- చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు
- మా కుటుంబంపై బురద జల్లేందుకు వ్యక్తిగత సమాచారం సేకరించిన సీఐడీ
- చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పత్రాలు దగ్ధం
- సిట్ కార్యాలయంలో పత్రాలు కాల్చివేతపై లోకేష్ ఆగ్రహం
అమరావతి (చైతన్యరథం): పత్రాలు తగులబెట్టినంత మాత్రాన సీఐడీ అధికారులు చేసిన పాపాలు మాసిపోతాయా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్లో సోమవారం ఉదయం పలు పత్రాలను సీఐడీ సిబ్బంది దగ్ధం చేసిన ఘటనపై లోకేష్ స్పందించారు. నేర పరిశోధనపై దృష్టిసారించాల్సిన ఏపీసీఐడీ జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్ గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ అధికారులు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా రూపాంతరం చెందారు. మా కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగులబెడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్ లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశచరిత్రలో ఇదే ప్రథమం. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ హెచ్చరించారు.