- అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా నేతలు శ్రమించాలి
- మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక ప్రత్యక్ష పద్ధతిలోనే
- మంచి గుర్తింపు, ఆమోదం ఉన్నవారికే టికెట్లు
- పార్టీకి చెడ్డపేరు తెస్తే సస్పెన్షన్ వేటు తప్పదు
- ‘గొడ్డలి పార్టీ’ విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి
- టీడీపీ ‘లీడర్షిప్ కాంక్లేవ్’ ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేయాలి. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా కూటమి నేతలు శ్రమించాలి. అందుకు ఇప్పటి నుంచే ప్రజాప్రతినిధులు, నాయకులు రంగంలోకి దిగాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలని నిర్ణయించామన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ‘లీడర్షిప్ కాంక్లేవ్’ ముగింపు సమావేశంలో సీఎం స్థానిక సమరానికి సిద్ధం కావాల్సిన తీరుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తామని అభ్యర్థుల ఎంపికను ప్రత్యేక కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, క్రమశిక్షణ తప్పినా ఉపేక్షించేది లేదని… అలాంటి వారిపై తక్షణం సస్పెన్షన్ వేటు వేస్తాం” అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్ష ‘గొడ్డలి పార్టీ’ చేస్తున్న విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరాకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధి, పబ్లిక్ సర్వీస్, సుపరిపాలన అంశాలపైనా సీఎం మాట్లాడారు. రాబోయే స్థానిక
సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సన్నాహాలు ప్రారంభించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలని నిర్ణయించామని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ‘లీడర్షిప్ కాంక్లేవ్’ ముగింపు సమావేశంలో సీఎం స్థానిక సమరానికి సిద్ధం కావాల్సిన తీరుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ప్రక్రియపై ప్రతిపక్షాలు దింపుడుకల్లం ఆశలతో కోర్టులను ఆశ్ర యిస్తున్నాయని సీఎం మండిపడ్డారు. ఎంతమంది కుట్రలు చేసినా కూటమి విజయాన్ని ఎవరూ అడ్డు కోలేరని ధీమా వ్యక్తంచేశారు. “విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల కు ఇన్చార్డుల నియామకం పూర్తయింది. నాయకు లందరూ వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా క్షేత్ర స్థాయిలో ఐక్యంగా పని చేయాలి” అని సూచించారు.
అభ్యర్థుల ఎంపికలో కఠిన నిబంధనలు
పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలగకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న బెస్ట్ అభ్యర్థులనే బరిలోకి దింపాలని సీఎం స్పష్టం చేశారు. “ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను ప్రత్యేక కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. కూటమి భాగస్వామ్య పక్షాలతో సరైన సమన్వయం సాధిస్తూ బ్యాలెన్సింగ్ పాటించాలి. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, క్రమశిక్షణ తప్పినా ఉపేక్షించేది లేదు.. అలాంటి వారిపై తక్షణం సస్పెన్షన్ వేటు వేస్తాం” అని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, పూర్తి స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల సమరంలో చారిత్రాత్మక విజయం సాధించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.















