- చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం
- ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రోత్సాహకాలు అందిస్తామని నారా బ్రాహ్మణి భరోసా
మంగళగిరి(చైతన్యరథం): స్వర్ణాభరణాల తయారీ కేంద్రంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళగిరిలోని పలు కాలనీల్లో మంగళవారం పర్యటించారు. షరీఫ్బజార్ లో బంగారు షాపులు, ఆభరణాల తయారీ యూనిట్‌ను పరిశీలించారు. వ్యాపారాలు సాగుతున్న తీరు, బంగారం తయారీ విధానం గురించి షాపుల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఓ జ్యువలరీ షాపులో స్వయంగా జుమ్కీలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా పలువురు చేనేత వ్యాపారులు, స్వర్ణకారులు మాట్లాడుతూ 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన ఐదేళ్ల్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బ్రాహ్మణి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బ్రాహ్మణి స్పందిస్తూ లోకేష్ ని గెలిపించడం ద్వారా మంగళగిరిని గోల్డ్ హబ్ గా తయారుచేసుకుందామని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.
చేనేత కేరాఫ్ మంగళగిరి
మంగళగిరిలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. పలు షాపుల్లో చేనేత వస్త్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం మంగళగిరి పట్టు చీరలను కొనుగోలు చేశారు. ఎన్నికల తర్వాత లోకేష్‌తో కలిసి మంగళగిరిలో పర్యటిస్తానని చెప్పారు.
పచ్చళ్ల తయారీ కేంద్రం పరిశీలన
మంగళగిరి పట్టణంలో విజయ పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని నారా బ్రాహ్మణి పరిశీలించారు. వర్కర్లతో కలిసి ఆవకాయ పచ్చడి కలిపారు. నిర్వాహకులు తయారు చేసిన కొత్త ఆవకాయ పచ్చడిని రుచి చూశారు. పచ్చడి తింటుంటే చిన్నప్పుడు అమ్మ పెట్టిన ఆవకాయ గుర్తొస్తోందన్నారు. చిరు వ్యాపారులు తమ కాళ్లపై తాము నిలబడి ఉపాధి పొందేలా అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం చెరకు రసం అమ్మే మహిళతో మాట్లాడారు. చెరకు రసం తాగారు. తనకు సొంతిల్లు లేదని , లోకేష్‌కి చెప్పి ఇప్పించాలని ఆ మహిళ కోరగా, తప్పకుండా సొంతింటి కల నెరవేరుస్తామని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు.