- పోస్టల్ బ్యాలెట్లను చెల్లకుండా చేసే పన్నాగం భగ్నం
- ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై రగడకు ప్లాన్
- లెక్కింపు నియమాల అమలులో రాజీ పడొద్దన్న చంద్రబాబు
- ఓటమికి సిద్ధమవుతూ వైసీపీ హింస గురించి మాట్లాడుతుందని వ్యాఖ్య
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు తేదీ (జూన్ 4) సమీపిస్తున్న కొద్దీ మరింత కలవరానికి గురవుతున్న అధికార వైసీపీ.. ఘర్షణలు, హింసాత్మక ఘటనలకు కుట్ర పన్నుతున్నట్టు పక్కా సమాచారం. 13న జరిగిన పోలింగ్‌కు ముందే ఓటమి తథ్యమని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మూకలు, పోలింగ్ రోజున పల్నాడు, రాయలసీమలోని పలు నియోజకవర్గాలతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ హింసకు పాల్పడ్డాయి. పోలింగ్ సరళి ప్రకారం అధికార పార్టీకి భారీ ఓటమి తప్పదని మరింత స్పష్టంగా వెల్లడవటంతో.. ఇదే హింసాత్మక వైఖరిని ఓట్ల లెక్కింపు రోజూ అవలంబించాలని అధికార పార్టీ పన్నాగం చేస్తోంది.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రగడకు ప్లాన్
ఈ ఎన్నికల్లో గతంలోకంటే భారీస్థాయిలో 5.4 లక్షల పోస్టల్‌బ్యాలెట్లు నమోదు కావటం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి శిబిరాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వీలైనంతమేరకు పోస్టల్ బ్యాలెట్‌లను నిరర్థకం చేయటానికి కుట్ర పన్నింది. ఎన్నికల విధుల్లో ఉన్న తమ కనుసన్నల్లో నడిచే కొందరు అధికారుల ద్వారా కుట్ర అమలుకు ప్లాన్ వేసింది. ఈమేరకు.. పోస్టల్ బ్యాలెట్‌లు స్వీకరించే విధుల్లో ఉన్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు, గెజిటెడ్ హోదా కలిగిన ఇతర అధికారులు జగన్‌రెడ్డి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పనిచేసినట్లు సమాచారం.
ఎన్నికల నియమాల ప్రకారం ఎన్నికల విధుల్లో ఉండి పోస్టల్ బ్యాలెట్‌లు వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చిన డిక్లరేషన్‌పై ఒక గెజిటెడ్‌స్థాయి అధికారి సంతకం చేయాల్సివుంటుంది. పోస్టల్ బ్యాలెట్ వెనుక వైపు రిటర్నింగ్ అధికారి సంతకం చేయాలి. తమ సంతకాలతోపాటు తమ పేరు, పదవీ వివరాలు తెలిపే సీలు వేయాల్సి ఉంటుంది. కానీ.. జగన్ ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తమ సంతకాలతోపాటు అధికారిక ముద్ర వేయకుండా పోస్టల్ బ్యాలెట్లను చెల్లనివిగా (ఇన్ వాలిడ్) చేసే ప్రయత్నం జరిగింది.
తెదేపా అభ్యంతరం – ఎన్నికల సంఘం వివరణ
పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి వైసీపీ కుట్ర వివరాలను తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) దృష్టికి తీసుకెళ్లింది. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే ప్రక్రియలో భాగంగా.. ఉద్యోగులు తమ బాధ్యత అయిన డిక్లరేషన్ ఇవ్వటం, ఓటు వేయటం చేశారని.. తదనంతరం నియమాల మేరకు సంతకాలు చేసి, అధికారిక సీళ్లు వేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం నియమించిన అధికారులదని, వారి ఉద్దేశ పూర్వక వైఫల్యాల ప్రాతిపదికన పోస్టల్ బ్యాలెట్లను చెల్లనివిగా ప్రకటించటం తప్పని తెదేపా గట్టిగా వాదించింది. ఈ విషయంపై తెదేపా నాయకులు పలుసార్లు సీఈఓను కలిశారు. గెజిటెడ్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారుల సీళ్లు లేనప్పటికి అటువంటి పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించాలని తెదేపా గట్టిగా డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన అనంతరం అంగీకరించి, ఆమేరకు సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జగన్ బృందం భారీ కుట్రకు తెరపడిరది.
