ప్యాపిలి గ్రామంలో 16వేల జనాభా ఉంది. వర్షాధార పంటలపైనే ఆధారపడ్డాం.
ఫీజు రీయింబర్స్ మెంట్ లేక మా పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు. మా గ్రామంలోని చెరువులకు నీళ్లు, మా పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీళ్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు. పోలవరాన్ని పూర్తిచేసి మిగుల జలాలను రాయలసీమకు తీసుకురావాలని సంకల్పించారు.
72శాతం పోలవరం పనులు చంద్రబాబు పూర్తిచేస్తే, జగన్ రెడ్డి దాన్ని గోదావరిలో ముంచేశాడు. తాగు, సాగు నీళ్లు ఇవ్వడంపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. మేం అధికారంలోకి వచ్చాక నదుల అనుంసధానం ద్వారా రాయలసీమకు నీళ్లిస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్ధరించి పేద,బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను అందిస్తాం అని హామీ ఇచ్చారు.