.పేపర్లో ప్రకటనల కోసం చేయూత పథకాన్ని నాలుగైదుగా విడగొట్టారు
.కాపులను అనేక విధాలా మోసం చేశారు
.45 ఏళ్లు దాటిన మహిళలకు పెన్షన్ రూ.3 వేల హామీ ఏమైంది?
.ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు
అమరావతి: చేయూత పథకానికి సీఎం జగన్ రెడ్డి నాలుగైదు విడతలుగా బటన్ నొక్కి, నొక్కిన ప్రతిసారీ సాక్షి పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారని ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి ఈ రోజు కాపునేస్తం పథకానికి బటన్ నొక్కారు. 3 లక్షల 30 వేల మంది కాపు, బలిజ, ఒంటరి తెలగల కులాలకు చెందిన మహిళలకు రూ.15 వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం రూ.508 కోట్లు ఆ మహిళలకు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లాలో ప్రకటించారు. కాపులకు ఒకసారి, మైనార్టీలకు ఒకసారి, ఎస్సీ మహిళలకు ఒకసారి… ఇలా చేయూత పథకాన్ని నాలుగైదు దఫాలుగా విడగొట్టి ప్రతిసారి బటన్ నొక్కడం ఓ పెద్ద పండుగ. పెద్ద అడ్వర్టైజ్‌మెంట్. డబ్బు ఊరికే తీసుకుంటున్నట్లు భ్రమ కలిగించడమే జగన్ లక్ష్యం. ఎన్నికల ప్రచారంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పెన్షన్ రూ.3 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. అది ఏమైంది? తరువాత మాట మార్చి నేడు సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున 5 సంవత్సరాలకి రూ.75 వేలిస్తానని, అది కూడా 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు మైనార్టీ, ఎస్సీ, బీసీ, కాపు మహిళలకు విడివిడిగా ఇస్తున్నాడు. నెలకు మూడు వేలు పెన్షన్ ఇస్తానని, సంవత్సరానికి రూ.15 వేలు మాత్రమే ఇవ్వడం మోసం. రూ.3వేల చొప్పున పెన్షన్ ఇస్తే ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ.1.80 లక్షల లబ్ది చేకూరేది. రూ.1.05 లక్షలు ఎగ్గొట్టి మోసం చేశారు. కాపులను అనేక రకాలుగా మోసం చేశాడు. చేస్తున్నాడు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ఒక్క కాపు కార్పొరేషన్ ద్వారానే కాపుల అభివృద్ధికి రుణాలు, భవన నిర్మాణాలు, విదేశీ విద్యకు రూ.3,100 కోట్లు ఇచ్చారు. మిగతా పథకాలు అందులో కలపలేదు. వైఎస్ ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ ఆర్ నేస్తం, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ ఆర్ వాహనమిత్ర, వైఎస్‌ఆర్ జగనన్న చేదోడు, వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం, వైఎస్‌ఆర్ ఆసరా, అమ్మఒడి అన్ని కలిపి 2022-23 ఆర్థిక సంవత్సరానికి కాపు సంక్షేమానికి రూ.3,531 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ అంచనాల్లో ఇచ్చారు. ఇంతకంటే మోసం మరొకటి లేదు. నవరత్నాలు రాష్ట్రంలో అందరికీ ఇస్తున్నారు. కాపు కులానికి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడంలేదు. కాపులకు సంబంధించిన అనేక పథకాలు తీసివేశారు.
మా ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ ద్వారా 1,42,905 మంది కాపు యువతకు ఉపాధి రుణాలు అందించాం. 4,528 మంది కాపు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం కల్పించాం. 1,17,753 మంది కాపు విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించాం. ఎన్టీఆర్ ఉన్నత విద్యాపథకం కింద 1,413 మంది కాపు విద్యార్థులకు రూ.28.26 కోట్లు ఖర్చు చేశాం. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా 47వేల మందికి శిక్షణ ఇప్పించాం. వారిలో పది వేల మంది ఉపాధి పొందారు. జిల్లాల్లో కాపు భవనాల నిర్మాణానికి రూ.145 కోట్లు వ్యయం చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం శాసనసభలో కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. జగన్ రెడ్డి కాపు రిజర్వేషన్ ఎత్తేసి కాపుల అభివృద్ధిని కాలరాశారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళ సామాజిక స్థితిగతులు పెరగాలి. కార్పొరేషన్ లను నువ్వు జీరో చేసావ్. మేము ఇచ్చిన రుణాలతో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రెండో దఫా రుణం మీరు ఇవ్వలేదు. వారు చాలా ఇబ్బంది పడ్డారు. గోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉన్నారు. ఆ జిల్లాల్లో ఈ నాటకాలు ఆడితే నమ్మే పరిస్థితి లేదు. మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశాడని గోదావరి జిల్లాల ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. కాపునేస్తం పథకం ద్వారా లబ్ధి పొందారంటున్న 3,38,792 మంది లబ్ధిదారుల జాబితాను ఎందుకు బయట పెట్టడం లేదు? చాలా మందికి డబ్బులు జమ కావడం లేదు. ప్రజలకు అర్థం కాని పథకాలు పెడుతూ పబ్లిసిటీ కోసం మీ పత్రికకు నిధులు దోచిపెడుతున్నారు. వాలంటీర్లు సాక్షి పత్రిక మాత్రమే కొనేందుకు జీవో ఇచ్చారు. తద్వారా ఏడాదికి రూ.100 కోట్లు సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారు. ఈ విధంగా ప్రజలను దోపిడీ చేయడం చరిత్రలో లేదు.
మీరు ఇలా చేస్తున్నందువల్లే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు తెల్లవారుజామున మూడు గంటలకు సైతం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు ఇలానే వ్యవహరిస్తే మీరు నొక్కె బటన్ ఫెయిల్ అవుతుంది. ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వానికి తగిన శాస్తి జగుతుందని ఆశిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఇప్పటివరకు బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. జాబితా బయటపెట్టకపోతే ప్రజలను మోసగిస్తున్నట్లే లెక్కని అశోక్ బాబు విమర్శించారు.