- మరింత పటిష్టంగా హాజరు నమోదు యాప్లు
- పర్యవేక్షణ లోపాలను సవరించాలి
- ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ బాధ్యత హెచ్వోడీలకు
- పనివేళల్లో క్రమశిక్షణా రాహిత్యంపై ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి సత్యకుమార్
అమరావతి (చైతన్యరథం): ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది నిర్ణీత పనివేళలు పాటించకపోవడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై గురువారం మూడు గంటలకు పైగా మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో లోతుగా సమీక్షించారు. పనివేళల పట్ల నెలకొన్న క్రమశిక్షణా రాహిత్యం, దానిని అరికట్టేందుకు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో తీసుకుంటున్న చర్యలు, పరిస్థితిని మెరుగుపర్చేందుకు మున్ముందు చేపట్టాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వివిధ శాఖాధిపతులు సమీక్షలో పాల్గొన్నారు. ఎక్కువ మంది క్రమశిక్షణ పాటిస్తున్నా కొంత మంది సిబ్బంది పనివేళలను ఉల్లంఘిస్తుండడంతో ప్రజారోగ్య వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని మంత్రి అన్నారు.
శాఖాధిపతులకు హాజరు పర్యవేక్షణ బాధ్యత
వైద్యులు, ఇతర సిబ్బంది ఆలస్యంగా విధులకు రావడం, నిర్ణీత సమయానికంటే ముందే వెళ్లిపోవడంపై ప్రసార మాధ్యమాల్లో తరచుగా వస్తున్న వార్తలు తనను ఆవేదనకు గురిచేస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. వివిధ సమస్యలతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో లేకపోతే వారెంతో ఇబ్బంది పడతారన్నారు. వైద్యులందరూ పనివేళలను పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అత్యున్నత ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల వరకు వైద్యులు, సహాయక సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ జరుగుతున్న తీరును చర్చించి ప్రస్తుత వ్యవస్థలో లోపాల్ని మంత్రి గమనించారు. హాజరును రోజువారీగా పరిశీలించి నిర్ణీత వేళల మేరకు విధులకు హాజరు కాని సిబ్బందిపై పటిష్టమైన పర్యవేక్షణ లేకపోతే ప్రభుత్వాసుపత్రులకు వచ్చే లక్షలాది ప్రజలకు తీవ్ర అన్యాయం చేసినవారమవుతామని మంత్రి అన్నారు. క్రమశిక్షణ తప్పితే తగు కఠిన చర్యలు తీసుకుంటారన్న ఆలోచన, భయం సిబ్బందిలో లేకపోతే పరిస్థితిలో మార్పు రాదని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో హాజరు విషయంలో నిత్య పర్యవేక్షణ బాధ్యతను మంత్రిత్య శాఖలోని వివిధ శాఖాధిపతులకు అప్పగించి, వీలైనంత త్వరలో మార్పు తెచ్చేందుకు తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.
ఎఫ్ఆర్ఎస్ యాప్ను పరిశీలించిన మంత్రి
ఎఫ్ఆర్ఎస్ (ముఖ గుర్తింపు) విధానంలో వైద్య సిబ్బంది తమ హాజరును నమోదు చేయడానికి రూపొందించిన యాప్ను మంత్రి నిశితంగా పరిశీలించారు. ఈ యాప్ ప్రయోజనాన్ని, దానిని వినియోగిస్తున్న తీరుపై మంత్రి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ యాప్ ద్వారా సెప్టెంబరు నెలలో నమోదైన హాజరును మంత్రి పరిశీలించారు. ఉన్నతాధికారుల స్థాయిలో సమర్థవంతమైన పర్యవేక్షణకు అవసరమైన కొన్ని మార్పుల్ని మంత్రి సూచించారు. మూడు రోజుల పాటు నిర్ణీత వేళల మేరకు విధులు నిర్వహించకపోయినా, అనుమతి లేకుండా గైర్హాజరైనా ఒక రోజు జీతం కోత విధిస్తున్నామని మంత్రికి అధికారులు వివరించారు. ఈ యాప్ను మరింత మెరుగుపర్చి పనివేళల్ని ఉల్లంఘించే సిబ్బందికి ఆ మేరకు సమాచారం అందించటంతో పాటు ఆటోమేటిక్గా షోకాజ్ నోటీసు జారీ చేసే విధంగా యాప్లో మార్పులు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.