అమరావతి: సుబాబుల్ పంట కొనుగోళ్లలో రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూస్తూ పక్షపాతం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వానికి విజ్జప్తిచేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు ఆయన ఒక లేఖ రాస్తూ వివక్ష లేకుండా రైతులు పండించిన పంటనంతా కొనుగోలు చేయాలని కోరారు. లోకేష్ ముఖ్యమంత్రికి రాసిన లేఖ సారాంశం ఇలా ఉంది. రాష్ట్రంలో రైతులు తాము పండిం చిన పంట ఉత్పత్తులను మద్దతు ధరకు విక్రయించుకునేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. ఆరుగాలం శ్రమంచి పండించిన పంటను సొమ్ము చేసుకోవాలంటే అధికార పార్టీకి చెందిన వారికే విక్రయించాలనే నూతన సంస్కృతి రాష్ట్రంలో రావడం దురదృష్టకరం. అసలే మద్దతు ధర లేక రైతులు నష్టపోతుండగా, వచ్చిన పంటను విక్రయించాలంటే.. అధికార పార్టీ నేతలకో, లేక వారి సూచించిన దళారులకే అమ్మాలని హుకుం జారీ చేయడం అన్నదాతల దయనీయ పరి స్థితికి అద్దం పడుతోంది. ఒకవేళ అధికారపార్టీ సిఫార్సులతో దళారులకు విక్రయించినా ధరలో కోత పెడుతున్నారు. తమ ఆదేశాలు ధిక్కరించి ఇతరులు ఆ పంటను తరలించే లారీలపై అక్రమ కేసులు బనాయిస్తు న్నారు. అధికారమున్న దళారులకే పంట కొనే హక్కు ఉందంటూ పోలీసులు సైతం వారికి వంత పాడటం దుర్మార్గం.
మూడున్నరేళ్లుగా నష్టాల్లో రైతులు
మూడున్నరేళ్లుగా గిట్టుబాటుధర లేక సుబాబుల్ రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. పేపర్ తయారీ పరిశ్రమలు నామమాత్రంగానే సుబాబుల్ కర్ర కొన్నాయి. దీంతో పంట విక్రయించుకునేందుకు నిరీక్షిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పరిశ్రమలు సుబాబుల్ కర్ర కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే రైతులు తాము పండించిన పంటను మద్దతు ధరకు, తమకు నచ్చిన వారికి విక్రయించుకోవాలనే వారి ఆశలు అడియాశలు అవుతున్నాయి.
అధికార పార్టీ నేతలకు, లేదా వారి సూచించిన దళారులకే పంట అమ్మాలనే బెదిరింపులతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటువేయని వారి పంటను కొనబోమని చెప్పడం ఎంతవరకు సమంజసం? తమ పంటను విక్రయించేందుకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో రైతులు పడి గాపులు కాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోం ది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించుకునే హక్కు ఉంది. సుబాబుల్ పంట కొనుగోలు విషయం లో రాజకీయ జోక్యాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వివక్ష లేకండా రైతులందరి పంటను కొనుగోలు చేయాలి. పోలీసుల బెదిరింపులను నియంత్రించాలి. కష్టాల్లో ఉన్న రైతుల కు అండగా నిలవాలని లోకేష్ సిఎంకు రాసిన లేఖలో విజ్జప్తిచేశారు.