- నీలిమీడియా తప్పుడు కథనాలతో దుష్ప్రచారం సరికాదు
- ప్రభుత్వంపై బురద రాజకీయాలు చేస్తే సహించేది లేదు
- మంత్రులు వంగలపూడి అనిత, అనగాని, నారాయణ
- ఆరోపణలపై బహిరంగ చర్చకైనా సిద్ధమని వెల్లడి
అమరావతి(చైతన్యరథం): వరద సాయంపై నీలిమీడియాలో అసత్య కథనాలు, వైసీపీ నేతల దుష్ప్రచారంపై రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన హోం, విపత్తుల నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై బురద జల్లుడు రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముందుగా మంత్రి అనగాని మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ మధ్య సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన దాదాపు 4.06 లక్షల మంది బాధితులకు నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. సుమారుగా రూ.602 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉందని అంచనా వేయగా అందులో రూ.601 కోట్లను ఇప్పటికే చెల్లించడం జరిగిందని, మిగిలిన సొమ్మును కూడా ఆధార్ సీడిరగ్ తదుపరి తక్షణమే చెల్లించడం జరుగుతుందని తెలిపారు.
చంద్రబాబు నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి కేవలం 115 రోజులే అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు ప్రతిరోజూ ఏదో మంచి చేయాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది ఒక టీమ్‌లాగా అహర్నిశలూ కృషిచేయడం జరుగుతుందన్నారు. 10 రోజుల్లోనే విజయవాడలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చి పారద ర్శకంగా, నిష్పక్షపాతంగా వరద నష్టపరిహారం కూడా చెల్లించామన్నారు. గత ప్రభుత్వంలో వరద సాయంగా రూ.2-4 వేలు ఇస్తే ఇప్పుడు దానిని రూ.25 వేలకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్క పిలుపుతో పలువురు దాతలు ముందుకొచ్చి దాదాపు రూ.400 కోట్ల విరాళంగా ఇచ్చారంటే అది చంద్రబాబుపై ప్రజల కున్న నమ్మకమన్నారు.
అందులో ఇప్పటికే దాదాపు రూ.252 కోట్లు సొమ్ము డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. అయితే ఈ విషయంలో జగన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తూ రోత పత్రికలో తప్పుడు కథనాలను రాయిస్తున్నారని మండిపడ్డారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, జనరేటర్లు, విద్యుత్ తదితర వాటిపై చేసిన ఖర్చుపై దుష్ప్రచారం చేస్తున్నారు..వాటికి చేసిన ఖర్చు రూ.23 లక్షలని మంత్రి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితుల సహాయార్థం మొత్తం చేసిన ఖర్చు రూ.139.44 కోట్లు అని వెల్లడిరచారు. జగన్‌రెడ్డి వరద విరాళంగా ప్రకటించిన రూ.కోటి ఇవ్వలేదని, మరి ఆ రూ.కోటిని ఏ విధంగా ఖర్చు చేశారో, ఎవరికిచ్చారో కూడా తెలియదన్నారు.
రూ.601 కోట్లు ఖర్చు చేస్తే.. రూ.534 కోట్లు దుర్వినియోగమా?
మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన బాధితులకు రూ.601 కోట్లు ఖర్చు చేస్తే అందులో రూ.534 కోట్లు దుర్వినియోగం జరి గిందని జగన్‌రెడ్డి విమర్శిస్తూ తన పత్రికలో కథనాలు రాయించడం విడ్డూరంగా ఉందన్నా రు. వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే మొత్తం రూ.139.44 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అందులో తాత్కాలిక వసతి కోసం రూ.8.42 కోట్లు, ఆహారానికి రూ.92.51 కోట్లు, తాగునీటికి రూ.11.22 కోట్లు, మెడికల్ కేర్‌కు రూ.4.55 కోట్లు, శానిటేషన్/పునరావాస కేంద్రాలకు రూ.20.56 కోట్లు, మిగిలినవి ఇతర అవసరా లకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రోజుకు 12 లక్షల ఫుడ్ ప్యాకెట్లను, 30 లక్షల వాట ర్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
పారిశుధ్య పనుల కోసం దాదాపు ఏడు వేల మందిని బయటి నుంచి తెప్పించడమే కాకుండా మరో మూడు వేల మంది మున్సిపల్ సిబందిని కలుపుకుని మొత్తం 10 వేల మందితో రేయింబవళ్లు పారిశుధ్య పనులు చేయబట్టే ఎటువంటి అంటు వ్యాధులు రాలేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజన్లను విజయవాడకు తెప్పించి ఇళ్లలో కూడా క్లీన్ చేయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశించిన వెంటనే 3.83 లక్షల కుటుంబాలకు రూ.572 కోట్లు వెంటనే వారి ఖాతాల్లో జమచేయడం జరిగిందని, ఇప్పుడు ఆధార్ ఫీడిరగ్ అయిన తదుపరి మొత్తం 4.06 లక్షల మందికి రూ.600 కోట్లు జమచేయడం జరిగిందన్నారు. మరో 8 వేల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, వాటి థర్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, ఆ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే వారికి కూడా చెల్లింపు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంత చేస్తే జగన్‌రెడ్డి విమర్శించడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు.
ఆదుకోవాల్సింది పోయి విమర్శలు సిగ్గుచేటు
హోం, విపత్తుల నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ రాని విపత్తు వరద రూపంలో విజయవాడలో వచ్చిందన్నారు. 10 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ మార్గనిర్దేశనం చేస్తూ సాధారణ పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. రోడ్లు, ఇళ్లల్లో పేరుకున్న బురదను ఫైరింజన్‌ల ద్వారా శుభ్రం చేయించారని తెలిపారు. ఈ విషయంలో ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నామన్నారు. వరదసాయంగా మొత్తం ఖర్చు అయింది రూ.601 కోట్లు అయితే రూ.300 – రూ.400 కోట్ల అవినీతి జరిగిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. ఆహారానికి రూ.92.5 కోట్లు, తాగునీటికి రూ.11.2 కోట్లు, మెడికల్ కేర్‌కు రూ.4.55 కోట్లు, పారిశుధ్యానికి రూ.20.56 కోట్లు ఖర్చయింద న్నారు. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాల్లో రూ.139.44 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.
వరదలతో తీవ్రంగా నష్టపోతే ఆదుకోవాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదని.. అవసరమైతే ఆరోపణలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జీవోను సైతం సవరించి నష్టపరిహారం పెంచి అందించారని, బ్యాంకు ఖాతాల సమస్యలను కూడా ప్రభుత్వమే పరి ష్కరించిందన్నారు. వరద విరాళాలపై కూడా ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిప డ్డారు. దాతలు తమ విరాళాలను చెక్కులు, డీడీల రూపంలో అందించారని వీటికి అన్ని లెక్కలు ఉంటాయని స్పష్టం చేశారు. ఏకంగా 20 కిలోమీటర్లు జేసీబీ మీద ప్రయాణించి సీఎం వాస్తవ పరిస్థితులను అంచనా వేశారని, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా చంద్ర బాబు ఎప్పటికప్పుడు మంత్రులకు, అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆరోపణలు చేసేవారు అవసరమైతే ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు.