- నవ్యాంధ్రలో రామరాజ్యాన్ని స్థాపించుకుందాం
- ప్రజాగళం వేదికనుంచి చంద్రబాబు, పవన్ ప్రకటన
- సంపద చెట్లకు కాయదు.. సృష్టించాలి
- సంక్షేమ జపం చేస్తూనే పథకాలు రద్దు చేశాడు
- జగన్‌పై ధ్వజమెత్తిన తెదేపా అధినేత చంద్రబాబు
- కూటమి వస్తుందని తెలిసే జగన్‌కు బీపీ
- పేదలను దోచేసి క్లాస్ వార్ అంటున్నాడు
- రాష్ట్రాన్ని దగా చేసిన జగన్‌ను వదలొద్దు
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు
- కూటమిని నిండు మనసుతో ఆశీర్వదించమన్న నేతలు
పెడన (చైతన్యరథం): ‘శ్రీరామనవమి శుభదినాన రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం. నవమి రోజున కూటమిని ఆశీర్వదించటానికి ప్రజాగళానికి ఇంతమంది రావడం చూస్తుంటే `మన గెలుపు ఎవ్వరూ ఆపలేరని అర్థమవుతుంది. సుపరిపాలన అంటే రామరాజ్యం గుర్తుకొస్తుంది. కూటమిని ఆశీర్వదిస్తే రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించే భాధ్యత తీసుకుంటాం. ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుడిని వధించినట్లు రాష్ట్రప్రజలు జగనాసురుడిని వధించాలి’ అని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాయంగా అధికారంలోకి వచ్చేది, అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కూటమి ప్రభుత్వమేనని రెండు పార్టీల అగ్రనేతలు సంయుక్తంగా ప్రకటించారు.
మచిలీపట్నం జిల్లా పెడనలో బుధవారం నిర్వహించిన ప్రజాగళానికి అశేషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి నేతలిద్దరూ ఉత్సాహంగా మాట్లాడారు. చంద్రబాబు తన ప్రసంగంలో ‘అన్ని వర్గాలను నట్టేట ముంచిన సైకో జగన్‌కు కొత్త పేరు పెట్టానని, అది జె`గన్ రెడ్డి’ అని ప్రకటించి ఆహూతులను ఉత్సాహపర్చారు. ఏ సర్వేలు చూసినా కూటమి గెలుపునే సూచిస్తున్నాయని, ఇక్కడినుంచి ఎంపీగా బాలసౌరి, ఎమ్మెల్యేగా కృష్ణప్రసాద్ గెలుపు తథమని బాబు ప్రకటించారు. ఐదేళ్లలో జగన్ గుద్దిన గుద్దులకు ప్రజలు నీరసించిపోయారు. కోడికత్తులు, గొడ్డలివేటులు దాటి గులకరాయి డ్రామాతో వస్తున్న జగన్‌ను ఎప్పుడెప్పుడు ఇంటికి పంపుదామా? అని ఎదురు చేస్తున్నారన్నారు. మా ఇద్దరిపై రాళ్లదాడికి పురికొల్పిన జగనే `ఇపుడు తనపై రాయి పడేసరికి ఎదురు దాడికి దిగుతున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై పడిన రాయి దొరకలేదంటే అది నాటకమేగా అని వ్యంగ్యవ్యాఖ్యలు చేశారు. ఓటును అమ్ముకోవద్దని హితవు పలుకుతూ `‘మా వద్ద నీతి, నిజాయితీ, నిస్వార్ధాలు ఉన్నాయి. మరలా మీ జీవితాల్లో వెలుగులు నింపే సామర్ధ్యం ఉంది. మావి మూడు జెండాలే. కానీ ఒకే అజెండా. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ’ అని చంద్రబాబు ప్రకటించారు. 20నుంచి 30మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైకాపాకు రాజీనామా చేసి కూటమిలో చేరుతున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు.. అందరినీ పెడన సభనుంచి ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నా అని చంద్రబాబు పిలుపునిచ్చారు. సర్వనాశనమైన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే `అందరి సహకారం కావాలని చంద్రబాబు అన్నారు.
