- క్రీడా శాఖలో పదవీ విరమణ వయస్సు 62కి పొడిగింపుపై సీఎం సానుకూల స్పందన
- స్టేడియాలపై సౌర పలకలతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు
- ఉపాధి కల్పనకు క్రీడా విధానం అనుసంధానం దిశగా అడుగులు
అమరావతి(చైతన్యరథం): క్రీడా సౌకర్యాల పరంగా రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్త్తోందని రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, వాకర్స్ అసోసియేషన్లను ప్రారంభించి, గ్రామస్థాయిలో ఆట మైదానాలను, నియోజకవర్గస్థాయిలో క్రీడా వికాస కేంద్రాలను, జిల్లా స్థాయిలో జిల్లా క్రీడాభివృద్ధి సంస్థలను, రాష్ట్రస్థాయిలో హై పెర్ఫార్మెన్స్ సెంటర్లు, అకాడమీలు అందుబాటులోకి తెచ్చి, అదే విధంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే పథకాలను అమలు చేస్తామన్నారు. సచివాలయంలో గురువారం యువజన, క్రీడా శాఖలపై సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మంత్రి మండిపల్లి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం క్రీడలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో నూతన క్రీడా విధానాలతో యువతల్లో క్రీడా ప్రతిభను వెలికి తీసి మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. క్రీడా శాఖలో పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుండి 62 వరకు పొడిగింపు అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు.
2027 నాటికి జాతీయ క్రీడలు, ఖేలో ఇండియా గేమ్స్, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ప్రణాళిక వేస్తూ కార్యాచరణ చేపడుతున్నామని, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ` 3 ప్రాంతాల్లో సమీకృత క్రీడా సముదాయాలు పూర్తిస్థాయిలో క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయని, క్రీడాకారులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి ప్రఖ్యాత క్రీడాకారులతో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు వ్యవస్థలను భాగస్వామ్యం చేస్తూ క్షేత్ర స్థాయిలో క్రీడలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామన్నారు. క్రీడా విధానాన్ని యువత ఉపాధికి అనుసందానం చేసి వారి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఆటలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించే దిశగా స్పోర్ట్స్ పాలసీని రూపొందిస్తున్నామన్నారు. అన్ని స్డేడియాల్లో సోలార్ పలకలు (పైకప్పులు) ఏర్పాటు చేసి పునరుత్పాదక విద్యుత్ శక్తిని వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
క్రీడా యాప్ ద్వారా సర్టిఫికేట్ల జారీ, ధృవీకరణ – ప్లేయర్లు, కోచ్‌లు, అసోసియేషన్లు, తదితర వివరాలతో డేటాబేస్ నిర్వహిస్తున్నామని వెల్లడిరచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మరిన్ని పతకాలు సాధించడం కోసం సంఘాలు/ సమాఖ్యలను ప్రోత్సహించేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలో క్రీడాకారులకు పెండిరగ్లో ఉన్న ప్రోత్సాహకాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న క్రీడా వికాస కేంద్రాలను గడువులోగా పూర్తి చేసేవిధంగా అదేశించామని, కేంద్ర ప్రభుత్వ సహాయంతో యువజన, క్రీడల శాఖ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి మండిపల్లి తెలిపారు.