- వాళ్ల అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారాయి
- పాఠశాల విద్య, ఇంటర్‌లో 12 లక్షలమంది విద్యార్థులు తగ్గారు
- విద్యా ప్రమాణాల పెంపునకూ సంస్కరణలు చేపడుతున్నాం..
- ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం నివారిస్తాం
- మోడల్ ప్రైమరీ స్కూల్స్ ద్వారా తరగతికో టీచర్‌ని కేటాయిస్తాం
- మండలిలో సభ్యుల ప్రశ్నలకు విద్యా మంత్రి లోకేష్ సమాధానం
అమరావతి (చైతన్య రథం): వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అసర్ నివేదిక, 2018లో పాఠశాలల్లో సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండి, 2022-24 మధ్యకాలంలో పతనం కావడంపై శాసనమండలిలో సభ్యులు దువ్వారపు రామారావు, పి.అశోక్ బాబు, బి.తిరుమలనాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014-24 మధ్య పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను బేరీజు వేస్తే .. వైసీపీ పాలనలో ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి తెలుగు పుస్తకం చదివేందుకు ఇబ్బందిపడ్డారు. 2014లో 57శాతం మంది విద్యార్థులు చదవగలిగితే, జగన్ రెడ్డి పాలనలో 37.5 శాతానికి పడిపోయిందని అసర్ నివేదిక స్పష్టం చేసింది.
8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి తెలుగు పుస్తకాన్ని 2014లో సుమారు 80శాతం మంది చదవగలిగితే.. 2024కు వచ్చేనాటికి 53శాతానికి పడిపోయింది. మూడో తరగతి విద్యార్థుల్లో 85శాతం మంది విద్యార్థులు కనీసం రెండో తరగతి టెక్ట్స్ బుక్ చదవలేకపోతున్నారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 63 శాతం విద్యార్థులు బేసిక్ గ్రేడిరగ్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి విద్యార్థులను పరిశీలిస్తే.. కనీసం 50శాతం మంది విద్యార్థులు ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. 3వ తరగతి పిల్లలను చూస్తే 60శాతం మంది బేసిక్ సబ్ ట్రాక్షన్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలను చూస్తే 55శాతం మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు. 90శాతం మంది మూడో తరగతి విద్యార్థులకు బేసిక్ ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని అసర్ నివేదిక తేటతెల్లం చేసింది.
పాఠశాల విద్య, ఇంటర్ లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు
వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలుగా ఉంది. వైసీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలు, చర్చ లేకుండా సంస్కరణలు తీసుకువచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులపై, తల్లిదండ్రులపై రుద్దారు. 117 జీవోలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు 10,15 సంస్కరణలు తీసుకువస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నివారిస్తాం. అవుట్ కమ్ బేస్డ్ గా జరగాలని కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో పెట్టడం జరిగింది. రేపు కౌన్సిల్ కు వస్తుంది.
బోధనలో సాంకేతికతను జోడిస్తాం
బోధనలో సాంకేతికతను జోడిస్తాం. ఉపాధ్యాయులు కూడా పాఠాలు బోధించిన తర్వాత 60సెకన్ల వీడియో ప్రదర్శించి ఆ పాఠాన్ని సమ్మప్ చేసి, క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలను అసెస్ చేస్తాం. అక్కడి నుంచి ప్రిస్కిప్టివ్ హోంవర్క్ ఇస్తాం. మెగా టీచర్-పేరెంట్ మీటింగ్ ఇప్పటికే నిర్వహించాం. వచ్చే విద్యా సంవత్సరంలో రెండు సార్లు నిర్వహిస్తాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లల మధ్య ఇంటరాక్షన్ కోసం అద్భుతమైన ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డును కూడా రూపొందించడం జరిగింది.
మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు ద్వారా తరగతికో ఉపాధ్యాయుడిని కేటాయిస్తాం
మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ ద్వారా 60 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటే తరగతికో ఉపాధ్యాయుడిని కేటాయించి మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్నాం. ఇప్పుడు జరుగుతున్న పది, ఇంటర్ పరీక్షల్లోనే మార్పు కనిపిస్తుంది. వచ్చే విద్యాసంవత్సరంలో లీప్స్ అండ్ బౌండ్స్ అవుట్ కమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
అంతకుముందు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ.. 2019-24 మధ్య కాలంలో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోయాయని అసర్ నివేదిక స్పష్టం చేస్తోందని, పాఠశాలల్లో సదుపాయాలు కల్పించలేదన్నారు.
2018లో ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. వైసీపీ హయాంలో నాడు-నేడు కార్యక్రమం, 117 జీవోతో 3,4 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఆ ప్రయోగాలు వికటించాయి. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పాటు విద్యా ప్రమాణాలు పడిపోయాయి. అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో పిల్లలు ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ.. 2018 వరకు అన్ని పాఠశాలల్లో సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. 2022-24 మధ్య విద్యాప్రమాణాలు క్షీణించాయి. నాడు-నేడు పేరుతో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు.