అమరావతి (చైతన్యరథం): కుప్పం, పులివెందుల, పిఠాపురం శాసనసభ స్థానాలతోపాటు మరో 12చోట్ల స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలుగుదేశం పార్టీ సూచించింది. మొత్తం 15 శాసనసభ స్థానాలను సమస్యాత్మకంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెదేపా మంగళవారం లేఖ రాసింది. ఇప్పటికే రాష్ట్రంలో 14 శాసనసభ స్థానాలను సమస్యాత్మకంగా గుర్తించి ఆయాచోట్ల కేంద్ర బలగాల మొహరింపు, బూత్‌స్థాయిలో వెబ్ కాస్టింగ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య రాసిన లేఖలో అదనంగా మరో 15 చోట్ల అటువంటి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. కుప్పం, పులివెందుల, పిఠాపురం, ధర్మవరం, రాప్తాడు, తాడిపత్రి, రంపచోడవరం, గుడివాడ, కాకినాడ సీపీ, మంత్రాలయం, గన్నవరం, నరసరావుపేట, విజయవాడ ఈస్ట్, పత్తికొండ మరియు డోన్ నియోజకవర్గాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
సమస్యాత్మక స్థానాల గుర్తింపునకు ప్రమాణాలు…
ఇటీవల కాలంలో ఆయా నియోజకవర్గాల్లో శాంతిభద్రతలకు సంబంధించి జరిగిన సంఘటనలు, ఇతర సమాచారం ఆధారంగా ఎన్నికల సంఘం ఆయా నియోజకవర్గాలను సమస్యాత్మక స్థానాలుగా గుర్తించి, అక్కడ స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తుంది. అట్టి నియోజకవర్గాల్లో బూత్‌స్థాయిలో కేంద్ర బలగాల అదనపు మొహరింపుతోపాటు వెబ్ కాస్టింగ్ చేయాల్సివుంటుంది. తెదేపా నాయకుడు వర్ల రామయ్య తమ లేఖలో తాము సూచించిన 15 నియోజకవర్గాలను ఏ కారణంగా సమస్యాత్మకంగా గుర్తించాలో లేఖలో వివరించారు.