- 1985లో తెదేపాపై ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు విజయం
అమరావతి (చైతన్య రథం): ఎన్నాళ్లకు -ఎన్నేళ్లకు? మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు పిలుపు.. 39 ఏళ్ల తరువాత సాధ్యమైంది. మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం జెండా విజయగర్వంతో రెపరెపలాడుతోంది. పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన నారా లోకేష్ భారీ విజయంతో పార్టీ చిరకాల స్వప్నానికి ఊపిర్లూదారు. టీడీపీ ఆవిర్భావం తరువాత 1983, 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. అప్పటి నుంచీ మంగళగిరి నియోజకవర్గం పొత్తులతో కొన్నాళ్లు, పట్టుచిక్కక కొన్నాళ్లు అందని నియోజకవర్గమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందస్తుగా ప్రకటించి.. మంగళగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని నాయకుడు అనిపించుకున్నారు.
టీడీపీ ఆవిర్భావం తరువాత 1983, 1985లో మంగళగిరిలో తెదేపా గెలిచింది. తరువాత 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గోలి వీరాంజనేయులు, 1994లో టీడీపీ పొత్తుతో సీపీఎంనుంచి ఎన్ రామమోహనరావు, 1999, 2004లో కాంగ్రెస్ నుంచి మురుగుడు హనుమంతరావు, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కాండ్రు కమల, 2014, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. దీంతో, మంగళగిరి సెగ్మెంట్ టీడీపీకి అందని ద్రాక్ష అయ్యింది. మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం జెండా ఎగురవేయడమే లక్ష్యమంటూ ప్రతినబూని బరిలోకి దిగిన లోకేష్.. అహర్నిశలు కష్టపడి, ప్రజల మనస్సులు గెలుచుకుని నియోజకవర్గంలో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు.
కలనేతల యువనేత!
యువనేత నారా లోకేష్‌ని చేనేతలు అక్కున చేర్చుకున్నారు. తమవాడిని చేసుకున్నారు. తమలో ఒకడని భావించారు. చేనేతల సంక్షేమం, మంగళగిరి ప్రజల బాగోగులు చూస్తూ నారా లోకేష్ చేనేతకు కలనేతయ్యాడు. మంగళగిరి చేనేతకు పెట్టింది పేరు. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా చేనేతల జనాభా ఉంది. చేనేతవర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమలవంటి వారు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఏనాడూ చేనేతల సంక్షేమం కోసం ఆలోచించలేదు. వాళ్ల వ్యక్తిగత ఆస్తులు పెరిగాయి తప్ప మంగళగిరి చేనేతల బతుకుచిత్రం మారలేదు. 2019లో మంగళగిరి నియోజకవర్గంనుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన నారా లోకేష్.. నేతన్నకు చేయూత అందిస్తూ వచ్చారు. పేదచేనేతలకు మగ్గాలు ఉచితంగా అందజేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా చేనేత మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇప్పించి.. కుట్టు మిషన్లు అందజేసి స్వయం ఉపాధి కల్పించారు. టాటా తనేరియా సహకారంతో మంగళగిరి చేనేత వస్త్రాలకు మంచి ధరలు అందించడంతోపాటు, దేశవ్యాప్తంగా బ్రాండిరగ్ కల్పించేందుకు కృషి చేశారు. తాను ఓడిపోయాడు, తన పార్టీ ప్రతిపక్షంలో ఉంది. తానేం చేయగలనని అనుకోలేదు. చేనేతలను దత్తత తీసుకుంటానని ప్రకటించాడు. మంగళగిరితోపాటు రాష్ట్రంలో చేనేతలను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాడు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి మంగళగిరి చేనేతలు నేసిన పట్టువస్త్రాన్ని బహూకరించి మంగళగిరి చేనేతకు దేశవ్యాప్త ప్రచారం కల్పించారు.