ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఎమ్మెల్యే బాలయ్య ఆగ్రహం
మా కార్యకర్తలు నిరసన తెలిపితే అరెస్టు చేయిస్తారా?
సరైన సమయంలో బుద్దిచెప్పడానికి జనం సిద్ధం
ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్న బాలకృష్ణ
హిందూపురం: ఇటీవల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించి సిగ్గులేకుండా జాతీయ జెండా ఆవిష్కరణకు వెళ్లారని హిందూపురం టిడిపి శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన లేపాక్షిలో నిర్వహించిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ప్రదర్శన చేసే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎంపి మాధవ్ జెండా ఆవిష్కరణకు అర్హుడు కాదంటూ గో బ్యాక్ గో అని హిందూపురం పట్టణంలో టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులతో లాఠీఛార్జ్ జరిపించి అక్రమ కేసులు పెట్టారని..ఇటువంటి చర్యలకు భయపడబోమని ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరించారు. ప్రజలు సరైన సమయంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని అన్నారు. కాన్వాయ్లు వేసుకుని మంత్రులు షోలు చేస్తున్నారు.. రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు..ప్రజలు నరకం చూస్తున్నారని అన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు..ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఏపీలో పథకాలకు కోతపెడుతున్నారు.. ప్రభుత్వ పథకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని బాలకృష్ణ దుయ్యబట్టారు.
వైసిపి ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరల విపరీతంగా పెరిగి సామాన్యుల బ్రతుకు తెరువు ఘనంగా మారిందని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉండేవని, ప్రస్తుతం వాటికి చరమగీతం పాడటంతో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కూలీలు, రైతులు, నిరుద్యోగులు ఆఖరికి ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల కష్టాలు ఎలా ఉన్నా వైసిపి నాయకులు మాత్రం జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. 2019లో ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుక్కుని గద్దెనెక్కిన సీఎం జగన్ మోహన్ రెడ్డి చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ఛార్జీల పెంపు తదితరాలతో ప్రజలను నిలువుదోపిడీ చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, దోపిడీలు, మహిళలపై దాడులు, మానభంగాలు, హత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన బాలకృష్ణ
హిందూపురంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు ప్రారంభించారు. ఈ ఆరోగ్య రథాన్ని నియోజకవర్గంలోని పల్లెల్లో తిప్పుతూ రక్త పరీక్షలు మొదలుకుని అన్నిరకాల వైద్య చికిత్సలు అందించనున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి అందించిన వెంటిలేటర్లను మూలన పడేయడం దారుణమని బాలకృష్ణ మండిపడ్డారు. ఆహారం, ఆరోగ్యం బాగుంటే మనిషి జీవనశైలి బాగుంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం చలివెందుల గ్రామంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు ప్రారంభించారు. బాలకృష్ణ 40 లక్షల రూపాయల సొంత నిధులతో ఆరోగ్య రథం అందుబాటులోకి తెచ్చారు. అన్న క్యాంటీన్ ద్వారా రూ.2కే నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ.. ఇప్పుడు గ్రామాల వద్దకే మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించడం కోసమే ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించినట్లు బాలకృష్ణ తెలిపారు. ఇది కేవలం ఆరంభమేనని, ఇలాంటి ఉచిత ఆరోగ్య రథాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆరోగ్య రథం ఎంతగానో ఉపయోగపడుతుందని బాలకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించేలా చంద్రబాబు చర్యలు చేపడతారని తెలిపారు. హిందూపురం ఆసుపత్రిలో కరోనా విపత్కర కాలంలో 30 వెంటిలేటర్లను అందిస్తే వాటిని వినియోగించకుండా మూలన పడేసారని, అంతకంటే సిగ్గుచేటు లేదని బాలకృష్ణ మండిపడ్డారు.