వైసీపీ నోట.. ఘర్షణల మాట
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో తమ కుట్ర భగ్నమైన వెంటనే.. గత మూడు రోజులుగా వైసీపీ నేతలు తమ ఆంతర్యాన్ని వెల్లడిరచుకుంటున్నారు. తెదేపా సూచన మేరకు ఈ విషయంలో తగు వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘంపై అదే పనిగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చిన సవరణలు తీవ్ర ప్రమాదం తో కూడినవని హెచ్చరిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే అమలయ్యేలా ఇచ్చిన సవరణలపై పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు సమయంలో ఎన్నికల ఏజెంట్లు/ కౌంటింగ్ ఏజెంట్లు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉందని, ఇవి ఘర్షణలకు దారి తీయవచ్చని పలువురు వైసీపీ అగ్రనేతలు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు హింసకు దారితీయొచ్చని వైసీపీ నేతలు స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. తద్వారా.. పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలు తిరిగి ఓట్ల లెక్కింపు రోజున చెలరేగే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.
భయమెందుకు?
ఎన్నికల్లో ప్రతి పౌరుడు తమ పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవటానికి సహకరించటం ఎన్నికల యంత్రాంగం, రాజకీయ పార్టీల ప్రధాన బాధ్యత. ఇందుకు విరుద్ధంగా.. అధికార వైసీపీ ఎన్నికల విధుల్లోని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లను చెల్లనివిగా చేయటానికి ఎందుకు కుట్ర పన్నింది? గత ఐదేళ్లుగా అనాలోచిత నిర్ణయాలతో లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్‌రెడ్డి ప్రభుత్వం వారి ఓటింగ్ హక్కును హరించటానికి దిగజారటం దారుణమని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వెల్లడౌతోంది. నిబంధనల పరిమితులకు లోబడి ఉద్యోగుల ఓటింగ్ హక్కును కాపాడటానికి ప్రయత్నించాల్సిన అధికార వైసీపీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించటం ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఓటమికి స్పష్టమైన సంకేతమని పరిశీలకుల నిశ్చితాభిప్రాయం.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై రాజీ పడొద్దు: చంద్రబాబు
విదేశీ యాత్ర నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు వెంటనే పార్టీ నేతలతో ఎన్నికల లెక్కింపుకు సంబంధించిన విషయాలపై సమీక్షించారు. ముఖ్యంగా.. ఈ ఎన్నికల్లో భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ల ప్రాధాన్యత దృష్ట్యా ఈ విషయంపై చర్చించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు టేబుళ్ల ఏర్పాటుపై ఆరా తీశారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు ఒక టేబుల్‌ను ఏర్పాటు చేయాల్సివుండగా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఆమేరకు చేయటంలేదని పార్టీ నాయకులు చంద్రబాబుకు తెలిపారు. బుధవారం మధ్యాహ్నానికి మొత్తం 1,081 టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 633 మాత్రమే ఏర్పాటు చేశారని తెలుసుకున్న చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దృష్టిసారించి అవసరాల మేరకు టేబుళ్లను ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ అంశంపై గురువారం మరోసారి సమీక్షిస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం నడుచుకునేలా చూడాలని.. అలాకాకుండా వారి దయాదాక్షిణ్యాల కోసం ప్రాకులాడుతున్నట్లు పార్టీ యంత్రాంగం వ్యవహరింకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఓటమికి సిద్ధమౌతున్న వైసీపీ
పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణలపై అధికార వైసీపీ నేతల వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వివరణలు కౌంటింగ్ రోజున ఘర్షణలు, హింసకు దారితీయొచ్చన్న వైసీపీ నేతల వ్యాఖ్యల ద్వారా అధికార పార్టీ ఈ ఎన్నికల్లో అనివార్యమైన ఓటమికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోందని తెదేపా అధినేత వివరించారు. ఈ ఎన్నికల్లో జగన్‌రెడ్డి పార్టీ పలు దారుణాలకు పాల్పడిరదని, వారి పాపం పండే రోజు దగ్గరకొచ్చిందని చంద్రబాబు అన్నారు. ఓట్ల లెక్కింపు రోజున వైసీపీ నేతలు గొడవలు సృష్టించే అవకాశముందని ఆయన అన్నారు. వైసీపీ నేతల హింసాత్మక భాష, ఓట్ల లెక్కింపును అడ్డుకునే కుట్ర, పోలింగ్ రోజు నుండి జరిగిన హింసాత్మక సంఘటనల వివరాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.