- అసహనంతోనే టిడిపి కేడర్‌పై దాడులు
- కార్యకర్తలను వేధించే వైసిపి గూండాలను వదిలిపెట్టను
- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరిక
గురజాల : ఈ రాష్ట్రానికి వైసిపి అనే వైరస్ పట్టింది.. దానికి టిడిపినే వ్యాక్సిన్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసిపి భూ స్థాపితం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురజాలలో బుధవారం రాత్రి జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మీటింగ్ దాదాపు 6 గంటల ఆలస్యమైనా కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు. పల్నాడు మినీ మహానాడు నిర్వహించాలని అనుకున్నాం..కానీ వర్షాల కారణంగా రైతులను పరామర్శించేందుకు నేనే ఇక్కడకు వచ్చానని అన్నారు. భారీవర్షాల కారణంగా మిరప, పత్తి పంటలకు వర్షాల కారణంగా గరిష్టంగా ఎకరాకు లక్ష రూపాయల నష్టం వచ్చింది. సిఎం తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుంటే బాధలు తెలియవు.. ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడాలి. హుద్ హుద్ వస్తే తుఫాను వస్తే 24గంటల్లో నేను ప్రభావిత ప్రాంతానికి వెళ్లాను. ఈ సిఎం ఒక్క విపత్తుకు అయినా స్పందించాడా..పంట నష్టం పై చూడడానికి వచ్చాడా? గత ఏడాది మిర్చి పంటకు తెగులు వచ్చి తీవ్రంగా నష్టపోయినా పట్టించుకునే నాథుడే లేడన్నారు. పల్నాడు ప్రాంతంలో 157మంది రైతులు ఆత్మహత్యలు చేసు కున్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఎపి మూడవ స్థానంలో ఉంది. జగన్ మోసాలు చెయ్యడంలో దిట్ట.. అబద్దాల పుట్ట. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది. రైతులకు వచ్చే సబ్సిడీలు అన్నీ ఆపేశారు. స్కూళ్లలో నాడు నేడు అన్నాడు..కానీ ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి.
అసహనంతోనే టిడిపి కేడర్‌పై దాడులు
ప్రజా వ్యతిరేకత పెరగుతుండటంతో ప్రతిపక్ష నేతలపై వైసిపి గూండాలు అసహనంతో దాడులకు దిగుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబునాయుడు దుయ్యబట్టారు. ఈసారి ఓడిపోయాక జగన్ జీవితంలో ఎప్పటికీ సీఎం కాలేరని అన్నారు. జగన్ లాగా మీరు వ్యవహరిస్తే జైలుకు వెళ్లక తప్పదని పోలీసులను హెచ్చరించారు. వైసీపీ బెదిరింపులకు మేం భయపడం, ఏపీలో ఎవరికీ స్వేచ్ఛ లేదు, వైసీపీ అరాచకాలకు అడ్డుకట్టవేయాలని అన్నారు. వైసీపీ వైరస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టిడిపి కార్యకర్తలను వేధించే వైసీపీ నేతలను వదిలిపెట్టను, బాధితులకు అండగా ఉంటానని అన్నారు. మంత్రులు జగన్ కు పెంపుడు కుక్కల్లా పనిచేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ సీఎం కావడం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. ఆయన సీఎం అవ్వడం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమని అన్నారు.
ప్రజలపై భారాలు వేయడమే ఆయనకు తెలుసు
జగన్ కు ప్రజలపై భారం వేయడం తప్ప.. మరేమీ తెలియదు, రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్‌ను ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు. గడిచిన మూడున్నర ఏళ్లలో నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేం దుకు ఎవరూ ముందుకు రావడంలేదని తెలిపారు. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగిన టీడీపీ అండగా ఉంటుంది, మా మీద దాడులు చేస్తే ఖబర్దార్, మావారు కూడా తిరిగి దాడులు చేయడానికి వెనుకాడ బోరని హెచ్చరించారు. అమరావతిని నాశనం చేశారు.. పోలవరాన్ని గోదావరిలో కలి పారు… ఇదే మూడున్నరేళ్లలో జగన్‌రెడ్డి సాధించిన అభివృద్ధి అని అన్నారు.