చెట్లకు కాయదు.. సంపద సృష్టించాలి
విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన తెదేపా.. అహరహం కష్టపడి రాష్ట్రాన్ని నిలబెట్టింది. అభివృద్ధిలో ఎన్డీయే, పవన్ కల్యాణ్ మనకు అండయ్యారు. పట్టిసీమ పూర్తి చేశాం. పోలవరాన్ని ఒక రూపానికి తెచ్చాం. మళ్లీ తెదేపా అధికారంలోకి వచ్చివుంటే, మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తిచేసి అద్భుతాలే సాధించేవాళ్లం. అధికారంలోకి వచ్చిన జగన్ `పోలవరాన్ని గోదారిపాలు చేశాడు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్నే విధ్వంసం చేశాడు. సంపద చెట్లకు కాయదు, సృష్టించాలి. అందుకు కష్టపడాలి. హైదరాబాద్‌ను ఆ తీరునే అభివృద్ధి చేసిచూపించాను. సంపద సృష్టించడం తెలిసిన వాడిని. కూటమి అధికారంలోకి రాగానే అద్భుతాలు సాధించకుందాం’ అని చంద్రబాబు వివరించారు. పెడనను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని, బందరు పోర్టు, రాజధాని అమరావతి నిర్మాణం జరిగితే.. పెడన అద్బుతమైన టౌన్‌షిప్‌గా ఎదిగి పిల్లలకు ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చి ఉండేవన్నారు.
సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్
సంక్షేమ జపం చేసే జగన్, తెదేపా తీసుకొచ్చిన 100 సంక్షేమ పథకాలు ఎందుకు రద్దు చేశాడని బాబు నిలదీశారు. నకిలీ రత్నలు తెచ్చి నవరత్నాలంటూ జనం నెత్తిన పెట్టాడని, మాటా మడమా తిప్పనంటూనే ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిపేసిన మోసగాడు జగన్ అని దుయ్యబట్టారు. కృష్ణానది పక్కనేవున్నా ఇసుక దొరకని పరిస్థితి తెచ్చి 40 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిన జగన్‌ను క్షమించకూడదన్నారు. రాష్ట్రాన్ని 30యేళ్ల వెనక్కి తీసుకెళ్లిన జగన్ `పోలీసులు, ఉద్యోగ వర్గాలను దెబ్బతీశాడన్నారు. జీతాలివ్వలేని స్థితి రాష్ట్రంలో ఉందని దుయ్యబట్టారు. భూ పరిరక్షణ చట్టం పేరిట కొత్త చట్టం తెచ్చి `ప్రజల ప్రయివేట్ ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జలజీవన్ మిషన్ కింద కేంద్రం ఇచ్చిన నిధులను దిగమింగి `తాగునీటి సౌకర్యాన్నీ దెబ్బతీశాడన్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి జగన్ దెబ్బతీసిన బందరు పోర్టును బాధ్యత తీసుకుని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలకు డిక్లరేషన్ ప్రకటించామని, ముస్లింలకూ డిక్లరేషన్ ప్రకటిస్తామని హామీ ఇస్తూ.. ‘సూపర్’ పథకాల ద్వారా భవిష్యత్‌లో కూటమి ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. సైకో అండ చూసుకుని రెచ్చిపోతున్న వైసీపీ ముఠాలను అధికారంలోకి రాగానే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించి చక్కటి అభివృద్ధినిచ్చే బాధ్యత నాదని అంటూ ‘నాయకులను, కార్యకర్తలను రాబోయే 25 రోజులు కష్టపడాలని కోరుతున్నా. ప్రజలకు అండగా నిలబడి ఓట్లేయించే బాధ్యత తీసుకోండి. మిమ్మల్ని గౌరవించే బాధ్యత కూటమి తీసుకుంటుంది. పొత్తుల కారణంగా పార్టీకి త్యాగం చేసిన కొనకళ్ల నారాయణ రావు, వేదవ్యాస్‌లాంటి నేతలకూ అధికారంలోకి రాగానే తగు న్యాయం చేస్తామన్నారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల కార్యకర్తలకు న్యాయం చేస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.
