- విశాఖ కేంద్ర కారాగారం సందర్శన
- జైలులో ఎనీ టైం క్లినిక్ ప్రారంభం
విశాఖపట్టణం: గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదని, పూర్తిస్థాయి విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమాయకులైన గిరిజనులు కేసుల్లో ఇరుక్కొని జైళ్లలో మగ్గుతున్నారని.. వారితో గంజాయి అక్రమ రవాణా చేయించిన అసలైన దోషులు తప్పించుకొని తిరుగుతున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంగళవారం విశాఖపట్టణం కేంద్ర కారాగారాన్ని ఆమె సందర్శించారు. అక్కడ పరిస్థితులను గమనించారు. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న రిమాండ్ ఖైదీలతో మాట్లాడారు. ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రాణిహిత బ్లాక్ లో ఏర్పాటు చేసిన ఎనీ టైం క్లినిక్ (ఏటీసీ)ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. దీని ద్వారా ఖైదీలు ఆరోగ్య పరీక్షలకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పుతుందని, 17 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. దీనితో పాటు ఖైదీల సౌకర్యార్థం జైలులో డిఅడిక్షన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తామని చెప్పారు. మానసిక వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. జైలు సందర్శనలో భాగంగా శ్రామికవనంలో ఖైదీలు తయారు చేస్తున్న వివిధ వస్తులను పరిశీలించారు. ప్రింటింగ్ ప్రెస్, బుక్ బైండిరగ్, చేనేత మగ్గం, శానిటైజర్, డెయిరీ యూనిట్, స్టీల్ యూనిట్, పెయింటింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అక్కడ తయారవుతున్న నోటు పుస్తకాలు, బైండిరగ్ పుస్తకాలు, చేనేత వస్త్రాలు, కుర్చీలు, శానిటైజర్ కిట్లు, ఇతర వస్తువులను పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న ఖైదీలతో ఆమె మాట్లాడారు.
గంజాయి కేసుల ఖైదీలతో మంత్రి మాటామంతీ
జైలు సందర్శనలో భాగంగా రాష్ట్ర హోం మంత్రి గంజాయి కేసుల్లోని రిమాండ్ ఖైదీలతో మాట్లాడారు. ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అతిచిన్న వయసులో అక్కడికి వచ్చిన ఓ యువకుడిని చూసిన ఆమె ఒకింత ఆశ్చర్యానికి గురై విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొంతమంది ఖైదీలు వారికున్న సమస్యలపై మంత్రికి మొరపెట్టుకున్నారు. సత్ప్రవర్తన కలిగిన కేటగిరీలో అవకాశం పొందినప్పటికీ ఉపశమనం కలగలేదని పలువురు మంత్రి దృష్టికి తీసుకురాగా.. దానికి గల కారణాలను అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పందించిన ఆమె సుప్రీంకోర్టు నిబంధనల మేరకు న్యాయ నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వసతులు కల్పించి పని చేయించుకుంటాం
జైలు సందర్శనం అనంతరం బయట మీడియాతో మంత్రి వివిధ అంశాలపై మాట్లాడారు. జైలు లోపల పరిశీలించిన అంశాలను వెల్లడిరచారు. అమాయకులైన గిరిజన యువత గంజాయి కేసుల్లో ఇరుక్కుంటున్నారని, దీనికి ఉపశమనం కల్పించే మార్గంపై ఆలోచిస్తామని చెప్పారు. ఖైదీల సమస్యలను పరిష్కరించేందుకు ఎలాగైతే ముందుకు వెళతామో, జైళ్లలో పని చేసే అధికారులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు కూడా అంతే ప్రత్యేకమైన దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సివిల్ పోలీసులతో సమానంగా అన్ని రకాల వసతులు, హక్కులు కల్పించేందుకు అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు క్వార్టర్లు, వాహనాలు సమకూరుస్తామని తెలిపారు. కనీస వసతులు కూడా లేని పరిస్థితి అక్కడక్కడా కనిపిస్తోందని, పూర్తి స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, అదే రీతిలో వారితో పని చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే శ్రామిక వనంలో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులకు మంచి మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. జైలు సందర్శనలో ఆమె వెంట సూపరింటెండెంట్ కిశోర్ కుమార్, అదనపు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్లు రామచంద్రరావు, కమలాకర్ రావు, సివిల్ డీసీపీలు, ఇతర పోలీసు అధికారులు, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్.వి.ఎస్. కుమార్, సివిల్ సర్జన్లు, తదితరులు పాల్గొన్నారు.