కూటమి వస్తుందని తెలిసే జగన్‌కు బీపీ: పవన్
కూటమి అధికారంలోకి వస్తుందని తెలిసేసరికి జగన్‌కు బీపీ పెరిగిపోతోందని, ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేన- తెలుగుదేశం- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి రాగానే ప్రజాధనం, ప్రకృతి సంపదను లూటీ చేసిన ప్రతి ఒక్కరికీ శిక్షపడేలా చేస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. భీమవరం నుంచి పిఠాపురం వెళ్లిపోయానని జగన్ పిచ్చికూతలు కూస్తున్నాడు. 70మంది సిట్టింగులను ఎందుకు మార్చాడు? పెడన ఎమ్మెల్యేను మరో సెగ్మెంట్‌కు ఎందుకు పంపాడో జగన్ నోరు విప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఐదేళ్లలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశావ్. ఆడబిడ్డలకు రక్షణ లేదు. రైతులు కన్నీరు కారుస్తున్నారు. నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంతమందిని ఏడిపించిన దుష్టప్రభుత్వాన్ని ప్రజలంతా ఐక్యంగా ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
పేదలను దోచేసి.. క్లాస్‌వార్ అంటున్నాడు
వైసీపీ అధికారంలోకి రాగానే మొదట పొట్టకొట్టింది పేదవాడినే. రూ.337 కోట్ల జాతీయ ఉపాధి హామీ నిధులు దారిమళ్లించారు. రాష్ట్ర అవకతవకలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి సాధ్వీ నిరంజన్ పార్లమెంట్ సాక్షిగా వెల్లడిరచారు. పోలీసుల శ్రమ దోపిడీ చేసిన వ్యక్తి జగన్. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ.450 కోట్లు దారి మళ్లించాడు. 900 చేనేత సంఘాలకు ఆప్కో నిధుల రాకుండా చేశాడు. మత్స్యకారుల పొట్టకొట్టాలని జీవో నెంబర్ 217 తీసుకొచ్చాడు. ఇతనా క్లాస్‌వార్ గురించి మాట్లాడేది అని పవన్ నిలదీశారు. విద్యుత్ కొనుగోళ్లలో రూ.27,500 కోట్లు దోచుకున్నాడంటూ, ఏ వ్యవస్థనూ వదలకుండా దోపిడీతో అన్ని వ్యవస్థలనూ భ్రష్టుపట్టించిన జగన్‌ను ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
అతని నోరే పెద్ద డ్రైనేజ్
గత ఏడాది మచిలీపట్నంలో జనవాణి నిర్వహిస్తే… ఎమ్మెల్యే అవినీతి, దురాగతాలు, దోపిడీపై లెక్కలేనన్ని ఫిర్యాదులు వచ్చాయని వివరిస్తూ.. ఐదేళ్ల కాలంలో పెడనలో డ్రైనేజ్ పనులు చేయలేకపోయాడు, అతని నోరే పెద్ద అవినీతి డ్రైనేజీగా మార్చేశాడని దుయ్యబట్టారు. పెడన నియోజకవర్గంలో దాదాపు 18 వేలమంది కలంకారీ, చేనేత వృత్తి కార్మికులు ఉన్నారు. ఇటీవల అప్పుల బాధతో పద్మనాభం, నాగలీలావతి దంపతులు బిడ్డతో సహా అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏ ఒక్క చేనేత కార్మికుడు చనిపోకూడదన్నదే మా కూటమి లక్ష్యం. వారికి అండగా నిలబడే బాధ్యత తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు.
నీలి విప్లవం తీసుకొస్తాం
రాష్ట్రంలో దాదాపు 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతముంది. ప్రతి 35 కిలోమీటర్లకు జెట్టీ నిర్మిస్తాం. అధికారంలోకి రాగానే 13 జెట్టీల పనులు ప్రారంభిస్తాం. మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోకుండా ఇక్కడే ఉపాధి లభించేలా చూస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉండేలా నీలి విప్లవానికి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మేము రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకుంటాం. కూటమి అభ్యర్థులను గెలిపించండి. జగన్ భయపడేంత బలమైన మెజారిటీతో గెలిపించండి. కుల వివక్ష తీసుకొచ్చి మాలో మేము కొట్టుకోవాలని జగన్ కోరుకుంటున్నాడు. అందుకే చంద్రబాబుని, నన్ను మా సామాజికవర్గం వ్యక్తులతో తిట్టిస్తాడు. ఆయన ఎన్ని కుయుక్తులు పన్నినా ఆశ నెరవేరదు. మీరు తిట్టే కొద్దీ మేము బలపడతాం తప్ప బలహీన పడమని జగన్‌ను పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
నిండు మనసుతో ఆశీర్వదించండి
‘రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఉద్యోగులు, రైతులు, ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకూడదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడేలా చూస్తాం. రైతులు సంతోషంగా ఉండాలనే కూటమిలోని మూడు పార్టీలు త్యాగాలుచేసి ప్రజల ముందుకు వచ్చాం. నిండుమనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం’ అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.